Pages

Tuesday

“ చతుష్పాదము ”

కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలపై; త్రేతాయుగంలో మూడు పాదాలపై; ద్వాపరయుగంలో రెండు పాదాలపై; ఇప్పటి మన కలియుగంలో ఒకే ఒక్క పాదంపై నడుస్తుందని యుగపురుషులైన మన ఋషులు ముందుగానే ఊహించి చెప్పారు. అది అక్షరాలా నిజం. రెండు పాదాలపై నడిచే మనిషి, నాడు, నేలను విడిచి సాము చేస్తుంటే, ఇంక ధర్మం ఒక పాదంపై కూడా నడిచే అవకాశం కనిపించటంలేదు. నిజం కాదంటారా? అడుగడుగునా, అయినదానికి, కానిదానికీ లంచాలతో నిండిపోయిన సమాజంతో జనం విసిగివేసారి పోవట్లేదా? ఎవరుకువారు అనుకోవట్లేదా?
నేటి మానవుని దశ అత్యంత ఉన్నతమైనదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఒకప్పుడు నాలుగు కాళ్ళపై నడిచిన ఆటవిక కోతి, పరిణామంచెంది, రెండు కాళ్ళపై నిట్టనిటారుగా నడుస్తూ, మిగిలిన రెండు కాళ్ళను చేతులుగా వాడుకుంటూ, పెరిగిన తెలివితేటలతో, సంపూర్ణంగా పరిణామంచెంది, నేటి మానవుడిగా రూపొందింది అని చెప్పబడుతున్నది. అందరూ ఒప్పుకుంటూనేవున్నారు సిద్ధాంతాన్ని.

అడవి జీవుల్ని, వాటి జీవితాల్ని చూస్తే, ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసివస్తుంది. ఎంత ఎదిగినా, పొందికగా, ఒద్దికగా జీవించాలనేది ముఖ్య విషయం. ఉదాహరణకి:– చెట్లను తీసుకుంటే, రావి, మర్రి మహావృక్షాలైనా, వాటికి చిన్న,చిన్న కాయలే కాస్తాయి. కాయ చిన్నదైతేనేం, వాటి వ్యాప్తి ఘనమైందే. ఆకాశంలోకి ఎదిగిపోయిందా అన్నట్లు కనిపించే తాటి చెట్లను చూడండి. వాటికికూడా చిన్న కాయలే ( గుమ్మడి కాయంత కాయలైతే, మన తల-కాయలేమవాలి? ). మరి గుమ్మడి తీగో? అతి పెద్ద కాయలు కాసినా, ఒద్దికగా, పొందికగా, నేలపై పాకుతుంది, లేదా మనం చెప్పినట్లు వింటూ, దేనిపైకైనా పాకిస్తే, అక్కడే పాకుతుంది.

మరి పక్షులు, జంతువుల సంగతేమిటి? సూర్యుడ్ని తాకిరాగల శక్తి వున్నా, ఆకాశంలో కొంత ఎత్తుమేరకే ఎగిరి, తిరిగి నేలమీదకే వచ్చి వాలతాయి పక్షులు. అడవికి రారాజైన సింహంగానీ, మెడ ఎత్తకుండానే, ఆరు మైళ్ళ అవతల వున్నవాటినికూడా చూడగలిగిన జిరాఫీలూ, ఏనుగులూ, తాముండే అడవికే లోబడి తమ జీవన సంసారాన్ని గడుపాతాయే కానీ, ఎన్నటికీ, వాటి పరిధి దాటవు. ఇన్ని మాటలెందుకు చెప్పండి. ఎక్కడికైనా దూసుకు పోగల నదులూ, సముద్రాలు ఏంచేస్తున్నాయి? తమ చుట్టూవున్న ఒడ్డుని అవి అతిక్రమిస్తున్నాయా? లేదే. ఇక సముద్రుడి మానస పుత్రికలు అదేనండీ మేఘాలు వాటి సంగతేమిటి? మేఘ రూపంలో ఆకాశంలోకి వెళ్ళికూర్చున్నా, తమ మూలాలెక్కడివో తెలుసుండే కదా అవి తిరిగి వర్షరూపంలో నేలమీదకు తిరిగి వస్తున్నాయి?
పైవాటన్నిటికీ కోటి కోరికలున్నప్పటికీ, అవి తమ జీవన పరిధిని, పరిమితిని తెలుసుకొని, పొందికగా, ఒద్దికగా వుంటున్నాయా? లేవా? ఇంతకీ ఇదంతా చెప్పానుకానీ, మనిషి సంగతి ఎందుకు చెప్పలేదంటారా? విషయం చెప్పేముందు ఒక ముఖ్యమైన విషయం వినండి చెబుతాను. .. .. ..

డార్విన్ సిద్ధాంతం నాలుగు కాళ్ళ జంతువులు-కోతి-జీవపరిణామ ప్రక్రియ-మానవుని అవతరణ వీటి గురించి. విశ్వంలోని అన్ని గ్రహాలు, వాటి,వాటి పరస్పర ఆకర్షణ శక్తి వలనే నిలిచి, చరిస్తుంటాయి. అలాగే, భూమి- భూమిపై సంచరించే జీవులు. భూమ్యాకర్షణశక్తి వల్ల, భూమిపై సమస్త చరాచరములు తమ గతిలో స్థిరమై వుంటాయి. భూమ్యాకర్షణ శక్తిలో విద్యుతు, అయస్కాంత శక్తులుకూడా మిళితమై వుంటాయి.

నా ఉద్దేశ్యంలో, పైన చెప్పిన శక్తుల కలయిక, జీవరాశులపై ఒక రకమైన ప్రభావాన్ని చూపుతాయి. చెట్లు పైకి పెరిగినా, వాటి మూలాలైన వ్రేళ్ళు భూమిలోనే వుంటాయి. నదులు, సముద్రాలు, భూమికి సమాంతరంగానే పారుతుంటాయి. ఇక నాలుగు కాళ్ళపై నడిచే జంతువుల విషయానికి వచ్చేసరికి, వీటి చూపు, పరిశీలన భూమికి సమాంతరంగానే వుంటుంది. అందుకనే, అవి, వాటి ఆహారంకోసం, ఒక నియమిత పరిధిలోనే వెతుక్కుంటాయి; వీటి ఆలోచనలు, ఆశలు (అలాంటివి వుంటాయి, వున్నాయని అనుకోండి ) నేలను విడిచి గాలిలో కత్తిసాము చేసినట్లుగా వుండవు; ఏవో ఒకటీ, రెండు జంతువుల్ని మినహాయిస్తే, అన్ని జంతువులు నేలబారుగా, పొడవుగా వుంటాయి, దాదాపుగా ఒక తోక వుంటుంది. ఒకప్పుడు, వీటికి ఆలోచనలు, ఆశలు ఎక్కువై, పరిధి దాటే స్థితి వచ్చినా, ఎక్కువైన ఆశలు కొంతభాగం తలలో వుండిపోయి, మిగిలిన భాగం తోకద్వారా బయటకు వచ్చి, సమానం కాబడతాయి. కాబట్టి, అత్యాశలు పెరిగే అవకాశమేలేదు. ఇవి గుంపులు, గుంపులుగా తిరుగుతుంటాయి కాబట్టి, ఒక దానికొకటి రక్షణ ఇచ్చుకుంటాయి; శత్రు భయమే లేదు.

ఇప్పుడిక అసలు విషయం, ఆఖరిది అయిన మానవుని విషయానికి వద్దాం. నాలుగు కాళ్ళపై నడిచి, పరిణామదశల్లో, రెండు కాళ్ళపై నడవడం నేర్చిన మానవుడు, రానురాను తెలివిమీరాడు. మొదలుగా తన తోటివారి సంపదను; తరువాత రాష్ట్ర, దేశ సంపదను; తరువాత ఇతర దేశాల సంపదలను దోచుకోవటం మొదలుపెట్టాడు. ప్రపంచ యుద్ధాలు ఇందుకు ఉదాహరణే కదండీ! పెరిగిన తెలివితో, భూమిపైన, భూమిలోపల, నీటిలోపల వుండే సంపదలను కొల్లగొట్టటం మొదలుపెట్టాడు. మరింత తెలివి పెరిగింది. కళ్ళు పైకి చూసాయి. గ్రహాలపై చూపుపడింది. ఆశ వుండటంలో తప్పులేదు. ఆశ రేపటి జీవనానికి సోపానం. అయితే, అత్యాశ దుఃఖానికి దారి తీస్తుంది. అత్యాశ, దానిని కలిగివున్న వారికే కాకుండా, చుట్టూవున్న వారికికూడా అంతులేని నష్టాన్ని కలుగచేస్తుంది. దీన్ని తెలుసుకోవటానికి ఎంతో విషయపరిజ్ఞానం అక్కరలేదు. ఉదా:– కిలో టోమేటాలకి అర్ధ రూపాయి వెలకట్టి రైతుకిచ్చి, ఆరు రూపాయలకి వినియోగదారుడికి అమ్ముతున్నారు; పదిహేను రూపాయలకి ఉత్పత్తి అయ్యే పెట్రోలును 56 రూపాయకి అమ్ముతున్నారు; అరవై సంవత్సరాలపాటు దేశంలో ఎవరికీ పన్నులులేకుండా వుండటానికి కావలసినంత నల్లధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నది; శాస్త్రజ్ఞానం అనిచెప్పి, పరమాణువులతో అణుబాంబు తయారుచేసి, మానవజాతి మనుగడకే ముప్పు తెచ్చాడు మానవుడు. చెప్పుకుంటూపోతే ఎన్నో, ఎన్నెన్నో.

ఉపసంహారం;– అందుకే అంటాను నేను, మానవుడు మళ్ళీ చతుష్పాదుడు కావాలని. వాటి లక్షణాలను గురించి పైనే చెప్పాను. ఇది అయ్యేపనేనా అని అంటారా? చరిత్ర పుఃనరావృతం అవుతూవుంటుందని చెప్తారు. అందులో సందేహం లేదుకదా? మరి నేను ప్రతిపాదించిన విషయంలో కూడా సందేహమెందుకు చెప్పండి? నా ఆలోచనని మీలో ఎవరైనా నెగిటివ్ థింకింగ్ అని అనవచ్చు. దానికి నా సమాధానం ఏమిటంటే, నెగిటివ్ థింకింగ్ స్థాయిలో మానవుడు పురోగతి చెందుతున్నాడు కాబట్టే, తిరోగతి తప్పదనేదే నా వాదన

From
మీతో చెప్పాలనుకున్నా!!!

No comments:

Post a Comment