Pages

Tuesday

“ సూర్యాస్తమయం ”


చైతన్యశక్తితో నడిచే విశాల విశ్వంలో అంతులేని వింతలు. వాటిలో కొన్ని మన కంటికి కనిపిస్తుంటాయి. అందులో ఒకటి సూర్యోదయం; ఒకటి సూర్యాస్తమయం. భూమండలానికి ఆధారమైనవాడు సూర్యుడు.

సాయంకాలం, ప్రతి రోజులాగే ఆరుగంటలకు సూర్యుడు అస్తమించాడు. జీవులలోని జీవగడియారంకూడా ఆరుగంటల్ని కొట్టింది. సూర్యోదయంనుంచి, సూర్యాస్తమయం వరకు ఎంతో చురుకుదనంతో పనిచేసిన మనిషి, తరువాత నిదానిస్తాడు; విశ్రాంతిని కోరుకుంటాడు. సూర్యాస్తమయంతో అలుముకున్న చీకటి రాత్రిలో విశ్రమించి, నిదురించి, మరల చైతన్యాన్ని పొంది, సూర్యోదయానికి ఉత్తేజితుడవుతాడు. కాలచక్రం ముందుకు తిరుగుతుంది. ఇదే పంథాలో అనేక పశుపక్ష్యాదులు, జంతువులు తమ జీవనాన్ని కొనసాగిస్తూవుంటాయి.
సూర్యాస్తమయింది. తమ సమయం ఆసన్నమయింది అన్నట్లుగా, చెట్లపై పండిన ఆకులు రాలిపడిపోతుంటాయి; పూలు రాలిపోతుంటాయి. రాలిన ఆకులు, పూలనుచూసి వీటి జీవితం సూర్యాస్తమయంతో ముగిసిపోయిందని అనిపించినా, మరొక ప్రక్క, ఒక నిజం మనకు కనిపిస్తుంది. రాలిన ప్రతి ఆకు, క్రొత్తగా చిగురించే మరొక ఆకుకు చోటునిస్తుంది, శక్తినిస్తుంది. రాలిన ప్రతి పువ్వు, వికసించటానికి తహతహలాడుతున్న మరొక మొగ్గకు చోటుకల్పిస్తుంది. ఇది జీవుల్లో సూర్యుడు నింపిన చైతన్య ప్రక్రియ.

పేరులోనే చైతన్యం కనిపించే సముద్రాలు, నదులు. సూర్యాస్తమయం కాగానే, జోలపాటకు జోగిన పసిపిల్లల్లాగా, అవి తమ జోరును తగ్గించుకొని, తమలోని చైతన్యాన్ని నిలువరింపు చేసుకుంటాయి. నిదురించే పసి పిల్లల్తో ఎలా ఆడుకోలేమో, అలాగే నిదురించే జలాలనుండి, స్నానంద్వారా చైతన్యాన్ని పొందలేము. స్థబ్దంగావుండే జలాలనుండి మన శరీరాలు విద్యుత్ తరంగ శక్తిని పొందలేవు. అందుకనే, మన శాస్త్రాల్లో, రాత్రి సమయాల్లో సముద్ర జలాల్లో, నదీ జలాల్లో స్నాసం చేయవద్దంటారు.

ఇలా ఎన్నోరకాలుగా సూర్యుడు మనకు, ఇతర జీవులకు సహాయాన్ని అందిస్తూనేవున్నా, పాపం, మనంమాత్రం ( కాలంవారే సుమా! ) సూర్యుడికి అందించే కృతజ్ఞతలు ఒక పాలు తక్కువేనండి. ఎండాకాలం వచ్చిందంటే ఆయనకు గొడుగు అడ్డంపెట్టి, ముఖం చాటేస్తాం; వారం రోజుల్లో, తన వారం ఆదివారం అని ఆయన మురిస్తే, మనంమాత్రం ఆదివారంకూడా ప్రొద్దున్నే లేవాలా?” అని సణుక్కుంటూ, సూర్యకిరణాలుకూడా సోకకుండా కిటికి తలుపుల్ని బిడాయించేస్తాం. పైగా, మధ్యాహ్నం తరువాత లేచి, అప్పుడే ఆదివారం అయిపోయిందా? సూర్యుడికి ఏంపనిలేదు. ఊరికినే ఉరుకులు, పరుగులు పెట్టేబదులు, ఆదివారం అయినా కొంత నెమ్మదిగా తన ప్రయాణం సాగించవచ్చుగదా! అని ఆయనపై మండిపడతాం. ఇదండీ సంగతి. అయినా పాపం, సూర్యభగవానుడు మనపై కోపం తెచ్చుకోడు. అస్తమయం తరువాత, తను నేరుగా శక్తినివ్వకపోయినా, చల్లని చంద్రునిద్వారా మన మనస్సుకు ఎంతో హాయినిస్తాడు. ఎంతో ఇంత చేసినా, సామాన్యుడినుంచి, మహాకవులవరకూ అందరూ, అనేకరకాలుగా చంద్రుడినే పొగడ్తలతో ముంచెత్తుతారు కానీ, పాపం, సూర్యుడ్ని అంతగా పట్టించుకోరు. ఏం చేస్తాం, లోకం ఇట్లా తయారయింది.

ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించినట్లే, ఒక సూర్యాస్తమయం, మరొక సూర్యోదయాన్ని, నవోదయాన్ని, నవ చైతన్యాన్ని తీసుకువస్తూనే వుంటుంది!.

From
మీతో చెప్పాలనుకున్నా!!! 

No comments:

Post a Comment