Pages

Tuesday

“సహజ గురువు – నా ‘నీడ’ ”


బ్రతికున్నంతకాలం, వద్దన్నా, మన వెంబడే వుండేది, మన నీడ లేదా ఛాయ; పోయిన తరువాత వద్దన్నా, మన వెంబడే వచ్చేవి పాప, పుణ్యాలు అని పెద్దలు చెబుతుంటారు.
సూర్యుడికి మనం అభిముఖంగా వున్నప్పుడు, మన నీడ మన వెనకవైపుకు పడుతుంది. సూర్యుడు మన వెనకవైపు వున్నప్పుడు, నీడ మన ముందుకు పడుతుంది. సూర్యుడు నడినెత్తిన వున్నప్పుడు, నీడ అసలు కనబడక, మన శరీరంలోనే అంతర్లీనమవుతుంది. మూడింటిని గురించి కొంచెం వివరంగా చెబుతాను. ఆధ్యాత్మిక పరంగా నీడను గురించి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు:
మొదటిది: ‘నీడ భగవంతుని చాయ :– భగవంతుడు ఎక్కడోలేడు, మనలోనే వుంటాడు అని పెద్దలు చెబుతారు. భగవంతుని నమ్మి, పనిచేసినా, భగవంతుడి కృపవల్లే జరిగింది అని నమ్మే వారు చాలామంది వుంటారు. ఇది చాలా గొప్ప విషయం; లోతైనదీ. ఎందుకంటే, అన్నీ నేనే చేసాను అని అనుకున్నప్పుడు, మనలో అహం పైకి పెరుగుతుంది. అదే, భగవంతుడి వలనే జరిగింది అని అనుకున్నప్పుడు, మనలోని అహంకారం అణగొట్టబడి, నిష్క్రియాతత్వం పెరుగుతుంది. ఇప్పుడు, మనం నీడను గురించి మాట్లాడుకుందాం. సూర్యుడికి అభిముఖంగా వున్నప్పుడు, మన వెనుక నీడ పడుతుందిగదా. అంటే, మనం చేసే ప్రతి పని వెనుక, మనం నడిచే ప్రతి అడుగు వెనకాల, భగవంతుడు వెన్నుదన్నుగా వున్నాడని అర్ధం. ఇక, సూర్యుడు మన వెనుక వైపు వున్నాడనుకోండి. నీడ మన ముందుకు పడుతుంది. మన జీవన ప్రయాణంలో, అడుగడుగున భగవంతుడు మనకు ముందుండి త్రోవ చూపుతున్నాడు అని అనుకోవచ్చు. సూర్యుడు మన నడినెత్తిన వున్నప్పుడు, అసలు నీడే ఏర్పడదు. అంటే, మనం భగవంతుడిలో సంపూర్ణంగా మమేకమయ్యామని అర్ధం చెప్పుకోవచ్చు. మనసా, వాచా, కర్మణా ప్రతిపనీ భగవంతుని తోడుగా చేసినట్లే. మూడు రకాల నీడల తత్త్వాన్ని మనం అర్ధంచేసుకొని, ఆచరిస్తే, గీతాబోధనను మనం అనుసరించినట్లే.
రెండవది: ‘ నీడ అజ్ఞానానికి ఛాయ :- సూర్యునికి అభిముఖంగా మనం వున్నప్పుడు, మన నీడ మన వెనుకవైపుకు పడుతుంది. సూర్యుడు, లేదా, వెలుగు అనబడే జ్ఞాన జ్యోతి పథంవైపుకి మనం ముందడుగు వేస్తున్నా, అజ్ఞానమనే ఛాయ ఎప్పుడూ మనల్ని వెన్నంటే వుంటుంది. క్షణంలో, నాకు అంతా తెలిసిపోయింది, నేను ఇప్పుడు సంపూర్ణ జ్ఞానవంతుడ్ని అని అనుకున్నామో, మరు క్షణం అజ్ఞానమనే ఛాయ మనల్ని ఆవరించినట్లే. ఎందుకంటే, మనిషీ సంపూర్ణ జ్ఞానికాడు. ఇక, సూర్యుడు మన వెనుక వున్నప్పుడు, నీడ మనకు ముందు పడుతుంది. వెలుగు అనే జ్ఞానాన్ని మనమంతట మనమే, మన శరీరంతో అడ్డుకొని, అజ్ఞానమనే ముందు ఛాయను ఏర్పరుచుకుంటున్నామన్నమాట. అంటే, మనం వేసే ప్రతి ముందడుగు, చీకటిలోకే. ఇక, సూర్యుడు మనకు నడినెత్తిన వున్నప్పుడు, నీడ కనపడక, మనలో అంతర్లీనమై పోతుంది. లేదా అదృశ్యమైపోతుంది. అంటే, మన స్వీయ ప్రయత్నంద్వారా అజ్ఞానాన్ని తొలగింపచేసుకుంటున్నామని అర్ధం. అంటే జ్ఞానాన్ని మనలో నింపుకుంటున్నామని అర్ధం. ఇది ప్రగతికి గుర్తు. ఉదాహరణగా ఒక పెట్రొమాక్స్ లైట్ని మన నెత్తిమీద పెట్టుకున్నామనుకోండి. మన మీద, క్రింద, చుట్టుప్రక్కలంతా కూడా వెలుగే వుంటుంది. వెలుగు పడిన చోటులో చీకటి అనేది వుండదుకదా! అట్లాగే, జ్ఞానమున్న చోట, అజ్ఞానంకూడా వుండదు, వుండలేదు.
మరి అందుకే, ప్రకృతిలోవున్న అనేక సహజ గురువుల్లో, “నీడను కూడా ఒక గురువుగా నేను స్వీకరిస్తాను. మరి మీరేమంటారు?

From
మీతో చెప్పాలనుకున్నా!!! 

No comments:

Post a Comment