Monday

ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కుట్రపూరితం


-నాయర్‌తోపాటు మరో ముగ్గురి పాత్ర ఉంది
-పారదర్శకతకు పాతరేశారు
-నిగ్గు తేల్చిన ప్రత్యూష కమిటీ నివేదిక
-మరో నలుగురిపై చర్యలకు సిఫారసు
-నివేదిక వివక్షపూరితం: నాయర్
-ప్రధాని మౌనమెందుకు?: బీజేపీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5:వివాదాస్పద ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కుట్రపూరితమని, ఈ ఒప్పందంలో ఇస్రో మాజీ చీఫ్ జీ మాధవన్‌తోపాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తల పాత్ర ఉందని ఉన్నతస్థాయి కమిటీ నిర్ధారించింది. ఈ ఒప్పందంలో పారదర్శకత ఏమాత్రం లేకపోగా.. తీవ్రమైన పరిపాలన, విధానపరమైన లోపాలు ఉన్నాయని తేల్చిచెప్పింది. ఇందుకు కారణమైన నాయర్‌తోపాటు సహచరులపై చర్యలు తీసుకోవాల్సిందేనని సిఫారసు చేసింది. ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందంపై విచారణకు ఏర్పాటయిన కేంద్ర విజిపూన్స్ కమిషన్ మాజీ చీఫ్ ప్రత్యూష సిన్హా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ మేరకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే ఇప్పటికే నాయర్‌తోపాటు, ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు ఏ భాస్కరనారాయణ, కేఆర్ శ్రీధరమూర్తి, కేఎన్ శంకరలపై కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పదవులు నిర్వహించకుండా వీరిపై నిషేధం విధించింది. దీంతో భగ్గుమన్న మాధవన్ నాయర్ తమపై చర్యలు తీసుకోవడానికి కారణమైన కమిటీ నివేదికను బయటపెట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం శనివారం రాత్రి ప్రత్యూష కమిటీ నివేదికను వెల్లడించింది. అయితే ఈ నివేదిక పూర్తిగా వివక్షపూరితంగా ఉందని, నివేదికలో తనకు అనుకూలంగా ఉన్న భాగాలను మాత్రమే ఇస్రో విడుదల చేసిందని, ఇది పిరికిచర్యని ఇస్రో చీఫ్ కే రాధాకృష్ణన్‌పై మాధవన్ నాయర్ ధ్వజమెత్తారు.

నివేదిక సారాంశమిది..
70 మెగాహెర్జ్ ఎస్ బ్యాండ్ స్పెక్ట్రంను ప్రవేటు సంస్థ దేవాస్‌కు కట్టబెడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగమైన ఆంత్రిక్స్.. చేసుకున్న ఒప్పందంపై విచారణ జరిపేందుకు గత ఏడాది మే 31న ప్రత్యూష నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ కేంద్రం ఏర్పాటు చేసింది. ఒప్పందంలోని నిబంధనలు చాలావరకు దేవాస్‌కు అనుకూలంగా ఉన్నాయని కమిటీ తన నివేదికలో తప్పుబట్టింది. ‘ఒప్పందంలో తీవ్రమైన పరిపాలన, విధానపరమైన లొసుగులు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో కొందరు వ్యక్తుల కుట్రపూరిత ప్రవర్తన ఉన్నట్లు తెలుస్తోంది. సదరు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది. ‘ఒప్పందం కోసం దేవాస్‌ను ఎంచుకోవడంలోనూ పారదర్శకత, జాగరూకత లోపించినట్లు కనిపిస్తోంది’ అని తెలిపింది. ఒప్పందంపై కేంద్ర కేబినెట్‌కు, స్పేస్ కమిషన్‌కు సరైన, కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేదని తెలిపింది. ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందం జనవరి 2, 2005న కుదిరినా, స్పేస్ కమిషన్‌కు వెంటనే తెలుపలేదని, ఈ ఒప్పందం కింద నిర్మించతల పెట్టిన జీశాట్-6 ప్రయోగ అనుమతి కోసం నవంబర్ 27, 2005న సమర్పించిన కేబినెట్ నోట్‌లోనూ దీని ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం శాటిలైట్ ప్రయోగం విఫలమైతే.. పూర్తి రిస్క్ అంతరిక్ష సంస్థదేనని, విజయవంతమైతే మాత్రం తర్వాత దశ వ్యయమంతా ఇస్రో భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒప్పందం కుదర్చుకునే ఉద్దేశంతో దేవాస్‌ను అంతర్జాతీయ వినియోగదారుడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారని, అయితే ఒప్పందంలో దీని రిజిష్టర్ చిరునామా బెంగళూరులో ఉండటం విస్తుగొలుపుతోందని పేర్కొంది.

ఈ ఒప్పందం కోసం అంతరిక్ష న్యాయ విభాగాలు, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని స్పష్టం చేసింది. ఇన్‌శాట్ కార్పొరేషన్ కమిటీ(ఐసీసీ)ను సంప్రదించకుండానే జీశాట్ సామర్థ్యాన్ని (కెపాసిటీని) దేవాస్‌కు కట్టబెట్టారని, ఇలా చేయడం ప్రభుత్వ విధానాన్ని ముమ్మాటికీ ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. ఈ ఒప్పందం విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ఎస్‌ఎస్ మీనాక్షిసుందరం, వీణారావు, జీ బాలాచంవూదన్, ఆర్‌జీ నాదాదూర్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. కాగా ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందంతో దేశ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లందన్న వాదనను బీకే చతుర్వేది, రొద్దం నరసింహలతో కూడిన హై పవర్డ్ రివ్యూ కమిటీ తోసిపుచ్చింది. ఎస్ బ్యాండ్‌ను కారుచౌకగా దేవాస్‌కు కట్టబెట్టారన్న వాదన నిరాధారమైనదని పేర్కొంది.

ఇది పిరికి చర్య: నాయర్
బెంగళూరు: ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందంలో తనపై వేటుకు సిఫారసు చేసిన నివేదిక తప్పులతడకగా, లోపభూయిష్టంగా ఉందని ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ మండిపడ్డారు. ‘ఇస్రో.. నివేదిక లోని తమకు అనుకూలంగా ఉన్న భాగాలను ఎంచుకొని ప్రజల ముందు పెట్టారు. ఇది పూర్తిగా అన్యా యం. నివేదికను పూర్తిగా ప్రజల ముందు పెట్టాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఆంత్రిక్స్- దేవాస్ ఒప్పందంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ ప్రశ్నించింది. కాగా, ఈ ఒప్పందం విషయంలో మాధ వన్ నాయర్ దేశాన్ని తప్పుదోవ పట్టించారని పీఎంఓ సహాయ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు.

దేవాస్‌పై దర్యాప్తు చేయాలి: ప్రత్యూష కమిటీ సిఫారసు
బెంగళూరు, ఫిబ్రవరి 5: ఆంత్రిక్స్‌తో వివాదాస్పద ఒప్పందం చేసుకున్న దేవాస్ సంస్థ కార్యకలాపాలపై, అది ప్రారంభమైన నాటి నుంచి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ప్రత్యూష సిన్హా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసింది. లక్ష రూపాయల పెట్టుబడితో దేవాస్‌ను 2004 డిసెంబర్‌లో అమెరికాకు చెందిన ఫోర్జ్ అడ్వైజర్స్ సంస్థ(ఎఫ్‌ఏయూఎస్‌ఏ) ప్రారంభించిందని, అయితే ఇందులో మొదట వాటాదారులుగా ఉన్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త డీ వేణుగోపాల్‌కు పది రూపాయల ముఖ విలువ గల 9 వేల షేర్లు ఉండగా, ఎం ఉమేశ్ అనే వ్యక్తికి మిగతా వెయ్యి వాటాలు ఉన్నాయని తెలిపింది. ఈ సంస్థ 2005 జనవరిలో ఆంత్రిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోగా, ఆ తర్వాత ఏడాది కాలంలోనే 12 మంది వాటాదారులతో దేవాస్ సాధారణ షేర్ మూలధనం రూ. ఐదు లక్షలకు చేరిందని, ఈ సమయంలోనే ఇస్రోకు ప్రజెం ఇచ్చే ఎఫ్‌ఏయూఎస్‌ఏ బృందానికి చెందిన ముగ్గురు దేవాస్‌లోకి ప్రవేశించారని వారికి 60శాతం సాధారణ షేర్ మూలధనం ఉందని వివరించింది. మార్చి 31, 2010నాటికి దేవాస్ వాటాదారుల సంఖ్య 17కు చేరిందని వెల్లడించింది. ఇస్రో మాజీ సైంటిఫిక్ కార్యదర్శి అయిన భాస్కరనారాయణ అమెరికా పర్యటనలో దేవాస్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారని నివేదిక స్పష్టంచేసింది.

0 comments:

Post a Comment