Friday

అమెరికన్ల చూసు భారత్ వైపు...




 అమెరికా అంటే అవకాశాల ఆవలిగడ్డ. ఆపర్చునిటీల స్వర్గధామం. కాసుల పంట పండించే బంగారు క్షేత్రం. కానీ.. ఇదంతా గతం. ఇప్పుడు అమెరికా అంటే.. ఆర్థిక సంక్షోభం దెబ్బకు కుదేలైన విఫల ఆర్థిక వ్యవస్థ. నిరుద్యోగిత ప్రబలిన సాధారణ దేశం. అందుకే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది! అక్కడివారు ఉద్యోగాల కోసం ఇక్కడికి రావడం షురూ అయింది. అందుకు ఉదాహరణ.. విన్ బ్రెన్నెట్! అమెరికాలోని మినియపోలిస్‌లో పుట్టి పెరిగిన విన్‌బ్రెన్నెట్ (24) గత మూడేళ్లుగా ముంబైలో ఐసీఐసీఐ బ్యాంకులో ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలపై 2009లో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బెన్నెట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే సమయానికి.. అమెరికాను ఆర్థిక మాంద్యం కమ్ముకొని ఉంది. నిరుద్యోగిత పెరిగిపోయింది. దీంతో అతను ఉద్యోగాన్వేషణలో భాగంగా భారత దేశానికి చేరుకున్నాడు. ఉద్యోగం కోసం ఇండియానే ఎందుకు ఎంచుకున్నారని అడిగితే.. అమెరికాలో భారతీయులు స్నేహపూరితంగా ఉంటారని, ఇక్కడి చాలా కంపెనీలకు పాశ్చాత్యదేశాల్లో విస్తృతమైన నెట్‌వర్క్‌లున్నాయని ఇవి ఇంకా పెరుగుతున్నాయని వివరించాడు.

నిజానికి అమెరికాలో పట్టభద్రులు సంపాదించే ఆదాయంతో పోలిస్తే ఇక్కడా వారికి వచ్చే జీతాలు తక్కువే. కానీ, అక్కడితో పోల్చితే ఇక్కడ ఖర్చులూ తక్కువే కాబట్టి అదేమీ పెద్ద సమస్య కాదని బెన్నెట్ అభిప్రాయపడ్డాడు. ఒక్క బెన్నెటే కాదు.. ఆర్థిక మాంద్యం దెబ్బకు గత మూడు నాలుగేళ్లుగా ఉద్యోగాల కోసం ఇండియా వైపు ఆశగా చూస్తున్న అమెరికన్ పట్టభద్రుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు.. ప్రతిభావంతులైన అభ్యర్థుల కోసం భారతీయ కంపెనీలు కూడా విదేశాల్లో నియామక కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ఉదాహరణకు.. స్నాప్‌డీల్ వెబ్‌సైట్ సహవ్యవస్థాపకుడు కునాల్ బహ్ల్ ఇటీవలే అమెరికాలో రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించి దేశానికి తిరిగివచ్చారు. స్నాప్‌డీల్ సంస్థ యూఎస్‌లో రిక్రూట్‌మెంట్ చేపడుతోందని తెలియగానే పట్టభద్రుల నుంచి 2000కు పైగా రెజ్యూమేలు వచ్చాయి. అందులో 30 శాతం విదేశీయులవే కావడం గమనార్హం. "అమెరికన్లు ఉద్యోగాల కోసం భారతదేశంవైపు చూడటానికి కారణం అక్కడ ఉద్యోగాలు లేక కాదు, వారు కోరుకునే తరహా ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల'' అని వివరిస్తారు బహ్ల్. స్నాప్‌డీల్ తరహాలోనే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా మోటార్స్ వంటి భారతీయ సంస్థలు న్యూజెర్సీలో నిర్వహించిన ఉద్యోగమేళాలో పాల్గొన్నాయి.

ఇన్ఫోసిస్ సంస్థ అయితే ఏటా 100 మంది అమెరికన్లను నియమించుకుంటోంది. "మా దగ్గర స్టాన్‌ఫోర్డ్, హార్వార్డ్.. చివరకు మస్సాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీ పట్టభద్రులు ఉన్నారు'' అని ఇన్ఫోసిస్ గ్లోబల్ ఇంటర్నల్‌షిప్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బ్రియాన్నా డైటర్ వివరించారు. మన కంపెనీలే కాదు, భవిష్యత్తులో అమెరికన్ కంపెనీలు కూడా భారత్‌లో శాఖలు ప్రారంభించి తమ ఉద్యోగుల్ని ఇక్కడికే తరలిస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కిందటేడాది సెప్టెంబర్‌లోనే అంచనా వేసింది.

మనవాళ్లూ...
అమెరికన్లే కాదు.. ఆర్థికమాంద్యం నేపథ్యంలో అక్కడ చదువుకున్న భారతీయ విద్యార్థులూ మళ్లీ సొంతగడ్డకు తిరిగిరావడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఒకప్పుడు.. అక్కడి యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్లేవారు అక్కడే ఉద్యోగాలు చేసి స్థిరపడిపోవడానికి మొగ్గుచూపేవారు. ఇప్పుడా ట్రెండ్ మారింది. "విదేశాల్లో ఉంటూ.. భారతదేశానికి తిరిగి రావాలనుకునే విద్యార్థుల నుంచి ఇటీవలి కాలంలో ఉద్యోగాలు కోరుతూ వస్తున్న దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగింది''అని నౌక్‌రీ డాట్ కాం సీఈవో హితేష్ ఓబెరాయ్ వివరిస్తున్నారు.

"విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది భారతీయులు ఇప్పుడు సొంతగడ్డకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు'' అని ఫ్లిప్‌కార్ట్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షుడు మెకిన్ మహేశ్వరి తెలిపారు. అమెరికాలోని యూనివర్సిటీలు కూడా ఈ సరికొత్త ట్రెండ్‌ను స్వాగతిస్తున్నాయి. "మా వర్సిటీ విద్యార్థులు 400 మందిలో 20 శాతం మంది దాకా ఆసియా దేశాల్లో ఈ మధ్యే ఉద్యోగాల్లో చేరారు'' అని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్‌లో సైమన్‌స్కూల్ ఆఫ్ బిజినెస్ సీనియర్ అసోసియేట్ డీన్ రాజీవ్ దేవన్ వివరించారు.

ఆయన క్లాసులో ఉన్న 40 మంది భారతీయుల్లో పదిమంది ఈ విధంగా సొంతగడ్డకు తిరిగి వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అదీకాక.. "గతంలో ఇలా విదేశాల నుంచి ఉద్యోగాల కోసం భారతదేశానికి తిరిగి వెళ్లడం అంటే వైఫల్యంగా భావించేవారు. ఇప్పుడలా ఎవ్వరూ అనుకోవట్లేదు'' అని దేవన్ వివరించారు.

'ద ఫేస్ ఆఫ్ ఇంపీరియలిజం' పుస్తక రచయిత మైకేల్ పరేంటీ.. "ఇన్నాళ్లుగా అమెరికా తన ప్రయోజనాలకు, వ్యాపారానికి అనుగుణంగా ప్రపంచం క్షేమంగా ఉండేలా కృషి చేస్తూవచ్చింది. కానీ.. ఇప్పుడు గ్లోబల్ షిఫ్టింగ్ మొదలైంది'' అని తన పుస్తకంలో రాశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణలే ఇప్పుడు జరుగుతున్నవన్నీ!! ఒక్క భారతదేశ కంపెనీలే కాదు, ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల సంస్థలు సైతం అలసిసొలసి ఆగిపోయిన అమెరికా ఆర్థికవ్యవస్థ నుంచి ప్రయోజనాలు పొందేందుకు కృషి చేస్తున్నాయని పెరెంటీ వివరించారు.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ 2015 నాటికి 10వేల మంది అమెరికన్, యూరోపియన్ నిపుణుల్ని తమ సంస్థలో నియమించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల సంఖ్య దాదాపు 3000. వచ్చే ఏడాది మరో 1500 మంది విదేశీయుల్ని నియమించే ఆలోచనలో హెచ్‌సీఎల్ ఉంది. ఈమేరకు ఆ సంస్థ అమెరికాలోని 12 యూనివర్సిటీలు, కాలేజీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

జూ భారతదేశపు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ టాటా గ్రూప్ 2012 మార్చి నాటికి 1200 మంది యూఎస్ నిపుణుల్ని విధుల్లోకి తీసుకోవాలని భావిస్తోంది. లాటిన్ అమెరికాలో తన శాఖల కోసం ఈ సంస్థ 98 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడం గమనార్హం.

జూ విప్రో సంస్థ.. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో అమెరికా తరఫున పోరాడిన 400 మంది మాజీ సైనికులను ఉద్యోగాల్లోకి తీసుకుని వారికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. ఇందుకోసం వాషింగ్టన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, మైక్రోసాఫ్ట్ వంటివాటితో ఒప్పందాలు కుదుర్చుకుంది.

..అయితే విదేశీయుల్ని నియమించుకునే ప్రక్రియ ఖరీదైన వ్యవహారం అయిపోకుండా ఈ కంపెనీలన్నీ అమలు చేస్తున్న కీలక వ్యూహం ఏంటో తెలుసా? తాజా పట్టభద్రులకు అవకాశాలు ఇవ్వడం. ఇవి నియమించుకునే వారిలో 70 శాతం మంది అప్పుడే డిగ్రీ పూర్తిచేసినవారు! వాట్ ఏన్ ఐడియా సర్జీ!!

0 comments:

Post a Comment