Saturday

చిట్టి ఉడుత ఉర్రూతలు!

చిన్న చిన్న రెమ్మల వీడి
చిట్టి ఉడుత ఉర్రూతలు
నిటారు కొమ్మలకెదిగే
పళ్ళొచ్చేసే, వొళ్ళు బూరయ్యే
మొత్తంగా మరి చూపొచ్చేసే
ఇక చెట్టు దిగి పరుగులెట్టచ్చు
పప్పుగింజలేరుకోవచ్చు
దరికావల కొత్త ఉడుతల కిచకిచలు
సావాసాలు చిందులాటలు ఆరాటాలు
సరిలే దరి దాటచ్చులే
తేరిపార చూడవలె
భధ్రంగా నుండవలె
దారుల్లో బారులుగా జోరుగా
వెరపెరుగని చక్రాల బండ్లు
శరవేగంగా పరుగులెట్టేవే గాని
ఆగి పరామర్శించేవి కావు సుమా
చిట్టి ఉడుత దరి దాటడాలు
తికమకలో చిట్టి, గంతులాటల్లో చిట్టి
‘కీచ్.. మంటూ ఆగీ ఆగని బండి చక్రాలు
నలిగిపడె చిట్టి ఉడుత లేత పాదాలు
ఆగి పోయే చిట్టి ఉడుత ఊపిరులు
ఒదిగె చిట్టి ఉడుత పసి వొళ్ళు
చిట్టి ఉడుతా! తగనే తగవు
నీకీ తొందరలు, ఇంతలా ఉరకలు
(చిట్టి ఉడుతలు పుట్టినప్పుడు చూపు,
బూరు, పళ్ళు లేకపోవడం, ఆ పై తరుగుతూనే పెరుగుతూ పోయే ముందు పళ్ళు ఉండడం విశేషం)

0 comments:

Post a Comment