Wednesday

ముల్లైపెరియార్ డ్యాం కేంద్రంగా జల వివాదం...


కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా నలుగుతున్న ముల్లైపెరియార్ డ్యాం వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. కేరళ రాష్ట్రంలో నిర్మితమై, తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ఈ డ్యాం చుట్టూతా అనేక చిక్కుముళ్ళు అలుముకున్నాయి. ముల్లైపెరియార్ డ్యాం కాలంచెల్లిపోవడంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే లక్షలాది మంది ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని, అందువల్ల దాని స్థానంలో కొత్త డ్యాంను నిర్మించాలని కేరళీయులు డిమాండ్ చేస్తున్నారు.

డ్యాం భద్రతపై లేనిపోని అపోహలను కల్పించి నీటి మట్టం తగ్గించడం ద్వారా తమిళనాడు వ్యవసాయం దెబ్బతిన్నందువల్ల నీటి నిల్వ పరిమాణాన్ని పెంచాలని తమిళతంబిలు ఆందోళనలకు దిగారు. దాంతో ముల్లైపెరియార్ డ్యాం కేంద్రంగా ఆ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడమే కాక, రాస్తారోకోలు, బంద్‌లతో ఆందోళన బాట పట్టారు. తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలు కేరళకు వ్యతిరేకంగా ఆర్థిక దిగ్బంధనానికి పిలుపు ఇచ్చాయి.

ముల్లైపెరియార్ డ్యాం కాలం చెల్లిపోయిందని, దానిస్థానంలో మరో కొత్త డ్యాంను నిర్మించాలన్న కేరళ కేబినెట్ తీర్మానానికి ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ మద్దతు పలికాయి. డ్యాం భద్రతకు ఢోకాలేదని, ఆ రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో కేరళ రాజకీయ పార్టీలు ముల్లైపెరియార్ డ్యాం తేనెతుట్టెను కదిపాయని తమిళనాడు పార్టీలు ఆరోపిస్తున్నాయి. మలయాళం దర్శకుడు సోహన్‌రాయ్ దర్శకత్వంలోని బహు భాషా చిత్రం డ్యాం-999 ముల్లైపెరియార్ వివాదానికి ఆజ్యం పోసింది. 1975లో చైనాలో కూలిపోయిన బాంకియావో డ్యాం వల్ల కలిగిన భారీ ప్రాణ నష్టం, బీభత్సం ఆధారంగా రూపొందిన ఓ డాక్యుమెంటరీ ఆధారంగా డ్యాం-999 చిత్రాన్ని నిర్మించారు.

ఆ దుర్ఘటనలో దాదాపు రెండున్నర లక్షల మంది దుర్మరణం పాలయ్యారు. వాస్తవంలో ఈ చిత్ర సన్నివేశాలకు డ్యాంతో ఎలాంటి సంబంధం లేపోయినా రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న డ్యాం వివాదం నేపథ్యంలో జయలలిత ప్రభుత్వం డ్యాం-999 చిత్రాన్ని నిషేధించింది. ఇది ప్రజల్లో లేనిపోని అపోహలకు తావిచ్చినట్లయింది.

పశ్చిమ కనుమలకు చెందిన కార్డమమ్ హిల్స్‌లో పెరియార్ నది, దాని ఉపనది ముల్లైయార్ నదుల సంగమ ప్రాంతంలో ముల్లైపెరియార్ డ్యాంను ట్రావన్కూర్ సంస్థానంలోని ఇడుక్కి జిల్లా తెక్కాడి ప్రాంతంలో బ్రిటీష్ పాలకులు 1886లో నిర్మించారు. కేరళలో పడమటి దిశగా పయనించి అరేబియా సముద్రంలో కలుస్తున్న పెరియార్‌నదిని ఈ డ్యాం ద్వారా మధురై ప్రాంతంలో అరకొర నీటి లభ్యతతో ప్రవహించే వైగై నదిలోకి తరలించి తూర్పున బంగాళా ఖాతంలోకి మళ్ళించడం ఆనాడు ఒక మహాద్భుతం.

ఈ డ్యాం ద్వారా మధురై ప్రాంతంలోని నీటి ఎద్దడిని, పెరియార్ నది వల్ల ట్రావన్కూర్ సంస్థానం ఎదుర్కొంటున్న వరద సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లయింది. ముల్లై పెరియార్ డ్యాం తమిళనాడుకు చెందిన థేని, మధురై, శివగంగ, రాంనాడ్ జిలాల్లకు జీవనాధారంగా నిలిచింది. ఆ ప్రాంతాల సాగునీరు, తాగునీరు, విద్యుత్తులకు ఈ డ్యామే ప్రధానాధారం. బ్రిటీష్ కాలంనాటి ఒప్పందాన్ని 1970లో ఈ రెండు రాష్ట్రాలు తిరిగి పొడిగించాయి.

176 అడుగుల ఎత్తు ఉన్న ఈ డ్యాంను సున్నం, సుర్ఖీ (ఇటుకల పొడి, పంచదార, కాల్చిన సున్నాల మిశ్రమం)ల తో నిర్మించారు. 1979లో గుజరాత్‌లోని మార్వి డ్యాం కూలిపోవడంతో 25వేల మంది మరణించారు. ఆనాటి నుంచి ముల్లైపెరియార్ డ్యాంపై కేరళలో ఆందోళన మొదలైంది. కేరళ తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ ఎర్ట్ సైన్స్ స్టడీస్ (సెస్) డ్యాం భద్రతపై అధ్యయనం చేసి, రిక్టర్ స్కేలుపై 6 అంతకు మించిన తీవ్రతతో భూకంపం వస్తే డ్యాం కూలిపోతుందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఐఐటి రూర్కీ, ఐఐఎస్‌సి సంస్థలు కూడా నిర్ధారించాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా డ్యాం భద్రతను పరిశీలించి నీటి మట్టాన్ని 142.2 అడుగుల నుంచి 136 అడుగులకు తగ్గించాలని ఆదేశించింది.

1997లో సంభంవించిన భూ ప్రకంపనలకు డ్యాంకు బీటలు వచ్చాయి. డ్యాం కూలిపోతే కేరళకు చెందిన ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళంతో సహా ఐదు జిల్లాలలో మొత్తం 70 లక్షల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడనున్నాయని కేరళ వాదిస్తోంది. అదీకాక భూతాపం పెరిగిన కారణంగా సంభవించిన వాతావరణ మార్పుల రీత్యా వచ్చే అకాల కుంభవృష్టులు కూడా డ్యాం భద్రతకు సవాలుగా ఉన్నాయి.బ్రిటిష్ కాలంనాటి వందేళ్ళకు పైబడిన ఒప్పందం విశ్వసనీయతపై కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

డ్యాం నీటి మట్టాన్ని తగ్గించడం వల్ల 1985-2005 మధ్య కాలంలో 40వేల కోట్ల రూపాయలకు పైబడి తమిళనాడు ఆయకట్టు రైతాంగానికి నష్టం వచ్చిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2006లో డ్యాం నీటి మట్టం 142 అడుగుల ఎత్తువరకు పెంచుకోవచ్చని తీర్పు ఇవ్వడంతో రెండు రాష్ట్రాల మధ్యలో వివాదం మరింత ముదిరింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను కేరళ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కేరళ ప్రభుత్వం నీటి మట్టం పెంపుదలను వ్యతిరేకిస్తూ 'డ్యాం భద్రతా చట్టం'ను రూపొందించింది. '2006 కేరళ సాగు, తాగునీరు సంరక్షణ (సవరణ) చట్టం' ద్వారా ముల్లైపెరియార్ డ్యాం స్థానంలో మరో కొత్త డ్యాంను నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది.

ఈ అంతర్‌రాష్ట్ర వివాదాన్ని పరిష్కరించేందుకు 2010లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎస్.అనంద్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన సాధికార కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అయితే ఆ కమిటీ ఏర్పాటును తమిళనాడు వ్యతిరేకించడంతో వివాదాస్పదంగా మారింది. 2002 ఏప్రిల్ నాటికి ఆ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించవలసి ఉన్నది. అయితే గడువు సమీపించే కొద్దీ రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు డ్యాం వివాదాన్ని తీవ్రతరం చేశారు.

ఈ అంతర్‌రాష్ట్ర డ్యాం వివాదంపై కేంద్రం మధ్యవర్తిత్వం నెరపి సత్వరమే పరిష్కరించవలసి ఉన్నది. అయితే ఇప్పటికే వరుస అవినీతి కుంభకోణాలు, ఇతర రాజకీయ సమస్యల్లో కూరుకుపోయిన కేంద్రం ముల్లైపెరియార్ డ్యాం వివాదాన్ని పరిష్కరించడంలో చొరవ చూపకపోవడంతో ఆ వివాదం మరింత జటిలంగా మారింది. ఈ వివాదంపై యూపీఏ నాయకులు చిదంబరం, వాయిలార్‌రవిల పొంతన లేని ప్రకటనలు రెండు రాష్ట్రాల ప్రజల్లో మరింత గందరగోళాన్ని సృష్టించాయి.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముల్లై పెరియార్ డ్యాం రక్షణ కోసం భద్రతా దళాలను నియమించాలని కోరారు. కేంద్రం అనువైన పరిష్కారాన్ని కనుగొనేంత వరకు రెండు రాష్ట్రాల ప్రజలు, రాజకీయనాయకులు సంయమనం పాటించాలని, అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరారు. సాధికార కమిటీ పరిశీలనలో ఉన్న వివాదంపై ప్రధాని మన్మోహన్ సింగ్ సారధ్యంలోని నేషనల్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎమ్ఏ) ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని ఏర ్పరచడం మరొక వివాదం ముందుకొచ్చింది.

ఈ కమిటీని తమిళనాడు రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరే కించి ఆందోళన చేస్తున్నాయి. ముల్లై పెరియార్ డ్యాం వివాదం దేశంలో సరికొత్త సమస్యని ఆవిష్కరించింది. వందేళ్ళు దాటిన డ్యాంలు దేశంలో దాదాపు 115 దాకా ఉండగా, మన రాష్ట్రంలో 13 దాకా ఉన్నాయి. వీటన్నిటి భవిష్యత్‌పై కేంద్రం సమగ్ర అధ్యయనం జరిపించవలసిన అవసరం ఉంది. అంతరాష్ట్ర వివాదాలు తలెత్తినపుడు రాజకీయ లబ్ధిని చూసుకోకుండా ప్రజలందరికీ అమోదయోగ్యమైన పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నించాలి. భవిష్యత్తులో సంభవించబోయే జలవివాదాలను దృష్టిలో ఉంచుకుని డ్యాంల భద్రతపై ఒక సమగ్రమైన జాతీయ విధానాన్ని రూపొందించాలి.

0 comments:

Post a Comment