Friday

గాయపడిన జవాన్లకు ఇదా మనమిచ్చే గౌరవం?


క్షణం కూడా విరామం లేకుండా శత ఘ్నులు పేలుతున్నాయి. రైఫిళ్లు మోగుతున్నాయి. ఇరుపక్షాల సైనికులు ఒక్కరొక్కరుగా ఒరిగిపోతున్నారు. కొందరు నెత్తురోడుతూ కూడా యుద్ధం చేస్తున్నారు. ఆ దృశ్యం వొళ్లు గగుర్పాటు కలిగిస్తోంది!! సినిమాల్లో వార్‌సీన్ ఇంతవరకే చూపుతారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే క్రమంలో గాయపడి,ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆ తరువాత ఏం చేస్తారు? శత్రువుల పాలిట సింహస్వప్నంగా పోరాడిన వారు అంగవైకల్యంతో శేషజీవితాన్ని ఎలా గడుపుతారనే అంశం చాలా మందికి పట్టదు. అలాంటి వీరజవాన్లు అందరినీ ఇటీవల ఒకచోట చేర్చి, వారి యోగక్షేమాలు విచారించారు ఆర్మీ అధికారులు. పోరులో గాయపడిన మాజీ సైనికులను కదిలిస్తే చాలు వీరగాధలు ఉబికివస్తాయి. వారి కథలు వింటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి.

కాశ్మీర్‌లోని దేశ సరిహద్దు అయిన రాజౌరి సెక్టార్ అది... 2000 సంవత్సరం...జూన్ పదో తేదీ...సమయం తెల్లవారుజామున నాలుగున్నర గంటలు... సరిహద్దుల్లోని లైన్ఆఫ్ కంట్రోల్‌లో భుజాన రైఫిల్, చేతిలో హాండ్ గ్రెనేడ్‌లు పట్టుకొని పహరా కాస్తున్న వీర సైనికుడు బుద్దల జయకృష్ణకు పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి ఓ మిలిటెంట్ మన దేశ సరిహద్దుల్లోకి రావటం కనిపించింది... మరుక్షణం జయకృష్ణ తన చేతిలో ఉన్న ఓ హాండ్ గ్రెనెడ్‌ను మిలిటెంట్‌పై విసిరారు. ఆ గ్రెనెడ్ ధాటికి ఆ మిలిటెంట్ నేలకొరిగాడు. ఇంకెవరైనా మిలిటెంట్లు వెంట ఉండవచ్చనే అనుమానంతో మరో గ్రెనెడ్‌ను విసిరేందుకు పిన్ను తీశారు. గ్రెనెడ్ విసిరే లోపే అది చేతిలో ఢాం అంటూ పేలింది.

దీంతో జయకృష్ణ చేతులు తెగి ముక్కలుగా కిందపడిపోయాయి. రక్తంతో దేహమంతా తడిసిముద్దయింది. తోటి సైనికులు వెంటనే హెలికాప్టర్‌ను రప్పించి అతన్ని ఉదంపూర్‌లోని నార్త్‌కమాండ్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి, మిలిటెంట్‌ను మట్టుబెట్టిన జయకృష్ణది శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బిన్నల కొత్తూరు గ్రామం. నాడు దేశం కోసం పోరాడి రెండు చేతులు కోల్పోయిన జయకృష్ణ నేడు తన కుటుంబపోషణ కోసం జీవనపోరాటం చేస్తున్నారు. కొంత కాలం విద్యావాలంటీర్‌గా పనిచేసిన ఆయన వికలాంగ సైనికుల కోటాలో ఏదైనా చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమని సర్కారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

లోయలో పడి...కాలు కోల్పోయి
2001వ సంవత్సరం కాశ్మీర్‌లోని యూరి సెక్టార్ అది...మంచుతో కప్పేసి ఉన్న దేశ సరిహద్దుల్లో ఇన్‌ఫాంట్రీ సిపాయి కె. శ్రీనివాసరావు ఎస్ఎల్ఆర్, రైఫిళ్లను భుజాన వేసుకొని చేతిలో హాండ్ గ్రెనెడ్‌లు పట్టుకొని రాత్రివేళ పహరా కాస్తున్నారు. ఆ సమయంలో ఆయన కాళ్లకింద వున్న మంచు కరిగి ఒక్కసారిగా లోయలో పడిపోయాడు. ఆయన కాలు విరిగిపోయింది. అలాగే ఒక రోజంతా ఆ లోయలోనే మంచుగడ్డల మధ్య గడిపాడు శ్రీనివాసరావు. అనంతరం తోటి సైనికులు గమనించి శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని కాలు తీసేశారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన శ్రీనివాసరావు జిల్లా సైనికసంక్షేమశాఖలో వాచ్‌మెన్‌గా కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి, బతుకుబండి లాగిస్తున్నారు. నాలుగేళ్లుగా నాలుగువేల రూపాయల కాంట్రాక్టు వేతనంపై వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మాజీ వికలాంగ సైనికుడిని ఆ కాంట్రాక్టు ఉద్యోగం నుంచి కూడా ప్రభుత్వం బడ్జెట్ లేదనే సాకుతో తొలగించింది. దీంతో మళ్లీ రోడ్డున పడిన ఆయన తనకు ఏదైనా ఉద్యోగమివ్వండని కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

శ్రీలంకలో మందుపాతర పేలుడులో...
శ్రీలంకలో శాంతిదళంలో పనిచేసేందుకు వెళ్లిన మన దేశ సైనికుడు కె.వెంకట్రావు ఎల్‌టీటీఈ తీవ్రవాదులు పెట్టిన మందుపాతర పేలుడులో తీవ్రంగా గాయపడారు. శ్రీలంక దేశంలోని కొమ్మరపట్టీ ప్రాంతంలో ఉన్న ఎల్‌టీటీఈ రహస్య స్థావరంపై మెరుపుదాడి చేసిన మన భారతదేశ సైనికులు విజయం సాధించారు. తీవ్రవాదులందరినీ మట్టుబెట్టి తిరిగి సైనిక స్థావరానికి వస్తుండగా మార్గమధ్యంలో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు మందు పాతర పేల్చారు.

ఈ పేలుడు ధాటికి కె. వెంకట్రావు శరీరంలోకి ఇనుపముక్కలు చొచ్చుకుపోయి తీవ్రంగా గాయపడ్టారు. ఎడమకన్ను కోల్పోయి, కుడిచేయి దెబ్బతిని శరీరం అంతా గాయాలతో వికలాంగుడిగా మారారు. గాయపడి వికలాంగులుగా మారిన మాజీ సైనికుల సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదని అంటారు కె. వెంకట్రావు . వ్యవసాయభూమి, ఇంటిస్థలం ఇవ్వాలని జీవోలు ఉన్నా , రాష్ట్ర సర్కారు మాత్రం తమను పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వేదనలో వందలాది కుటుంబాలు
దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో భాగంగా ఆంధ్రా సబ్ఏరియా పరిధిలో 205 మంది సైనికులు గాయపడ్డారు. గాయపడి, డిజేబుల్డ్ పెన్షన్‌తో గడుపుతున్న సైనికుల సంక్షేమానికి సైనిక శాఖ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అలాంటి వారిని ఆదుకునేందుకు ఈ సంవత్సరాన్ని డిజేబుల్డ్ సోల్జర్స్ సంవత్సరంగా ప్రకటించింది. ఆ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో సైన్యంలో గాయపడిన వారందరినీ ఒకచోట చేర్చింది. గాయపడిన మాజీ సైనికుల్లో కాళ్లు లేని వారికి సుజుకీ మాడిఫైడ్ స్కూటర్లు, వీల్ ఛైర్‌లు, నగదు బహుమతులు అందించారు. మాజీ సైనికులకు ఉచితంగా మిలటరీ ఆసుపత్రి వైద్యబృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

కాళ్లు లేని వారికి కృత్రిమ పాదాలు అమర్చటంతోపాటు వృత్తివిద్యాకోర్సులు, కంప్యూటర్, కుట్లు, అల్లికల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గాయపడిన మాజీ సైనికులకు ఉపాధితోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఆలస్యంగానైనా దేశ రక్షణ కోసం గాయపడిన సైనికులకు ఆదుకునేందుకు సైనికశాఖ చర్యలు తీసుకోవటం శుభపరిణామం. సైనిక శాఖ సహాయం చేస్తే సరిపోదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించినప్పుడే మా కుటుంబాలు చల్లగా వుంటాయని వికలాంగులైన సైనికుల కుటుంబాలు కోరుతున్నాయి. దేశం కోసం ప్రాణాలకు తెగిస్తున్న వీరజవాన్లందరికీ జేజేలు

హేట్సాఫ్ మేజర్ చక్రధర్
అది సరిహద్దుల్లోని కాశ్మీర్ లోయ ప్రాంతం... పాకిస్థాన్ టెర్రరిస్టులు మన దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తున్నారు. వారిని తరిమికొట్టేందుకు ఆపరేషన్ పరాక్రమ్‌ను మన దేశ సైనికులు చేపట్టారు. హైదరాబాద్ శివార్లలోని ఈసీఐఎల్‌కు చెందిన మేజర్ సీసీ చక్రధర్ సరిహద్దుల్లోని బంకరులో ఉండి శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. శత్రువులు తూటాలు వస్తున్న బంకరును పేల్చివేసేందుకు ఓ గ్రెనెడ్‌ను వేశారు. అంతే...బంకరులో హాండ్ గ్రెనెడ్ పేలటంతో దానినుంచి వచ్చిన ఇనుప ముక్కలు చేయి, నుదురు, ముక్కు, కాళ్లలోకి చొచ్చుకుపోయాయి. వొళ్లంతా గాయాలు, రక్తం.

అయినా మోక్కవోని దీక్షతో దేశ రక్షణే ధ్యేయంగా మేజర్ చక్రధర్ గాయపడినా లెక్క చేయకుండా మూడు గంటలపాటు శత్రువులపై కాల్పులు జరిపారు. సరిహద్దుల్లో శత్రువులు నేలకొరిగారని చూసి ప్రత్యర్థుల నుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత మిలటరీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడా మేజర్. గాయపడినా, ఆపకుండా కాల్పులు జరిపి శత్రువులను మట్టుపెట్టిన మేజర్ చక్రధర్ తల్లిదండ్రులిద్దరూ ఆర్మీ అధికారులే కావటం విశేషం. ప్రస్తుతం గోల్కొండ ఆర్టిలరీ సెంటరులో పనిచేస్తున్న మేజర్ చక్రధర్ దేశ రక్షణ కోసం పనిచేయటంలోనే తనకు ఆనందం లభిస్తుందంటారు.

0 comments:

Post a Comment