Thursday

ఈజిప్టు ప్రధానిగా ఎల్‌బరాదీ...!

కైరో, నవంబర్ 22: నూతన ప్రధానిగా మాజీ ఐఏఈఏ చీఫ్ మహమ్మద్ ఎల్ బరాదీని నియమించే అవకశాలను ఈజిప్టు పాలక సైనిక మండలి (మిలటరీ కౌన్సిల్) నిశితంగా పరిశీలిస్తోంది. దేశంలో త్వరగా ప్రజాస్వామ్యం నెలకొల్పాలని కోరుతూ ఆందోళనలు తీవ్రతరమైన సంగతి తెలిసిందే. మూడురోజులుగా జరిగిన ఆందోళనల్లో 35 మంది మరణించగా, ప్రధాని ఎస్సామ్ షరాఫ్ నాయకత్వంలోని మంత్రిమండలి సోమవారం రాజీనామా చేసింది. ప్రస్తుత సంక్షోభం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సైనికదళాల సర్వోన్నత మండలి(ఎస్‌సీఏఎఫ్) అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

నూతన ప్రధానిగా ఎల్‌బరాదీని నియమించే అవకాశాన్ని ఎస్‌సీఏఎఫ్ పరిశీలిస్తోంది. షరాఫ్ రాజీనామాతోపాటు నవంబర్ 28న జరగాల్సిన పార్లమెంటరీ ఎన్నికలను వాయిదా వేయరాదన్న అంశాన్ని ఎస్‌సీఏఎఫ్ పరిశీలిస్తోంది. సుదీర్ఘకాలం పాలించిన హోస్నీ ముబారక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటికి సాగనంపాక తిరిగి ఇటీవల ఈజిప్టులో సంక్షోభం ఏర్పడింది. తాహ్రిర్ స్క్వేర్ వద్ద మంగళవారం జరిగిన 'మిలియన్ మార్చ్'లో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.

టునీషియాలో రాజ్యంగసభ ప్రారంభం
టునీస్: నూతనంగా ఎన్నికైన రాజ్యాంగ సభ మంగళవారం ప్రారంభం కావడంతో టునీషియా ప్రజాస్వామ్య శకంలోకి ప్రవేశించినట్టైంది. 217 మంది సభ్యులు గల రాజ్యాంగసభ సమావేశంలో ఇస్లామిస్టు ఎన్నాహ్‌దా పార్టీకి చెందిన హమాది జెబాలీ ప్రధాని పదవిని, కాంగ్రెస్ ఫర్ రిపబ్లిక్(సీపీఆర్)కు చెందిన మాన్సెఫ్ మార్ జౌకీ అధ్యక్ష పదవిని స్వీకరిస్తారు. నూతన సభాపతిగా ఎట్టకటోల్ పార్టీకి చెందిన ముస్తాఫా బెన్ జాఫర్ వ్యవహరిస్తారు.

0 comments:

Post a Comment