ప్రపంచంలో దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థల్లో చైనా తర్వాత స్థానం మనదే.వినియోగదారుల పరంగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే. కానీ, మానవాభివృద్ధి సూచీలో మాత్రం.. 134వ స్థానం. అంటే ప్రపంచంలో భారత దేశం కన్నా తక్కువ మానవాభివృద్ధి కలిగిన దేశాలు కేవలం 48 మాత్రమే.
ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతున్నామని చంకలు కొట్టుకుంటున్న నేతలు అవమానంతో తలదించుకోవలసిందే. ఎందుకంటే యుద్ధంతో అతలాకుతలమైన ఇరాక్ కన్నా.. ఆసియాలో ఓ చిన్న దేశమైన ఫిలిప్పైన్స్ కన్నా.. ఎప్పుడూ కరువుతో అల్లల్లాడే ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల కన్నా మన స్థానం కిందే ఉన్నది కనుక.
ప్రపంచ మానవాభివృద్ధి సూచీ 2011ను ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసింది. ఆరోగ్యం, విద్య, ప్రజల ఆదాయం ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో మొత్తం 187 దేశాల్లో.. మన దేశం 134వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో శ్రీలంక 97వ స్థానంతో, చైనా 101, మాల్దీవులు 109, ఫిలిప్పైన్స్ 112, ఇరాక్ 132వ స్థానంతో భారత్ కన్నా ముందున్నాయి.
దేశంలో సగానికి పైగా పేదలేనని నివేదిక స్పష్టం చేసింది. ఉండరా మరి? మానవాభివ్రుద్దిని మరిచిపోయి అవినీతి అభివ్రుద్దిలో మునిగిపోయిన పరిపాలనా వేత్తలు ఉన్నంత వరకు మనదేశంలో మానవాభివ్రుద్దికి చోటులేదు.
మానవాభివృద్ధి సూచీ అనేది ఏ యేటికాయేడు పోల్చేది కాదని, అభివృద్ధి సూచీల్లో మార్పును గమనించాలంటే దానికి చాలా సమయం పడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్ అన్నారు. బహుస 65 ఏళ్ళుకు ముందే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందనే విషయం ఆయన మరచిపోయినట్లున్నారు.
మానవాభివృద్ధి విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంకా వెనుకబడే ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా దేశ ఆర్థిక వ్యవస్థ సాధిస్తున్న ఎనిమిది... తొమ్మిది శాతం అభివృద్ధి పేదల జీవన ప్రమాణాలను ఏమాత్రమూ మెరుగు పర్చలేదు. దీనికి బాధ్యత వహించవలసింది మన పరిపాలకులే. ఈ విషయంలో ఎంకెవరినీ తప్పుబట్టకూడదు.
ప్రస్తుతం ప్రంపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ 6శాతానికి తగ్గకుండా వార్షికాభివృద్ధి ఉంటుందని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. కాని దాని ఫలితాలు మాత్రం సాధారణ ప్రజానీకానికి చేరడం లేదనేదే అసలు నిజం.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్ధికాభివృద్ధి చెందుతున్న దేశం చైనా. ఇదే సమయంలో ప్రజల విద్య, ఆరోగ్య స్ధాయిలనుకూడ గణనీయంగా పెంచుకుంటూ మానవాభివృద్ధిలో సైతం తన స్ధానాన్ని అంతకంతకూ వేగంగా పెంచుకుంటూ వస్తున్నది. ఈ విషయాన్ని మన పాలకులు గమనించరెందుకనో?
మన పాలకులలో మానవత్వం తగ్గిపోవడం వలనే మన దేశంలో మానవాభివృద్ధి తగ్గిపోయిందేమో అనిపిస్తోంది.
0 comments:
Post a Comment