Pages

Tuesday

“ వైచిత్ర్యము ” ( విచిత్రం )


విశ్వం వైవిధ్యభరితం. వివిధ రూపాల, రంగురంగుల పువ్వులు, ఆకులు; వివిధ రూపాల, రంగురంగుల సూక్ష్మజీవులు, జలచరాలు; పక్షులు, జంతువులు, మానవులు. ఆకాశంలోకి చూస్తే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు; నేలమీద చూస్తే కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, పశుపక్ష్యాదులు, చెట్లు,చేమలు, మనుషులు; భూగర్భంలోకి చూస్తే ఖనిజాలు; సముద్రంలోకి చూస్తే వైవిధ్యమైన జలచరాలు, మొక్కలు, ఎన్నో, ఇంకా ఎన్నెన్నో.

ప్రతి జీవికి ఒక నిర్దుష్టమైన జీవనశైలి వుంది. కానీ, ఒక్క మనిషికి మాత్రం తనకంటూ స్వంతమైన జీవనశైలి లేదు. ప్రకృతిలోని మిగిలిన అన్ని జీవులను పరిశీలించి, అనుకరిస్తూ, ఒక మిశ్రమ జీవనశైలిని ఏర్పరచుకున్నాడు.

మానసికంగా ఎంతో పరిణితి చెందిన మనిషిని మినహాయిస్తే, ఇతర జీవులకు తెలిసిన విద్యలు, వున్న తెలివితేటలు పరిమితమైనవే. స్థూలంగా చూస్తే బ్రతకటానికి ఆహారం సంపాదించుకోవటం; సంతానోత్పత్తికి కొంత శృంగారం చేయటమే వాటికి తెలుసు. కానీ, మనిషి వైవిధ్యభరితంగా బ్రతకటం నేర్చుకున్నాడు. ఆనందంగా వుండటానికి అనేక మార్గాలను అన్వేషించుకున్నాడు. అయినా, ఇంకా ఏదో తెలియని ఆనందంకోసం ప్రయత్నిస్తూనేవున్నాడు. మరి, అతని ఆనంద లోకాల్లోకి ఒకసారి తొంగి చూద్దామా?


నదిలో మంచినీళ్ళు పారుతున్నాయి. ఒకడికి దాహం వేసింది. తన దోసిలితో నీళ్ళు త్రాగాడు. దాహం తీరింది. తన భార్యకు దోసిలితో నీళ్ళు పట్టుకెళ్ళాడు. ఆమెకు పట్టేటప్పటికల్లా కొంచెం నీరే మిగిలింది. ఆమె దాహం తీరలేదు. మళ్ళీ,మళ్ళి నీళ్ళు పట్టుకొచ్చాడు దోసిలితో, అలిసిపోయాడు, ఆలోచనలోపడ్డాడు. మట్టిని పిసికి, కుండలు తయారుచేసాడు; వాటిలో నీటిని నిలువచేసుకోగలిగాడు. మట్టికుండలోని నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. అదే మట్టితో తన ప్రతిరూపాన్ని మలుచుకున్నాడు. అందులో జీవకళ ఊడిపడింది. తనకుతానే, తనను తానే ప్రతి సృష్టి చేసుకున్నందుకు ఎంతో మురిసిపోయాడు. ఆనందం పొందాడు.
అతనికి ఆకలివేసింది. ఒక జంతువును వేటాడదామంటే శస్త్రంలాంటిది ఏమీలేదు. భూమిని దున్ని గింజల్ని నాటి, మొక్కల్ని పెంచుదామనుకున్నాడు. చేతి గోళ్ళతో భూమిని దున్నాడు. కొంత సేపటికే అలిసిపోయాడు. ఆకలి దహించివేస్తున్నది. ఆలోచనలో పడ్డాడు. ఇనుముని కరిగించాడు బాణం ములుకులను, ఈటెలను తయారుచేసాడు. శస్త్రాలతో జంతువులను వేటాడాడు; నాగలితో భూమిని దున్నాడు. ఇంకా రకరకాల పనిముట్లను తయారుచేసాదు; తన మేధస్సుకు పదునుపెట్టాడు. ఆనందం పొందాడు.


భరించలేని ఎండ, వాన, చలి. అతను తట్టుకోలేకపోతున్నాడు. తనను తాను రక్షించుకోవాలి. ఆలోచనలో పడ్డాడు. కొండరాళ్ళను చూసాడు. తను తయారుచేసుకున్న పనిముట్లతో వాటిని ముక్కలుచేసాడు ఇంటిని కట్టుకున్నాడు స్నానం చేయటానికి తొట్టిని నిర్మించుకున్నాడు; తన సృజనతో, ఉలి సహాయంతో రాళ్ళను మలిచాడు; కళాఖండాలను సృష్టించి, ఇంటికి అలంకరణ చేసాదు. తన పనిలో ఎంతో ఆనందాన్ని అనుభవించాడు.

అతను అడవికి వెళ్ళాడు. వంటచెరకుకోసం ఎండిన చెట్లను నరికి తెచ్చుకున్నాడు. జీవంకోల్పోయి, నేలరాలి, ఎండి పడివున్న చెట్లమానుల్లో ఏవో అవ్యక్తమైన రూపాలను చూసాడు ఆలోచనలో పడ్డాడు. అందమైన కళామూర్తులను తీర్చిదిద్దాడు. వాటికి జీవంపోసాడు. వాటిని చూసుకొని చెప్పలేని ఆనందాన్ని పొందాడు.
భూమిని తవ్వుతున్నాడు. మట్టిపై సూర్యుని కిరణాలు పడ్డాయి. మట్టి మిల,మిలా మెరిసిపోయింది. అది పసిడి అని గ్రహించాడు, పసిడిని కరిగించాడు. అప్పటికే ఎదిగిన తన మేధస్సుతో పసిడికి రూపాన్ని ఇచ్చాడు; వన్నెను తెచ్చాడు. బంగారు ఆభరణాలను చిత్ర,విచిత్రంగా మలిచాడు. అందులో రంగురాళ్ళను పొదిగాడు. రంగురాళ్ళపై పడుతున్న సూర్యకిరణకాంతులు, దీపకాంతులు, ఇంద్రధనస్సులోని రంగులనుపోలి, వెన్నెలను చిలుకుతున్నాయి. అది అతనిలో ఏదో తెలియని ఆనందాన్ని నింపింది.


అతడు మట్టితో కుండల్ని చేసాడు, బొమ్మల్ని మలిచాడు; ఇనుమును కరిగించి పనిముట్లను తయారుచేసాడు, భూమిని దున్నాడు; రాతిని తొలిచాడు, ఇళ్ళను కట్టాడు, శిల్పాలను చెక్కాడు; కట్టెలో కళాకృతులను ఊహించాడు, వాటిని జీవంవుట్టిపడే బొమ్మలుగా చెక్కాడు, తన ఇంటిలో అలంకరించాడు; మట్టిలో దొరికిన బంగారంతో అందమైన ఆభరణాలను తయారుచేసాడు, తనను, తన వారిని వాటితో అలంకరించాడు అన్నిట్లో ఎంతోకొంత ఆనందం పొందాదు. కానీ, ఇంకా ఏదో తెలియని వెలితి. తను ధరించిన ఆభరణాలు ఎంత అందాన్ని ఇస్తున్నాయో తెలుసుకోవాలనే ఒక కోరిక. అప్పటికి అతని మేధస్సుకు అద్దాన్ని తయారుచేసే ఆలోచన తట్టలేదు. ఆకులు, పువ్వులనుంచి రంగులు ఊరటం గమనించాడు. ఉడత వెంట్రుకలతో కుంచెలను తయారుచేసి, రంగుల్లో ముంచి, గోడలపై, నేలపై ఇళ్ళను, చెట్లను, పక్షులను, పొలాలను, తన పిల్లలను, భార్యను, వారు అలంకరించుకున్న ఆభరణాలను చిత్రీకరించాడు. ఇప్పుడతను ఒక చిత్రకారుడు. తన చిత్రీకరణలో తన మనోభావాలను, భౌతిక దృశ్యాలను చూసుకొని ఎంతో ఆనందాన్ని అనుభవించాడు.
అతనిలో ఇంకా, ఇంకా, ఇంకా ఏదో తెలియని వెలితి. తను పూర్తిగా ఆనందాన్ని పొందలేకపోతున్నాననే అసంతృప్తి. తన మనసులోని భావాలను, భౌతిక దృశ్యాలను చిత్రీకరణ చేయగలిగాడుగానీ, వాటిని ఇతరులకు చెప్పలేకపోతున్నాననే ఆవేదన అతనిలో పెరిగిపోయింది. ఆలోచనల తీవ్రత పెరిగింది. మౌనం దాల్చాడు. ‘మౌనమే నీ భాష మూగమనసా! ’ అన్నట్లుగా అతని మౌనం నుంచి అతనిలోని భావాలు మాటలై, మాటలు పదాలై, పదాలు పద్యాలై, కవితలై అతనిలోని లోపలి మనిషిని బయటకు తీసుకువచ్చి, తన చుట్టూవున్నవారికి పరిచయంచేసాయి.


అతని మొట్టమొదటి మాటలు వికృతి పదాలై, తదనంతరం ప్రకృతి పదాలుగా దొర్లినాయి; అతని పదాలు అనేక సంధులతో కవితామార్గంలో సందులు తిరుగుతూ, అనేక సమాసాలతో కవితాపల్లకినెక్కాయి; పల్లకినిమోసే బోయీలు చేసే శబ్దాల్లాగా, అతని పదాలు విభక్తులను పలుకుతూ, ఛందస్సు, యతినియమాలతో, గణ, ప్రాసలతో వృత్తాలు తిరుగుతూ, ఉపమానాలతో అలంకరింపబడి, ఒకసారి తియ్యని తేనెలొలికే తేటగీతి పద్యాలై; మరొకసారి పదాలతో ఆటలాడినట్లుగా ఆటవెలదులై; ఇంకొకసారి ఏనుగులను, పులులను మరిపించేటట్లుగా మత్తేభ, శార్దూలాలై; మల్లెల వాసనలను గుబాళించేలాగా ఉత్పలమాలలై; సుకుమార కన్నియలను తలపించేనట్ట్లుగా చంపకమాలలై అతని కవిత్వం విరాజిల్లింది; అతని మనస్సు పరిణితి చెందింది. అతడు ఎంతో ఆనందాన్ని పొందాడు.


ఉపసంహారం:– ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక శిల్పి, ఒక వడ్రంగి, ఒక స్వర్ణకారుడు, ఒక చిత్రకారుడు, ఒక కవి వీరందరూ ఒక పూదండలోని వివిధ పుష్పాల్లాంటివారే. పూదండలోని దారంలా వీరందరినీ కలిపి కట్టేసింది, ప్రకృతిలో మమేకం చేసింది వారి మనస్సు, వారి హృదయాలే. వారి పనులలో ఒక కళవుంది. వారి మనసుల్లో ఒక సారూప్యతవుంది. అదే మనిషిలోని సంస్కారాన్ని ఆవిష్కరించింది ఒకరిలో, అందరిలోనూ. ఇదే ఒక వైచిత్ర్యము!!


From
మీతో చెప్పాలనుకున్నా!!! 

No comments:

Post a Comment