అందానికి చిట్కాలు చెప్పేవాళ్ళు ఎంతమంది వుంటారో, అంతకన్న రెట్టింపు వాటిని వినేవాళ్ళుంటారు. మరి అందానికున్న ప్రాముఖ్యత అది. అయితే, అందానికి చిట్కాలు చెప్పకుండా, ఆనందానికి చిట్కాలు ఎందుకు చెబుతున్నారని మీరు నన్ను అడగవచ్చు. ఎందుకో, మీతో చెప్పాలనుకున్నాను. ఆలకించండి.
అందం; ఆనందం. ఈ రెండు మాటలను వినగానే, ఒక గొప్ప కవి వ్రాసిన సినీగీతం మనందరికీ గుర్తుకొస్తుంది. అది, “ అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం …. ….”. ఈ పాటలో చాలా లోతైన, నిగూఢమైన అర్ధం వుంది. అసలు అందం ముందా? ఆనందం ముందా? అందముంటే, ఆనందం వున్నట్లేనా?, లేక, ఆనందం వున్నచోటల్లా అందం వున్నట్టా? అందం లేకుండా ఆనందం లేదా? అందం – ఆనందం:- మనసు దేనిని కోరుకుంటుంది? మరి ఈ పాటలో అందం; ఆనందం – ఈ రెండిటినీ కలిపి కుట్టేసినట్లుగా చెప్పి, అదే జీవిత మకరందం అని ఆ కవి అన్నాడు కదా? దీని అర్ధం ఏమయుంటుంది? ఇటువంటి కొన్ని గజిబిజి ప్రశ్నలు ఈ పాటను విశ్లేషిస్తున్నపుడు వస్తాయి. మరొక ప్రశ్న: ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు చెబుతుంటారు. అంటే, ఈ ప్రపంచంలో ధనమే మూలమైనది అని. అంటే, ధనంలేని జగత్తును ఊహించుకోవద్దని. ఇంకొక ప్రక్క, ‘ఆనందం లేని జీవితం, మకరందం లేని పువ్వులాంటిది, నిస్సారం” అని కూడా పెద్దలు చెబుతుంటారు. అయితే, ప్రశ్న ఏమిటంటే, ఈ జగత్తులో, మనిషికి, కావలిసినంత ధనం వుంటే, ఆనందం వున్నట్లేనా? అనేది.
ఇప్పుడు మనం అందమైన మార్గంలో పయనించి, ఆనందాన్ని చేరుకుంటామా? లేక ఆనంద మార్గంలో పయనించి అందాన్ని చూరగలుగుతామా? అన్న విషయాల్ని పరిశీలిద్దాం. మరి నాతోపాటు మీరుకూదా పయనం మొదలుపెట్టండి . . . . .
అందమంటే ఏమిటి? ముందుగా దీని గురించి కొంచెం రుచి చూద్దాం. భౌతికమైన వాటిని అందమనే పదంతో మనం కొలుస్తుంటాము. కనుముక్కు తీరు, ఒడ్డు,పొడుగూ వున్న ఒక స్త్రీ, లేదా పురుషుడిని, ఉదాకు:- హేమమాలిని; అభిషేక్ బచ్చన్ వీరిని చూపించి అందంగా వుండటమంటే ఇట్లా వుండాలని అంటుంటాం. ఒక గులాబీని; ఒక కలువ పువ్వును; ఒక చిలుకను; ఒక జింకను చూపించి, అందమంటే ఇట్లా వుండాలి అని చెబుతుంటాం. మరి అందమైన వీరిని/ లేదా వీటిని చూసినప్పుడు మనకు ఆనందం కలుగుతుందా? అంటే, అవుననే చెబుతాం.
మరి, ఆనందమంటే ఏమిటి? ఇక్కడ, ఆనందం అనగానే తృప్తి అనే పదంకూడా గుర్తుకువస్తుంది. కానీ, ఈ రెండిటికీ తేడా వుంది. ఉదా:- చిరకాలం తర్వాత ఆప్తమిత్రుడు కలిస్తే ఆనందంగా వున్నది అని అంటాం. ఇది కేవలం మానసికమైనది. ఇందులో తినేదిలేదు, తరిగేదిలేదు. మనం కోరుకున్న భోజనం కడుపునిండా తిన్నప్పుడు కలిగేది తృప్తి!
మన శరీరంలో ఐదు రకాల కోశాలు వున్నాయని హిందూధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అవి: అన్నమయకోశం; ప్రాణమయకోశం; మనోమయకోశం; విజ్ఞానమయకోశం; ఆనందమయకోశం.
అన్నంద్వారా ప్రాణం పుడుతుంది. మూడోది అయిన మనోమయకోశంలో మనస్సు పనిచేస్తుంటుంది. అన్ని విషయాలను ( గ్రంధాలయంలో, గ్రంధాలలో జ్ఞానాన్ని నిక్షిప్తం చేసినట్లుగా) ఇది తెలుసుకొని వుంటుంది. విజ్ఞానమయకోశం, మనోమయకోశంలో వున్న విషయాలను ఆచరణలోపెట్టి, తద్వారా వచ్చిన అనుభవ జ్ఞానాన్ని తనలో వుంచుకుంటుంది. అందమంటే కొన్ని మాటల్లో పైన చెప్పుకున్నాం – మనసులో పెట్టుకున్నాం. ఆనందమంటే ఏమిటో కొన్ని మాటల్లో పైన చెప్పుకున్నాం – మనసులో వుంచుకున్నాం – కొంత అనుభవించాం – విజ్ఞానాన్ని పొందాం. అంటే, మనోమయకోశాన్ని, విజ్ఞానమయకోశాన్ని శోధించాం. ఇక ఆనందమయకోశం గురించి తర్వాత మాట్లాడుకుందాం.
మనిషి పుట్టుకతోనే ఆనందమయుడు. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో వున్నప్పుడుకూడా మనిషి నిండు ఆనందంలో మునిగి, తేలుతూవుంటాడు. ‘మాతృదేవో భవ”… అని అంటారుకదా. అటువంటి మాతృదేవత పొట్టలోనేవుంటే ఆనందం లేకుండా ఎట్లావుంటుంది? అయితే, ఆ మాతృదేవత ఒడిని, తొమ్మిది నెలల తర్వాత విడిచి బయటకు వచ్చేసాననే బాధతో బిడ్డ పుట్టగానే ఏడుస్తాడు!! పుట్టుకతోనే మనిషి ఆనందమయుడు అయినప్పటికీ, లోకంలోని పరిస్థితుల ప్రభావంవల్ల, స్వార్ధం వల్ల అతడు దుఃఖాన్ని కొనితెచ్చుకొని, ఆనందాన్ని మరుగుపరుచుకుంటాడు. మరి ఈ ఆనందాన్ని బయటకు తెచ్చేదెలా? ఐహికంగా, కొన్ని చిట్కాలను పరిశీలిద్దాం:-
1. తప్పుచేసినా, ఒప్పుచేసినా, మనం మన మనసుద్వారానే తెలుసుకుంటుంటాం; అనుభవిస్తుంటాం. అయితే, తప్పు చేసినప్పుడు మాత్రం, దానివలన ఇతరులకు కష్టంగానీ, నష్టంగానీ కలిగినప్పుడు, మన స్వార్ధంకోసం, ఆ తప్పుని ఒప్పుకోవటానికి సిద్ధపడం. కానీ, అంతర్ముఖంగా, ఆ తప్పు మన మనస్సుని బాధస్తూనే వుంటుంది. FACE IS THE INDEX OF THE MIND. అంటే, మన ముఖం, మన మనస్సుకు అద్దంలాంటిది అని అర్ధం చెప్పవచ్చు. తప్పుచేసినవాడి ముఖంలో ఆందోళన కనిపిస్తూవుంటుంది. నిశితంగా పరిశీలించగలిగేవారు వీరిని గుర్తించగలరు. ఒకవేళ, తప్పుచేసినవాడు, తన ముఖంలో ఆందోళన కనిపించకుండా వుండటానికి ప్రయత్నిస్తూ, సవ్వుతూ కనిపించినా, మనసులో ఆందోళన మాత్రం అట్లాగే వుంటుంది. ఒక మంచి పనిని చేసినప్పుడు, అందరూ మనల్ని మెచ్చుకున్నప్పుడు, ఎంతో ఆనందం కలుగుతుంది. “ మీ మనసుని మీరు ఎప్పుడైనా చూసారా? ” అదెట్లా జరుగుతుంది? అని అనవచ్చు మీరు. ఒంటరిగా, ఒక గదిలో, అద్దంముందు నిలుచొని, మీ ముఖాన్ని మీరు పరిశీలించుకోండి. మన కళ్ళల్లో, అంతెందుకు, మన ముఖమంతా ఆనందమే!! FACE IS THE INDEX OF THE MIND అని అనుకున్నాంగదా! అయితే, తప్పుచేసినప్పుడుకూడా, ఇదే విధంగా, అద్దంముందు నిల్చొని, మనసారా నవ్వగలరా? ప్రయత్నించండి. ఖచ్చితంగా చేయలేరు. అయితే, చేసిన తప్పును, మనకు మనకుగా, మన మనసాక్షిగా ఒప్పుకుంటే, తప్పకుండా నవ్వగలం. తన తప్పువల్ల బాధపడ్డ వారిముందు తప్పుని ఒప్పుకొని, మరొకసారి అద్దంముందు నిలుచొని ముఖాన్ని పరిశీలించుకుంటే, తప్పకుండా మనలో ఆనందం కలుగుతుంది. అంటే, స్వార్ధం, తప్పు అనే ముసుగులను తీసివేయగానే, ఆనందం సహజంగా పుడుతుంది.
2. నిద్రపోయేముందుగానీ; నిద్ర పట్టనప్పుడుగానీ; చికాకుగా వున్నప్పుడుగానీ; కోపంగా వున్నప్పుడుగానీ, ‘మన’ చిన్నపిల్లల చిలిపి చేష్టలను, బోసినవ్వులను ఒక్కసారి గుర్తుకుతెచ్చుకొని, ఊహించుకోండి. అంతే, ఆనందం తప్పకుండా కలుగుతుంది;
3. ముసలివాళ్ళు, తమ శారీరిక పరిస్థితులవలన, తమకు లభించిన వాటితోనే ఆనందాన్ని పొందుతారు. వారికి మీ ఆప్యాయతను ఒక్క క్షణం పంచండి- మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. చిన్న పిల్లల్ని వారితో ఆడుకోనివ్వండి. వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. తద్వారా మనకికూడా ఆ అనుభవం వస్తుంది;
4. ఇతరులకు మనం ఏంచేస్తే వారికి ఆనందం కలుగుతుందో అటువంటి పనులను మనస్పూర్తిగా చేయటంద్వారా మనకు తప్పక ఆనందం కలుగుతుంది;
5. పక్షుల్ని; జంతువుల్ని ప్రేమతో, ఆప్యాయంగా చూడండి. ఆనందం తప్పక కలుగుతుంది;
6. పువ్వులతో విరబూసిన ఒక పూలమొక్క దగ్గరకు వెళ్ళండి. ఆ పూలను, మీ మునివ్రేళ్ళతో సుతారంగా తాకండి; కొన్ని పువ్వులనుగానీ, లేదా ఒక పువ్వునుగానీ కొంచెంసేపు పరిశీలనగా చూడండి – మీ మిత్రుల్ని చూస్తున్నట్లుగా చూడండి. మీకు తెలియకుండానే, కొద్దిసేపట్లోనే, మీ మనసుద్వారా ఆ పువ్వు లేదా పువ్వులతో మీరు మాట్లాడుతుంటారు!! ఆశ్చర్యపోకండి – నమ్మండి – మీకు మీరే ప్రయత్నం చేసిచూడండి. ఇది ఒక్కసారిగానే సాధ్యంకాకపోవచ్చును. ఖచ్చితంగా, నాలుగు,ఐదుసార్లు ప్రయత్నించేయండి, నేను చెప్పింది నిజమేనని ఒప్పుకుంటారు!! ఇదే పద్ధతిలో, ఒంటరిగా మీకు దగ్గరగా కనిపించే ఒక పెద్ద చెట్టుతోకూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు మీకు కలిగే ఆనందాన్ని అనుభవించండి.
పైన చెప్పిన చిట్కాలు ఐహికపరంగా సాధన చేయటానికి బాగా పనికివస్తాయి. అయితే, ఆధ్యాత్మికపరంగా సాధన చేయటంద్వారా ఆనందాన్ని ఎప్పుడు పొందుతూనేవుంటాము. అందుకు మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి:–
1. ఆనందం అంటే ఏమిటి? అవ్యక్తమైనది ఆనందం. లేదా, మనసుకు అందనది; మాటలకు లొంగనది ఆనందం. ‘ఆనందో బ్రహ్మ’ అని పెద్దలు చెబుతారు. ఆనందం గురించి చెప్పాను. ‘బ్రహ్మ’ అంటే అర్ధం (అమరకోశం ప్రకారం) : “ఆత్మనా భవతీత్యాత్మ భూః” = తనంతట పుట్టినవాడు; “సర్వం దథాతీతి థాతా” = సమస్తమును ధరించినవాడు. ఇప్పుడు, ఆనందం, బ్రహ్మ – ఈ రెండిటి అర్ధాలను కలిపిచూస్తే మనకు తెలిసేది = ఆనందం అవ్యక్తమైనది. బ్రహ్మ తనంతటతాను పుట్టినవాడు; సమస్తమను ధరించినవాడని దీని భావం. తనంతటతానుగా పుట్టినవాడిలో ( ప్రతి జీవికూడా తనంతటతానే, కారణశరీరరీత్యా పుడతాడు ), ఆనందం అవ్యక్తమైనదిగా పుట్టి, సమస్తమును ధరించి వుంటుంది, లేదా సమస్త విషయములలోనూ ఆనందం నిభిడీకృతమైవుంటుంది అని. మానవుని దృష్టిలో జగత్తు మానసికమైనది అయినప్పుడు, ఆనందంకూడా మానసికమైనదిగానే వుంటుంది.
2. అంతులేని విశ్వానికి మధ్యాంతరాలుండవు. కాబట్టి, అది ఎప్పుడైనా, ఎక్కడైనా, తన రూపురేఖలను మార్చుకోవచ్చును. అట్టి పరిస్థితులలో, ఆకాశంలో ఒక మార్గంలో ప్రయాణిస్తున్న ఒక గ్రహంగానీ, ఒక వస్తువుగానీ, కొంతకాలం తరువాత అదే దిశలోకానీ, లేదా వ్యతిరేక దిశలోగానీ మళ్ళీ మనకి కనిపిస్తుంది. అలాగే, జీవులయొక్క పుట్టుక, మరణం; అదేవిధంగా, కష్టం, సుఖం అనేవికూడా ప్రయాణిస్తూవుంటాయి. వీటి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము అని అనుకున్నా, లేదా, అవే మన జీవిత మార్గంలో పయనిస్తున్నాయని అనుకున్నా, ఈ రెండు విషయాలు ఎప్పుడూ వుండేవి అని భావించినప్పుడు, ఆ రెండిటిలో తేడాను మనం చూడనప్పుడు (సాధన ద్వారా సాధించగలిగేది) ఆనందం మనకి లభ్యమయినట్లే. అంటే, మనం అవ్యక్త స్థితికి చేరుకున్నట్లే;
3. అందమే ఆనందం …. ప్రకృతిలో దాదాపు అన్నీ అందంగానే వుంటాయి. ( నిజానికి అన్నీ అందంగానే వుంటాయి ). మనుషులు, పుచ్చకాయి, జిరాఫీ, ఏనుగు, కుందేలు, పూలు – అంటే, భౌతికంగా అందంగానే వుంటే, వాటినే అందం అని అంటామా? ఊహూ, నిజానికి, మన మనసుకు నచ్చినది ఏదైనా అది అందంగానే వున్నదనే అనుకుంటాము. అసలు అందానికి నిర్వచనం ఏమిటి? ఒక విశ్వసుందరి లాగా వుండే ఆడవాళ్ళను మాత్రమే అందమైన వాళ్ళని అనాలా? ఒక గులాబీ పువ్వు; ఒక చిలుక; ఒక జింక లాగా వుంటేనే వాటిని అందమైనవిగా చెప్పాలా? “ అందానికి అసలైన నిర్వచనం – ‘మన మనస్సుకు నచ్చినది’ ” అని చెప్పవచ్చు. అది ఏదైనా కావచ్చు. వచ్చిన చిక్కల్లా, మన మనసు నచ్చినవాటిని అందంగా భావించి, ఆనిందించకుండా, సరిపెట్టుకోకుండా, మనకు అందనివాటిని భూతద్దంలో చూసి, బాధపడుతూ, ఆనందాన్ని పోగొట్టుకుంటూంవుంటుంది. ఉదా:- నాకు బంగారం చాలా ఇష్టం. కొన్ని నగలు చేయించుకున్నాను. బంగారం చాలా ఇష్టంకదాఅని ఇంటిని బంగారంతో తాపడం చేయటం నా పరిధికి అందనిది. దానికోసం, వున్న ఆనందాన్ని దూరం చేసుకోకూడదు. అయితే, నచ్చిన వాటిలో అందాన్ని చూసినా, వాటిని వినియోగించుకోవటంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు వుండవచ్చు. అయినా, నచ్చినప్పుడు, అందులో ఆనందం పొందుతాం. మరొకవైపు, అవసరమైవుండికూడా, నచ్చలేదని ఆనందాన్ని దూరంచేసుకునేబదులు, వాటిని వినియోగించుకోవటంలో పొందే సౌఖ్యాన్ని గుర్తిస్తే అక్కడకూడా ఆనందం లభిస్తుంది. అంటే, ఐహికంగా, ప్రతివాటిని, మన అవసరానికి తగ్గట్టుగా, పరిస్థితులకు అనుగుణంగా, అందంగా చూడటం నేర్చుకోవాలి. అప్పుడు, అన్నిట్లో ఆనందమే కలుగుతుంది. అందుకే, ఆ మహాకవి, “అందమె ఆనందం; ఆనందమే జీవిత మకరందం….” అని అన్నాడు. ఈ స్థాయిలో, ఎప్పుడైతే, అన్నింటినీ అందంగా చూడటం నేర్చుకున్నామో, మన మానసిక స్థాయి ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. అప్పుడు, ప్రకృతిలోని ప్రతిదీ మనకు అందంగానే కనిపిస్తుంది ( MIND CONDITIONING ). అవసరానికోసం దేనినైనా అందంగా చూసే స్థితిని దాటుతాం.
4. ధ్యాన ప్రక్రియ:- ( ‘ధ్యానంపై వివరాలకోసం, నేను వ్రాసిన వ్యాసం “ధ్యానం” చదవగలరు ) ఈ ధ్యాన సాధనలో, మనసులోని ఆలోచనలు నెమ్మది,నెమ్మదిగా కట్టడిచేయబడి, చివరకుఆలోచనలు కలుగని స్థితి ఏర్పడుతుంది. శ్వాస యొక్క కదలికలు దాదాపుగా నిశ్చల స్థితికి చేరుకుంటాయి. ఈ విషయం మన మనస్సులో క్షణకాలం తెలుస్తుంది. ఇది సంధి స్థితి. అంటే, ‘తెలిసే స్థితి’ నుంచి ‘ఏమీ తెలియని స్థితి’ – లేదా సమాధిస్థితి” కి చేరే సమయం. ఒకసారి సమాధిస్థితిలోకి వెళ్తే, ఎంతసేపో చెప్పలేంకాబట్టి, కొంతకాలం మనం సమాధిస్థితిలో వుంటాం. ఆ సమాధిస్థితినుంచి బయటకు వచ్చినప్పుడు, జాగృతావస్థలో, మన మనసుకు ఏదో తెలియని ఆనందం పొందినట్లుగా తెలుస్తుంది. పైన ఉదహరించిన ఏ ఆనందాలను దీనితో పోల్చలేము. ఇదే సహజమైన ఆనందం. ఎంతో కష్టమైన సాధనతో దీనిని సాధించవచ్చును. సంపూర్ణంగా గానీ, ఆఖరికి, పావులో పావువంతును సాధించగలిగినా, మన జీవన, జీవిత పంధానే మారిపోతుంది. ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్న మాట!! స్వస్తి.
No comments:
Post a Comment