Pages

Monday

భారత్‌కు సాయమా.. హవ్వ...!


పురోగమన దశలో పయనిస్తూ నానాటికీ ఆర్థికంగా బలం పుంజుకుంటున్న భారత్‌కు సహాయం అందించడంపై బ్రిటిష్ ప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తాము ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉపాధి అవకాశాలు క్షీణిస్తుంటే స్వప్రయోజనాలను గాలికి వదిలి భారత్ వంటి దేశాలకు ఆర్థిక సహాయం అందించడమా అంటూ బ్రిటిష్ ప్రజలు వాపోతున్నారు. భారత్‌కు సహాయం అందించే వైఖరిని ఇప్పటికైనా విడనాడాలంటే ప్రధాని డేవిడ్ కామెరాన్‌పై వత్తిడిని పెంచుతున్నారు.

తమ దేశానికి చెందిన ఫైటర్ జెట్ టైఫూన్‌లను వద్దని ఫ్రెంచి జెట్ ఫైటర్‌లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించడం, భారత్‌కు బ్రిటన్ అందిస్తున్న సాయం చాలా చిన్నదని కొద్ది రోజుల క్రితం సాక్షాత్తు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు చేయడం వారిలో ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌కు బ్రిటన్ సాయమందించాల్సిన అవసరం ఏమిటని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బ్రిటన్ ఫైటర్ జెట్ టైఫూన్‌ను కాదని ఫ్రెంచ్ ఫైటర్ జెట్ రాఫెల్‌ను కొనుగోలు చేయాలన్న భారత నిర్ణయం వల్ల 40 వేల వరకు ఉద్యోగాలు ఊడిపోతాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్న భారత్‌కు తక్షణం ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలనే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది.

ప్రణబ్ వ్యాఖ్యలతో దుమారం

భారత అభివృద్ధి వ్యయంతో పోల్చితే బ్రిటన్ అందిస్తున్న సాయం చాలా చిన్న మొత్తం అని, ఇలాంటి సాయం మనకు అవసరంలేదని భారత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గత ఏడాది ఆగస్టులో రాజ్యసభలో పేర్కొన్నట్లు సండే టైమ్స్, ది సండే టెలిగ్రాఫ్‌లు కథనాలను ప్రచురించాయి. రాజ్యసభ నుంచి అధికారికంగా సమాచారం తీసుకున్న పిదపనే వీటిని ప్రచురించామని, గతంలో ఈ అంశాన్ని బ్రిటన్ మీడియా ప్రచురించలేదని ఆ పత్రికలు పేర్కొన్నాయి. తాజాగా సండే టైమ్స్, టెలిగ్రాఫ్‌ల కథనాలతో భారత్‌కు అందిస్తున్న సాయాన్ని పూర్తిగా నిలిపివేయాలనే డిమాండ్ నానాటికి అధికమవుతోంది. మరోవైపు డిఎఫ్ఐడి (బ్రిటీష్) కింద అందించే ఎలాంటి సాయాన్ని 2011 ఏప్రిల్ ఒకటి నుంచి ఉపయోగించుకోరాదని అప్పటి విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు ప్రతిపాదించారని ఆ పత్రికలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. భారతీయ పేదరికంపై డిఎఫ్ఐడి నెగటివ్ ప్రచారాన్ని చేపట్టడంతో ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారని ఆ పత్రికలు తెలిపాయి.

చర్చలు జరుగుతున్నాయ్...

పలు పథకాలకు సంబంధించి యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) ఆర్ధికంగా సాయమందిస్తూనే ఉందని యుకెలోని భారత హై కమిషన్ అధికార ప్రతినిధి తెలిపారు. సాయానికి సంబంధించి ప్రాధాన్యత రంగం, నిధుల మంజూరు వంటి తదితర అంశాలపై బ్రిటీష్ ప్రభుత్వంతో నిరంతరంగా చర్చల ప్రక్రియ కొనసాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు బ్రిటన్ అందిస్తున్న సాయాలను నిలిపివేయాలని అధికారులు సూచించినప్పటికీ ఇది సరైన సమయం కాదని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ ప్రస్తుతం డిఎఫ్ఐడి కింద భారత్‌కు ఏటా 28 కోట్ల పౌండ్ల ఆర్థిక సహాయం అందిస్తోంది. 2015 నాటికి మొత్తం సహాయం 28 కోట్ల పౌండ్లు అవుతుందని అంచనా.

No comments:

Post a Comment