Pages

Monday

చైనా ప్రధాని నోట.. ప్రజాస్వామ్యం మాట...!


 చైనా.. పరమ కమ్యూనిస్టు దేశం. ప్రజాస్వామ్యం అన్న మాటే అక్కడ వినపడదు. కానీ, దశాబ్దానికి పైగా అధికారంలో కొనసాగుతున్న ప్రధాని వెన్ జియబావో, తన పదవీకాలం చివరి సంవత్సరంలో తొలిసారిగా గ్రామస్థాయి ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించారు. సంస్కరణల మాట ఎత్తారు. దక్షిణ గువాంగ్‌డాంగ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా, రైతులకు ఓటింగ్ హక్కులు కల్పించాల్సిన అవసరాన్ని వెన్ ప్రముఖంగా ప్రస్తావించారు. గ్రామ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలన్నారు.

స్వయంపాలన కూడా ఉండాలని చెప్పారు. ఏకపార్టీ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా- సీపీసీ) వ్యవస్థ మాత్రమే ఉన్న చైనాలో ఇలాంటి పదాలన్నీ పూర్తిగా కొత్త. ఈ ప్రాంతంలోని వుకాన్ అనే గ్రామంలో గ్రామస్థులు స్థానిక పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి వారిని తరిమేయడంతో ఈ వ్యాఖ్యలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో సమస్యల పరిష్కారానికి సంస్కరణలు మాత్రమే ఉపయోగపడతాయని ప్రధాని చెప్పారు. పదేళ్ల పాటు ప్రధాని పదవిలో ఉన్న 72 ఏళ్ల జియబావో, ఈ సంవత్సరం రిటైర్ కానున్నారు.

కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు గాను ఆయనతో పాటు అధ్యక్షుడు హు జింటావో, ఆయన తరానికి చెందిన పార్టీ నాయకత్వం కూడా ఈ సంవత్సరాంతానికల్లా రిటైర్మెంట్ తీసుకుంటోంది. గ్రామీణ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడానికి స్వయంపాలన మాత్రమే సరైన మార్గమని, స్థానిక వ్యవహారాలను గ్రామస్థులే నిర్ణయించుకోవాలని వెన్ సూచించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ దాదాపు 20వేల మంది ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమించారు.

అంతర్జాతీయ మీడియా దృష్టికి ఈ వ్యవహారం రావడంతో, పరువు పోతుందని భావించిన ప్రభుత్వం, వారి డిమాండ్లను ఆమోదించి గ్రామ మండలికి తాజాగా ఎన్నికలు జరపాలని కూడా ఆదేశించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యూరోపియన్ యూనియన్‌ను స్థిరీకరించేందుకు చైనా సాయం చేయాలని కూడా ప్రధాని అన్నారు. చైనా ఎగుమతులకు, సాంకేతిక దిగుమతులకు అతిపెద్ద వనరు యూరోపియన్ యూనియనే.

No comments:

Post a Comment