Pages

Friday

విష్ణు సహస్రానికి నాంది


శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మహావిష్ణువు భక్తులందరికీ సుపరిచితం. అమృతప్రాయం. మాఘ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుసహస్రనామ స్తోత్రం పుట్టిన రోజుగా భావిస్తారు. కురుక్షేత్ర మహా సంగ్రామంలో భీష్ముడు నేలకొరుగుతాడు. ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు మాత్రమే మరణించే వరం పొందిన భీష్ముడు, పరమపదాన్ని చేర్చే ఉత్తరాయణంలో తుదిశ్వాస విడిచేందుకు ఇష్టపడతాడు. 

అర్జునుడు అంపశయ్యను ఏర్పాటు చేస్తాడు. దాని మీద శయనించిన భీష్ముడు మాఘ శుద్ధ ఏకాదశి నాడు పాండవులందరికీ, శ్రీకృష్ణుడి సమక్షంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గొప్పదనాన్ని వివరిస్తాడు. అందుకే ఆ రోజును శ్రీ విష్ణు సహస్రనామం పుట్టిన రోజుగా భావిస్తారు. అంతటి మహిమాన్వితమైన భీష్మ ఏకాదశిని మన దేశ వ్యాప్తంగా వున్న వైష్ణవ క్షేత్రాల్లో వైభవంగా నిర్వహిస్తారు. 

అంతర్వేదిలో ఈ రోజున నృసింహ కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అంతర్వేదితో పాటు అన్నవరం, సింహాచలం, యాదగిరిగుట్ట, తిరుమల, భద్రాచలంలోని శ్రీసీతారామస్వామి ఆలయాలలో వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశితో పాటు భీష్మాష్టమి, భీష్మ ద్వాదశిలను కూడా పవిత్రంగా భావిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.

గీతాసారం
విష్ణు సహస్రనామానికి మరో వైశిష్ట్యం కూడా వుంది. కురుక్షేత్రానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధిస్తాడు. కానీ భగవద్గీతపై అర్జునుడి మదిలో ఎన్నో సందేహాలు మిగిలి ఉంటాయి. దీన్ని గమనించిన శ్రీ కృష్ణుడు పాండవులందరికీ గీతా రహస్యాన్ని బోధించాలని సంకల్పిస్తాడు. అందుకే భీష్ముని నోటి నుంచి గీతా రహస్యాల సారమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పించాడని నమ్మిక. భగవద్గీతలోని రహస్యాలన్నింటినీ కేవలం వెయ్యి నామాల్లో నిక్షిప్తం చేసి, ఈ ప్రపంచానికి అందించారు. అంతటి మహిమాన్వితమైనది కాబట్టే నేటికీ విష్ణుసహస్ర నామాలు భక్తుల నాలుకలపై నిత్యం నడయాడుతూ వుంటాయి.

ఏకాదశి విశేషం
వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి తిధికి విశేష ప్రాధాన్యత వుంది. ఏకాదశి నాడు శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలానే సంప్రదాయపరాయణులు ఏకాదశినాడు ఉపవాసం చేసి, రోజంతా విష్ణు ధ్యానంలో గడిపి, ద్వాదశి నాడు మరలా పూజ చేసుకున్నాక మాత్రమే ఆహారం తీసుకుంటారు. దీన్నే ఏకాదశి వ్రతం అంటారు.

సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో కూడా ఉపవాసం చేసి, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం మోక్షానికి సులువైన మార్గంగా భక్తులు విశ్వసిస్తారు. ఏకాదశి వ్రతం గురించి ఒక చిన్న కథ ప్రచారంలో వుంది. ముర అనే రాక్షసుడు బియ్యం మీద తిష్ఠ వేసి కూర్చున్నాడట. దాంతో శ్రీ మహావిష్ణువు ఏకాదశి అవతారం ఎత్తి ఆ రాక్షసుడ్ని సంహరించాడట.

అందుకే ఏకాదశినాడు ధాన్యంతో వండిన పదార్థాలను తీసుకోకుండా రోజంతా ఉపవాసం వుంటారు. రోజంతా నిరాహారంగా వుండలేని వారు కేవలం పండ్లు, పండ్ల రసాలతో కాలక్షేపం చేస్తారు. వైద్య నిపుణులు కూడా కనీసం రెండు వారాలకు ఒకరోజు పూర్తిగా ఉపవాసం వుండాలని చెబుతారు. ఈ వైద్య సూత్రాన్ని సంప్రదాయంలో ఇమిడ్చి ఏకాదశి వ్రతంగా మన పూర్వీకులు మనకు అందించారు. భీష్మ ఏకాదశి నాడు ప్రారంభించి ఏకాదశి వ్రతం ఆచరిద్దాం. తరిద్దాం.

No comments:

Post a Comment