Pages

Saturday

భారత్ దూకుడు


రఫేల్ యుద్ధ విమానాలు రేపు యుద్ధంలో తమ సత్తా చాటుతాయో, లేదోగానీ వాటి కొనుగోలు విషయంలో భారత్ తన సత్తా చాటిందన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తున్న మాట!

భారత వైమానిక దళం కోసం 126 ఫ్రెంచి రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అలనాటి మిత్రదేశం రష్యాను, పెద్దన్న అమెరికాను కాదని ఫ్రెంచి విమానాన్ని భారత్ ఎందుకు ఎంచుకుందన్న ప్రకంపనలు ఒకవైపు... అమెరికా, రష్యా విమానాలు తక్కువ ఖరీదుకు దొరుకుతుండగా, వాటికి రెండింతలు ఖరీదైన రఫేల్‌ను భారత్ ఎందుకు కొంటోందన్న ప్రకంపనలు మరోవైపు... వెరసి రక్షణ, దౌత్యపరంగానే కాకుండా ఆర్థికపరంగానూ ఇదో పెద్ద చర్చకు దారితీస్తోంది. "రఫేల్ విమానాలను పాకిస్థాన్ ఎలా ఎదుర్కోవాలి? పాక్ కూడా రఫేల్‌లను ఎందుకు కొనుగోలు చేయకూడదు?'' అంటూ ఇంటర్నెట్‌లో పాక్ డిఫెన్స్ ఫోరంలలో ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. 

ఈ ప్రశ్నకు పాక్ వైమానిక నిపుణులు ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెబుతున్నారు. అయితే ఓ పాక్ మాజీ పైలట్ సూటిగా ఇలా పోస్ట్ చేశాడు. "బుగాటి (కోట్లు ఖరీదు చేసే స్పోర్ట్స్ కారు) కొనాలని నాకు ఆశ. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ ప్రశ్నకు ఈ సమాధానం చాలనుకుంటా''.... అనేది ఆ పోస్ట్ సారాంశం. భారత్ నిర్ణయంపై పాకిస్థానీలే కాదు... చాలా దేశాలవారు షాక్‌కు గురయ్యారు. నిజమే! ఒక అమెరికన్ ఎఫ్-16 విమానం 4 కోట్ల డాలర్లకే లభిస్తుంది. ఎఫ్-18 సూపర్‌హార్నెట్ అయితే 5.5 కోట్ల డాలర్లకు వస్తుంది. 

స్వీడిష్ విమానం గ్రిపెన్ 5 కోట్ల డాలర్లకే దొరుకుతుంది. రష్యన్ మిగ్-35 వీటన్నింటికంటే మరింత చౌకగా 3 కోట్ల డాలర్లకే లభిస్తుంది. అయితే ఈ విమానాలన్నీ పక్కనపెట్టి ఒక్కోటీ 9 కోట్ల డాలర్లు ఖరీదు చేసే రఫేల్ యుద్ధవిమానాన్ని భారత్ ఎంచుకుంది. తక్కువ ఖరీదుండే తమ విమానాలనే భారత్ కొంటుందనుకున్న అమెరికా, రష్యాలకు షాక్ ఇచ్చింది. రక్షణ విషయంలో ఎంత ఖర్చుకైనా తాను వెనుకాడబోనని చాటిచెప్పింది. 

రఫేల్ కోసమే కాదు... రష్యాతో సంయుక్తంగా నిర్మిస్తున్న ఎఫ్‌జీఎ ఫ్ఏ (అయిదోతరం యుద్ధ విమానం) కోసమూ వేల కోట్లు కుమ్మరించేందుకు భారత్ సిద్ధమవుతోంది. అత్యాధునిక అమెరికన్ యుద్ధ విమానం ఎఫ్-22కు దీటుగా భారత్-రష్యాలు ఈ ఎఫ్‌జీఎఫ్ఏను రూపొందిస్తున్నాయి. ఈ విమానం గురించి జర్మన్ రక్షణ నిపుణుడు హెల్మట్ హిర్స్ ఇటీవల ఒక వ్యాసం రాశారు. "భారత్-రష్యాలు కలిసి ఈ విమానాన్ని రూపొందిస్తున్నాయి. అయితే రష్యన్ల దగ్గర అంతగా డబ్బు లేదు. అందువల్ల వారు ఈ విమానం స్టెల్త్ (రాడార్లకు దొరకని సామర్థ్యం) విషయంలో రాజీపడతారు. కానీ దీనిపై ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు భారత్ సిద్ధంగా ఉంది. తమ ఎఫ్‌జీఎ ఫ్ఏను మరింత శక్తిమంతంగా రూపొందించుకుంటోంది. రష్యన్ డిజైన్‌లో 30 శాతం మేర మార్పులు చేసి స్టెల్త్‌ను పెంచుకుంటోంది. అందువల్ల రష్యన్ ఎఫ్‌జీఎఫ్ఏ, రేపటి చైనీస్ విమానాల కంటే భారత ఎఫ్‌జీఎఫ్ఏ నుంచే ఎఫ్-22కు అసలైన సవాలు ఎదురుకాబోతోంది'' అని ఆయన విశ్లేషించారు. 

ఇటీవలి కాలంలో రక్షణ వ్యయం విషయంలో భారత్ దూకుడుకు ఈ రెండూ పెద్ద ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే రఫేల్‌ను ఎంచుకోవడంలో వ్యయపరంగానే కాదు... దౌత్యపరంగానూ భారత్ అదే దూకుడును ప్రదర్శించింది. రష్యా చాలా దశాబ్దాలుగా భారత్‌కు మంచి మిత్రదేశంగా ఉంది. యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ట్యాంకులు... ఇలా ఎన్నో ఆయుధాలను భారత్‌కు విక్రయిస్తోంది. మరోవైపు అమెరికా భారత్‌కు ఇటీవల సన్నిహిత మిత్రుడిగా మారింది. అణు సహకార ఒప్పందం మొదలుకొని ఇరుదేశాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాల సహకారం మున్నెన్నడూ లేని స్థాయిలో ఉంది. అయితే రఫేల్ కొనుగోలులో భారత్ ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరించింది. 

యుద్ధ విమానాల కోసం గ్లోబల్ టెండర్ల విధానం అనుసరించింది. ఎఫ్-16, ఎఫ్-18 (అమెరికా), మిగ్-35 (రష్యా), గ్రిపెన్ (స్వీడన్), రఫేల్ (ఫ్రాన్స్), టైఫూన్ (బ్రిటన్ సహా నాలుగు ఐరోపా దేశాలు) ఇందుకోసం పోటీపడ్డాయి. అయితే టెక్నికల్ బిడ్‌లో మొదటి నాలుగింటినీ భారత్ తిరస్కరించింది. ఆ తర్వాత ప్రైస్ బిడ్‌లో టైఫూన్‌ను కాదని రఫేల్‌ను ఎంచుకుంది. భారత్ నిర్ణయం దౌత్యపరంగా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. తమ ఎఫ్-16, ఎఫ్-18లను భారత్ తిరస్కరించడంపై అమెరికా కుతకుతలాడింది. 

తమ దౌత్యవేత్తలను వరుసగా ఢిల్లీకి పంపి భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. భారత్ మెడలు వంచడంలో విఫలమయ్యారన్న కారణంగానే తమ రాయబారి తిమోతీ జె.రోమర్‌ను అమెరికా తప్పించిందన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఇక బ్రిటన్ బాహాటంగానే తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. భారత్ తమ నుంచి ప్రతి ఏటా కోట్ల పౌండ్ల మానవతా సాయాన్ని పొందుతూ, తమ యుద్ధ విమానాన్ని కాదనడం ఏమిటంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే బ్రిటన్ చేస్తున్న సాయం చాలా స్వల్పమని, అది ఇక తమకు అక్కర్లేదని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 

యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో తాము కేవలం సాంకేతిక, ఆర్థిక అంశాలనే పరిగణనలోకి తీసుకుని సూటిగా వ్యవహరించామని భారత రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను కొందరు రక్షణ నిపుణులు తప్పుబడుతున్నారు. "ఇది వేల కోట్ల రూపాయల వ్యవహారం. ఇందులో సాంకేతిక, ఆర్థిక అంశాలనే పట్టించుకుని వ్యూహాత్మక, దౌత్యపరమైన అంశాల్ని విస్మరించడం సరికాదు. యుద్ధం అంటే ఆయుధ బలం ఒక్కటే కాదు. ఇతర దేశాలతో సంబంధాలు అంతకంటే కీలకం. యుద్ధ విమానాల ఒప్పందం ద్వారా కొన్ని దేశాలను తమ పట్టులోకి తెచ్చుకునే అవకాశాన్ని భారత్ చేజేతులా దూరం చేసుకుంది. అమెరికా, బ్రిటన్‌లకు ఆగ్రహం కలిగించింది'' అని వారు విమర్శిస్తున్నారు. 

కానీ ఈ విషయంలో భారత్ కావాలనే మొండిగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. "గతంలో అమెరికా కళ్లుగప్పి భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. పలు దేశాల ఆంక్షలకు గురైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు అంతా సర్దుకుంది. భారత్‌కు అమెరికా స్నేహహస్తం అందించింది. భారత్‌కు విమానాలు అమ్మడం కోసం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పోటీపడుతున్నాయి. ఇది కూడా అంతే. తమ విమానాలను కాదన్నందుకు భారత్‌తో తగవు పెట్టుకుని, తెగేదాకా లాగే పరిస్థితిలో అమెరికా, బ్రిటన్, రష్యాలు లేవు. 

గతంతో పోలిస్తే అంతర్జాతీయంగా భారత్ స్థాయి చాలా పెరిగింది. న్యూఢిల్లీతో సంబంధాలు ఆ దేశాలకు చాలా అవసరం. ఆ సంగతి తెలిసే భారత్ స్వతంత్ర నిర్ణయం తీసుకుంది'' అని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాలు రేపు యుద్ధంలో తమ సత్తా చాటుతాయో, లేదోగానీ వాటి కొనుగోలు విషయంలో భారత్ తన సత్తా చాటిందన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తున్న మాట!

No comments:

Post a Comment