Pages

Monday

మందు మనకు ఎందుకొద్దు? యూరోపియన్లకే ఎందుకు ప్రయోజనకారి?: పీహెచ్ఎఫ్ఐ విశ్లేషణ


మద్యం ధరలు పెరిగిపోయాయంటూ మందుబాబులు ఓ పక్క గొడవచేస్తున్నారు! మరోవైపు.. వరుస దండయాత్రలు, అరెస్టులతో మద్యం సిండికేట్లకు ఏసీబీ ముచ్చెమటలు పోయిస్తోంది! ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన చర్చ.. అసలు మందుకొట్టడం మంచిదా కాదా? రోజూ తగుమాత్రంగా ఆల్కహాల్ తీసుకోవడం మంచిదేనని కొందరు.. 'ఎంతమాత్రమూ' మంచిది కాదని ఇంకొందరూ! అసలివన్నీ కాదు... మందు కొట్టడం యూరోపియన్లకు మంచిదేకానీ, ఇండియన్లకు కాదు అని మరికొందరు!! బీరులో ఉండే పోషకాలు కిడ్నీలో రాళ్లను బయటకు నెట్టేస్తాయని, గుండెపోటు ముప్పును వైన్ సమర్థంగా నిరోధిస్తుందని ఎప్పట్నుంచో వినిపిస్తున్న వాదన. 

అయితే అది పాక్షిక సత్యమేనని ముంబైకు చెందిన డాక్టర్ మనీష్ అనే యూరాలజిస్టు స్పష్టం చేశారు. "అమెరికాలో జరిగిన అధ్యయనాల ఫలితాల ప్రకారం.. కొన్ని రకాల బీర్లు ప్రత్యేకించి స్టౌట్ లాంటివి కిడ్నీలో కాల్షియం, ఇతర పదార్థాలు పేరుకుపోయి రాళ్లుగా మారడాన్ని 30-35 శాతం మేర నిరోధిస్తాయి. కానీ, అదే సమయంలో.. ఆ బీరులో ఉండే ప్యూరైన్ అనే కెమికల్ యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడేలా చేస్తుంది'' అని వివరించారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా సదరు స్టౌట్ బీరు చేసే పనిని మామూలు నారింజ రసం, టీ, కాఫీలు కూడా చేస్తాయని ఆయన తెలిపారు. 

కేవలం దానికోసమే అయితే మందుకొట్టక్కరేదని స్పష్టం చేశారు. ఇక గుండెపోటు విషయంలోనూ మద్యం పాత్ర మనదేశానికి వర్తించదని 'పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ)కు చెందిన మలైకా అరోరా వాదిస్తున్నారు. 2010లో ఈ సంస్థ ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యులతో కలిసి దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 4000 మంది మందుబాబులపై ఒక అధ్యయనం సాగించింది. మందుకొట్టనివాళ్లకి ఏస్థాయిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందో వీరిలోనూ అదేస్థాయిలో పొంచి ఉందని వారి అధ్యయనంలో తేలింది. పైపెచ్చు.. తక్కువ మోతాదులో మద్యం పుచ్చుకునే వారిలోనూ గుండెనాళాల వ్యాధులు వచ్చే ముప్పు 40 శాతం దాకా ఉందని రుజువైంది. మన భారతీయులు పుచ్చుకునే మద్యం రకాలే దీనికి కారణం అంటారు మలైకా. "మనదేశంలో విస్కీ, స్కాచ్ వంటి ఆల్కహాల్ శాతం అధికంగా ఉండే హార్డ్ లిక్కర్ అధికంగా పుచ్చుకుంటారు. 

అదే విదేశీయులు ఎక్కువగా ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే బీరు, వైన్ వంటివి తాగుతారు. అందుకే మద్యం వారికి ప్రయోజనకారి, మనకు మాత్రం ప్రమాదకారి'' అని ఆమె వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే కూడా ఈ విషయాన్ని «ద్రువీకరిస్తోంది. ఆ సంస్థ గణాంకాల ప్రకారం.. మనదగ్గర మందుకొట్టేవారిలో బీరుతో సరిపుచ్చేవారు కేవలం 10 శాతం మాత్రమే. వైన్ తాగేవారు 2శాతానికి మించరు. మిగతా 88 శాతం మందీ ఘాటైన మందు కొట్టేవారేనట. ఇంటర్నేషనల్ వైన్ అండ్ స్పిరిట్స్ రికార్డు ప్రకారం.. 2009 నాటికి దేశవ్యాప్తంగా ఏడాదికి 20 కోట్ల కేసులు (ఒక్కో కేసులో 12 బాటిళ్లు లేదా 9 లీటర్ల మద్యం ఉంటుంది) అమ్ముడవుతున్నాయట. 

కొసమెరుపు: మనవాళ్లేమో మందు యూరోపియన్లకు మంచిదేనంటుంటే.. అక్కడి దేశాలు మాత్రం మందెక్కువై తూలుతున్నాయి. అక్కడివాళ్లు పీతల్లా రోజూ తాగేస్తుండడంతో.. 'రోజూ తగుమాత్రంగా మద్యం తాగితే మంచిదే' అనే వాదం అక్కడ పుట్టిందే. అలాంటి దశ నుంచి.. "వారానికి కనీసం రెండురోజులైనా 'మందు హాలిడే' ప్రకటించండి. మీ కాలేయానికి విషాలను విరుగుడు చేసుకునేందుకు కనీసం రెండురోజులైనా టైమివ్వండి'' అంటూ సాక్షాత్తూ దిగువ సభ ప్రజాప్రతినిధులే జనాన్ని అడుక్కునే స్థాయికి దిగజారింది బ్రిటన్ పరిస్థితి.

No comments:

Post a Comment