Pages

Monday

పెట్టుబడుల గమ్యం భారత్.....


ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ ప్రగతి పథంలో సాగుతున్న భారత్... వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమ్మిట్‌లో ప్రధాన ఆకర్షణగా మారింది. ఓవైపు ప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తూ మరో వైపు మంచి వృద్ధి రేటును సాధిస్తున్న భారత్ గాధను అందరూ చర్చించడం ఈ ఫోరమ్‌లో చెప్పుకోదగ్గ అంశం. యూరోపియన్ యూనియన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి ఏవిధంగా బయటపడేలా అన్న దానితో మొదలైన చర్చ కాస్తా భారత్‌పైకి మళ్లింది. ఆర్థిక సంక్షోభ పరిస్థితులను భారత్ ఏవిధంగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదో అందరూ విశ్లేషించడం మొదలుపెట్టారు. 

భారత్ రానున్న కాలంలో దావోస్ తరహా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉందని కొందరన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను తగ్గించిన స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పి) కూడా భారత్ గురించి గొప్పగా చెప్పింది. భారత్‌కు తాము ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను ఇచ్చినట్టు ఎస్ అండ్ పి ప్రెసిడెంట్ డౌగ్లాస్ పీటర్‌సన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు సంబంధించిన ఔట్‌లుక్ నిలకడగా ఉందని, రానున్న కాలంలో దేశం ఇంతకు మించిన స్థాయికి చేరే అవకాశం ఉందని అన్నారు. భారత్ వంటి ప్రజాస్వామిక దేశంలో నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఆరోగ్యకరమైన చర్యలకు ఇది తప్పనిసరని ఆయన చెప్పారు. 

భారత్ గురించి చాలా మంది పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నట్టు ఆయన తెలిపారు. దావోస్‌లో యూరోపియన్ సంక్షోభం కన్నా భారత్ గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం కనిపించినట్టు ఆయన చెప్పారు. భారత్‌లో సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకువెళ్లనున్నట్టు దావోస్ వేదికపై వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ చేసి న ప్రకటనతో పెట్టుబడులకు భారత్ కీలక గమ్యస్థానంగా ఉందన్న సంకేతాలు వెళ్లాలి. దీంతో ఇన్వెస్టర్ల దృష్టి భారత్‌పైకి మళ్లింది. రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఎఫ్‌డిఐలో పెట్టుబడుల నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, ఇది ఎంతో కాలం కొనసాగదన్న శర్మ వ్యాఖ్యతో ఇన్వెస్టర్లలో కొత్త ఆలోచనలు రేగాయి.

ఇదిలా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై సీనియర్ పారిశ్రామికవేత్త, భారత్ ఫోర్జ్ గ్రూప్ చీఫ్ బాబా కల్యాణి విశ్వాసం వ్యక్తం చేశారు. భారత కచ్చితంగా 8 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి రోన్ కిర్క్ మాట్లాడుతూ.. భారత్ వర్ధమాన మార్కెట్ అని అమెరికా ఎప్పుడూ భావించదని, అమెరికా ఏమి చేస్తుందో భారత్ కూడా అదే చేసే సత్తా ఉందని అన్నారు. భారత్ కూడా సొంతంగా ఐపాడ్స్‌ను ఉత్పత్తి చేయగలదని, దీనికన్నా ఎన్నో చేసి చూపించే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు.

అన్ని అనుకూలంగా ఉంటే భారత్ కచ్చితంగా వచ్చే 5-10 ఏళ్ల పాటు భారత 8 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో ఆర్థిక, రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్న బారీ ఈచెన్‌గ్రీన్ పేర్కొన్నారు. భారత్ అనుకున్న వృద్ధిని సాధించేందుకు కొన్ని ప్రత్యేక విధానాలు అనుసరించడంతోపాటు తయారీ రంగంలో వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో సర్వీసుల రంగం సాధిస్తున్న వృద్ధిని ఆయన ప్రశంసించారు. చైనా మాదిరిగా ఉత్పత్తుల రంగంలో భారత్ వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం భారత్‌కు ఆందోళన కలిగించకపోగా అవకాశంగా మారిందని కన్సల్టెన్సీ దిగ్గజం పిడబ్ల్యుసి ఇండియా చైర్మన్ దీపక్ కపూర్ పేర్కొన్నారు. భారత్ గ్లోబల్ ఎం అండ్ ఎలో కీలకంగా మారనుందని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఏవిధంగా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చో భారత వ్యాపార వేత్తలకు బాగా తెలుసని ఆయన అంటున్నారు. 2008-09 అంతర్జాతీయ సంక్షోభానికి ముందు భారత్‌లోని చాలా కంపెనీలు తమ ఆస్తులను అమ్మేసుకున్నాయని, ఇప్పుడేమో చాలా కంపెనీలు విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాయన్నారు.

No comments:

Post a Comment