Pages

Tuesday

సంతానలేమి సమస్యకు చక్కటి వైద్యం

మన సమాజంలో సంతానలేమి సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ సమస్య వల్ల వారిలో ఆందోళన పెరిగిపోతుంది. సంతాన లేమి సమస్యకు ఏ ఒక్కరిదో లోపం అని చెప్పలేము. భార్యాభర్తలు ఇద్దరూ కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పురుషులలో వీర్యకణాల సంఖ్య బాగా తగ్గిపోవడం కనిపిస్తోంది. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పవచ్చు. సంతాన లేమితో బాధపడే వారు సమాజంలో 15 నుంచి 20 శాతం వరకు ఉన్నారు.

పురుషులలో వీర్యంలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, వీర్య కణాలు పూర్తిగా లేకపోవడం, వీర్య కణాలలో కదలికలు తగ్గడం, వీర్యకణాల స్వరూపం(ఆకృతి) సరిగా లేకపోవడం మొదలైనవి ముఖ్యమైన లోపాలుగా చెప్పవచ్చు. సంతానలేమి సమస్యకు స్త్రీలనే కారణంగా చూపిస్తారు కాని అందులో పురుషులు కూడా సగం కారణమని గ్రహించలేకపోతున్నారు. వీర్యంలో వీర్యకణాల సంఖ్య పూర్తిగా లేకపోవటాన్ని 'అజూస్పెర్మియా'గా వ్యవహరిస్తారు. 'అజూస్పెర్మియా'తో బాధపడేవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి ఆయుర్వేదంలో తప్ప ఏ ఇతర వైద్యవిధానంలో మంచి చికిత్స లేదనే చెప్పాలి. వీర్యంలో వీర్యకణాల సంఖ్య ప్రతి మిల్లీలీటర్‌కు 40 మిలియన్ల నుంచి 120 మిలియన్ల వరకు ఉంటాయి. వీటిలో కదలికలు కనీసం 50 శాతం వరకు, సరైన ఆకృతి కలిగినవి 60 శాతం వరకు ఉంటేనే సంతానం కలుగుతుంది.

మానసికం ముఖ్యం
పురుషులలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. శారీరక కారణాలతోపాటు మానసిక కారణాలు కూడా వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి తోడ్పడతాయి. మానసిక ఒత్తిడికి లోనవడం, మానసిక ఆందోళన, డిప్రెషన్ వల్ల వీర్యకణాలలో లోపాలు ఏర్పడతాయి. గవద బిల్లలు, క్షయ, మశూచి వంటి వ్యాధుల వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి మందగిస్తుంది. వృషణాలలో వెరికోసిల్ ఉండడం వల్ల వృషణాలకు వేడి పెరిగి వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గిపోతాయి.

పొగతాగడం, మద్యం సేవించడం, గుట్కాలు నమలడం వల్ల కూడా వీర్యకణాలలో లోపాలు ఏర్పడతాయి. హార్యోన్లలో లోపాలు, వృషణాలలో వచ్చే సమస్యలు, సుఖవ్యాధులు, అంగస్తంభనలో లోపాలు మొదలైనవి కూడా పురుషులలో సంతానలేమికి కారణమౌతాయి. ఇవే కాకుండా అధిక బరువు, మధుమేహం వంటి సమస్యల వల్ల కూడా వీర్యకణాలలో లోపాలు ఏర్పడతాయి. ఇంకా మగవారిలో ఆహార అలవాట్లు, వాతావరణ కాలుష్యం, రసాయనాల వల్ల కూడా వీర్యకణాలు తగ్గిపోతాయి.

హార్మోన్ల పరీక్షలు
పురుషులలో సంతానలేమి ఏర్పడితే కారణాలు కనుగొనడానికి వీర్యపరీక్ష, హార్మోన్ల పరీక్ష, స్క్రోటల్ డాప్లర్ స్టడీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సంతానం కలగని దంపతులు మొట్టమొదట చేసుకోవలసిన పరీక్ష వీర్యపరీక్ష. ఈ పరీక్ష చేయించుకోవడానికి ముందు 3 నుంచి 5 రోజులు భార్యాభర్తలు కలుసుకోకుండా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. 

స్క్రోటల్ డాప్లర్ స్టడీ ద్వారా వృషణాలలో వచ్చే వెరికోసిల్‌ని గుర్తిస్తారు. వెరికోసిల్ సమస్యను గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3లలో గుర్తిస్తారు. వెరికోసిల్ గ్రేడ్-1, గ్రేడ్-2 ఉన్నవారికి శస్త్రచికిత్స అవసరం ఉండదు. గ్రేడ్-3 వెరికోసిల్ ఉన్నవారికి నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే శస్త్ర చికిత్స అవసరం ఉండవచ్చును. కాని శస్త్ర చికిత్స వల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది. వెరికోసిల్ ఉన్నవారిలో ముఖ్యంగా వీర్య కణాల కదలికలలో లోపాలు ఏర్పడతాయి. వెరికోసిల్ ఎక్కువగా ఎడమ వృషణానికే వస్తుంది.

వాజీకరణ ఔషధాలు
సంతాన లేమిని ఆయుర్వేదంలో వంధ్యత్వమని పేర్కొంటారు. పురుషులలో సంతానలేమిని శుక్రదోషాలుగా వ్యవహరిస్తారు. వీర్యకణాలను పెంచే అద్భుతమైన ఔషధాలు ఎన్నో ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయి. శృంగార సమస్యలకు, సంతాన లేమి సమస్యలకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా 'వాజీకరణ ఔషధాలు' పేర్కొన్నారు. శుక్రదోషాలను 8 రకాలుగా పేర్కొన్నారు. అవి: వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాల వలన ఏర్పడతాయి. వాజీకరణ ఔషధాలు 4 రకాలుగా పేర్కొన్నారు. వాటిని శుక్రజనకాలు, శుక్ర ప్రవర్తకాలు, శుక్రజనక ప్రవర్తకాలు, శుక్ర బోధకాలుగా వ్యవహరిస్తారు.

శుక్రజనకాలు: ఇవి వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. వీటిలో అశ్వగంధ, శతవరి, జీవకం మొదలైనవి ఉన్నాయని గ్రంథాలలో పేర్కొన్నారు. శుక్ర ప్రవర్తకాలు: ఇవి వీర్యాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తాయి. వీటిలో బృహతి, కంటకారి ఉన్నాయని పేర్కొనడం జరిగింది. శుక్రజనక, ప్రవర్తకాలు: వీటిలో ఆమలకి, జీడిపప్పు, మినుములు, పాలు ఉంటాయి.

భుక్రబోధకాలు: వీర్యంలోని దోషాలను నివారించేవి. వీటిలో కోకిలాక్ష, కూష్మాండ, ఉబీర, చెరకురసం ఉంటాయి. పురుషులలో వీర్యంలో ఎలాంటి లోపాలున్నా ఆయుర్వేద వైద్య విధానం ద్వారా సులభంగా నయం చేయవచ్చును. ఔషధాల సేవనంతోపాటు మానసిక ఆందోళన తగ్గించుకుని, ఆహారం, వ్యాయామాల విషయంలో శ్రద్ధ చూపించాలి. సంతాన, శృంగార సమస్యల పరిష్కారం కోసం అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా ఔషధాలు వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి.

No comments:

Post a Comment