Pages

Tuesday

పింగు నేర్పే ఇంగ్లీష్...

అదొక చిన్న పిల్లల ప్రీ- స్కూల్. సాయంత్రం నాలుగు గంటలయ్యింది. అప్పుడప్పుడే ఒక్కొక్కరుగా బుజ్జిబుజ్జి పిల్లలు వస్తున్నారు. సరిగ్గా నాలుగున్నరకి ఇంగ్లీషు నేర్పించే క్లాసు ప్రారంభమవుతుంది. అమ్మానాన్నలు దింపి వెళ్తుంటే ఒక్కరు కూడా బడి లోపలికి వెళ్లమని మారాం చేయడం లేదు. బండి దిగడం ఆలస్యం పరుగెత్తుకుంటూ క్లాసు రూమ్‌లోకి వెళ్తున్నారు. చిట్టిచిట్టి పాదాలతో పరుగెట్టి వెళ్తున్న ఒక రెండేళ్ల పాపని చేయి పట్టుకుని ఆపితే... 'పింగు...' వస్తుంది వె ళ్లాలంటూ తన బలమంతా ఉపయోగించి చేతిని విడిపించుకుని మరీ వెళ్లిపోయింది.
అంతగా పిల్లల్ని ఆకర్షించే పింగు ఎవరో చూద్దామని క్లాసురూమ్ లోపలికి తొంగిచూస్తే పదిహేను మందికి పైగా బుజ్జాయిలు వరసగా కూర్చుని ఉన్నారు. అస్సలు అల్లరి చేయడం లేదు. బుల్లి బుల్లి పీటల్లాంటి టేబుల్స్ మీద మోచేతులు ఆన్చి గెడ్డం కింద అరచేతులు ఆన్చి పెట్టుకుని ఎదురుగా ఉన్న తెర వైపు కళ్లార్పకుండా చూస్తున్నారు. అంతలో ఇద్దరు టీచర్లు లోపలికి వచ్చి పిల్లలందర్నీ పలకరించి డివిడి ప్లేయర్‌ను స్విచాన్ చేశారు. అప్పటివరకు గుసగుసలాడుతున్న వాళ్లు కూడా నిశ్శబ్దమైపోయారు.

్ఙ ్ఙ ్ఙ
తెరమీద పింగు (పెంగ్విన్) కనిపించగానే పిల్లల ముఖాల్లో వెలిగిన వెలుగులు ఆ చీకటి గదిని వెలుతురుతో నింపేశాయి. పాఠం మొదలయ్యింది. తెరమీద పింగు కనిపించాడు. అలా పింగు కనిపించడం ఆలస్యం అందరు పిల్లలు 'పింగూ...పింగూ..' అని అరిచినంత పనిచేశారు. తెర మీద పింగు తండ్రితో ఆడుకుంటానని చెప్తాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోని వస్తువులతో ఏవేవో ఆటలు ఆడుకుంటారు. చివరికి ఇంట్లో వస్తువులతోనే ఒక ట్రాంపోలిన్ (మంచంలా ఉంటుంది. దానిమీద ఎగిరి దుమికే ఆట ఆడొచ్చు)ని తయారుచేసుకుంటారు.

దానిపైకి ఎక్కి ఎగురుతూ తెగ అల్లరి చేస్తాడు పింగు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. పింగు తండ్రి వెళ్లి తలుపు తీస్తాడు. ఎదురుగా పింగు తల్లి, చెల్లి పింగా ఉంటారు. ఇంట్లోకి అడుగుపెట్టిన పింగు తల్లి గందరగోళంగా ఉన్న ఇంటితోపాటు ట్రాంపోలిన్ మీద ఎగురుతున్న పింగుని చూస్తుంది.

కోపంగా 'స్టాప్ పింగు' అని అరుస్తుంది. ఆ అరుపుకు ఉలిక్కిపడ్డ పింగు ఎగిరెళ్లి అక్కడే ఉన్న ఒక కుర్చీలో తలకిందులుగా పడతాడు. తల్లి వెళ్లి పింగును సరిగ్గా కూర్చోపెట్టి, ఇల్లంతా చెత్తగా చేశారని తండ్రీకొడుకులను తిడుతుంది. శుభ్రం చేద్దాం రమ్మని పిలుస్తుంది. క్షణాల్లో ఇల్లు శుభ్రం చేస్తాడు పింగు తల్లితో కలిసి. ఆ తరువాత ట్రాంపోలిన్‌ని ఇంటి ముందు వేసి ఆడుకోమంటుంది పింగు తల్లి.

్ఙ ్ఙ ్ఙ
ఈసారి టాకీ పింగు కథ మొదలైంది. మొదట మూకీగా ప్లే అయిన కథంతా రెండోసారి మాటలతో వస్తుంది. సబ్‌టైటిల్స్ కూడా ఇంగ్లీషులో వస్తుంటాయి. అది చూస్తూ పిల్లలు ఆ పాత్రల సంభాషణలను ఇంగ్లీషులో చెప్తారు. ఆ తరువాత.. కథలో వచ్చిన వస్తువుల బొమ్మలు ఒకవైపు, మరోవైపు వాటి పేరు ఉన్న కార్డుల్ని చూపిస్తూ టీచర్ చెప్తుంటే పిల్లలు కూడా వాటిని వల్లెవేస్తారు. 

ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత టీచర్ 'వాట్ డిడ్ పింగు మమ్మీ సేస్...?' అని అడిగారు. పిల్లలు 'స్టాప్.. పింగు' అని ఠక్కున సమాధానం చెప్పారు. వీళ్లలో ఒక పిల్లవాడు మాత్రం ఏ ప్రశ్న అడిగినా 'చెప్పా' (నేను చెప్పను) అంటూ సమాధానం ఇస్తూ వచ్చాడు. అయినా ఆ పిల్లాడ్ని ఏమీ అనకుండా మరికొన్ని ప్రశ్నలు అడిగారు. 

ఎన్ని అడిగినా చెప్పా అనే మాట తప్ప మరో మాట రాలేదు. తరువాత 'బౌన్స్... బౌన్స్...బౌన్స్...' అంటూ ఓ పాట వచ్చింది. ఆ పాటకు పిల్లలు డాన్స్ చేస్తూ, గెంతుతూ పింగును అనుకరించారు. ఇదంతా అయిన తరువాత పింగుల్యాండ్ గుర్తించే పని మొదలయ్యింది. ఇందులో పింగుల్యాండ్ మ్యాప్ చుట్టూ ఆ ల్యాండ్‌లో ఉన్న బొమ్మల కార్డులను ఉంచారు. దాని చుట్టూ చేరిన పిల్లలతో టీచర్లు ఒక్కోదాని పేరు చెప్తుంటే ఆ కార్డును తీసుకుని ల్యాండ్‌లో సరిగ్గా ఆ ప్రదేశంలో ఉంచుతున్నారు.

తరువాత ఫోనెటిక్ క్లాసు మొదలయింది. ఏ అక్షరాన్ని ఎలా పలకాలో నేర్పించారు. ఆ తరువాత రైటింగ్ క్లాసు కూడా తీసుకున్నారు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం వల్ల రెండున్నరగంటల పాటు క్లాసులోనే ఉన్నా విసుగనిపించలేదు పిల్లలకు. బలవంతంగా పంపించాల్సి వచ్చింది టీచర్లకు.

No comments:

Post a Comment