Pages

Tuesday

ప్రిన్స్ 'టైలర్'

చాక్లెట్ బాయ్ మహేష్ డిఫరెంట్‌దుస్తుల్లో కనిపించాలని యువత ఎదురు చూస్తుంటారు. తనకు ఏవి నప్పుతాయో, ఏ కొలత సరిపోతుందో ఎంపిక చేయమని హీరో మహేష్ కాస్ట్యూమర్ గోపురాజు వైపు చూస్తుంటారు. హీరో కృష్ణ వంశానికి ఆస్థాన కాస్ట్యూమర్‌గా పనిచేస్తున్న గోపురాజు చెబుతున్న విశేషాలే ఈ కథనం...
"దాదాపు రెండున్నరేళ్లు మహేష్ సినిమాలేవీ చేయలేదు. 'అతిథి' సినిమా తరువాత ఈ గ్యాప్ వచ్చింది. ఆయన సినిమా షూటింగులు నడుస్తుంటేనే మాకు పని. కాస్ట్యూమర్‌గా కెరీర్‌లో హీరో కృష్ణ తరువాత మహేష్ దగ్గర, వారి సంస్థ పద్మాలయలో కాకుండా వేరే చోట పనిచేసిన అనుభవం నాకు లేదు. వేరే దగ్గర చేయడం ఇష్టముండదు కూడా. మహేష్‌కు పర్సనల్ కాస్ట్యూమర్‌గా మారాక మరింత బాధ్యతగా ఉన్నాను. అందుకే ఆ ఖాళీ సమయంలోనూ ఎక్కడికీ వెళ్లాలనుకోలేదు. ఒక రోజు మహేష్ పిలిచి 'సినిమా మొదలయ్యేవరకు జీతం తీసుకోండి' అన్నారు. షూటింగ్ రోజుల్లో ఇచ్చే రెమ్యూనరేషన్‌తో సంబంధం లేకుండా ఆ వేతనాన్ని ప్రతీ నెలా మహేష్ ఇప్పటికీ ఇస్తున్నారు.

రేవల్లి ప్రయాణం...
కర్నూలు జిల్లాలోని రేవల్లి మా ఊరు. పద్మశాలీల కుటుంబం కావడంతో బట్టలతోనే జీవనం గడిచేది. పదో తరగతి చదువుకున్నాను. ఆ సమయంలోనే టైలరింగ్ నేర్చుకున్నాను. 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బతుకుతెరువుకోసం హైదరాబాద్ వచ్చేశాను. రెండేళ్లు నాచారంలో టైలరింగ్ చేసుకుంటూ గడిపేశాను. తరువాత కృష్ణకు పర్సనల్ కాస్ట్యూమర్‌గా చేసిన రమేష్ పరిచయమయ్యారు. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. కృష్ణ చేసిన 50 సినిమాలకు అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా చేశాను. ఆ తర్వాత మహేష్ సినిమాలు 'రాజకుమారుడు' నుంచి 'అతడు' వరకు కూడా అసిస్టెంట్‌గానే ఉన్నాను.

సమస్యతో ప్రమోషన్...
'అతడు' సినిమాలో ఓ పాట తీస్తున్న సందర్భంలో ఒక సూట్ మహేష్‌కు సరిగా ఫిట్ కాలేదు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాన్ని నా చేతిలో ఉంచి ఉదయం ఎనిమిది గంటలకల్లా హీరో ఒంటిమీద ఇది ఉండాలని అన్నారు. అప్పటికప్పుడు నేను సూట్ మెటీరియల్ షాపుకు వెళ్లి, అదే కలర్‌లో వేరే బట్ట తీసుకుని, మరో ఇద్దరి సహకారంతో వేకువజాము 3 గంటలవరకు పనిచేసి దాన్ని రెడీ చేశాను. స్పాట్‌లోకి తీసుకెళితే త్రివిక్రమ్ దాన్ని చూసి చాలా బాగా ఆల్ట్రేషన్ చేశావని అన్నారు. 

వేరే మెటీరియల్‌తో కుట్టిన కొత్త సూట్ అని చెప్పాను. ఆయన నమ్మకపోవడంతో అంతకుముందు ఇచ్చిన పొడవాటి సూట్ ఆయనకు చూపించాను. త్రివిక్రమ్ ఆశ్చర్యపోయి మహేష్‌కు పర్సనల్ కాస్ట్యూమర్‌గా చేయమంటూ ప్రోత్సహించారు. హీరో కృష్ణ, మా గురువు రమేష్‌లు కూడా మహేష్‌కు నా గురించి చెప్పడంతో ఆయన నన్ను పర్సనల్ కాస్ట్యూమర్‌గానూ, పద్మాలయా నిర్మించే సినిమాలకు కాస్ట్యూమర్‌గానూ తీసుకున్నారు.

మంజుల చూపిన బాట...
అప్పట్లో కాస్ట్యూమర్లే డిజైనర్లు. ఏదైనా డిజైన్ చేయాలంటే నెట్ కూడా అందుబాటులో ఉండేది కాదు. హీరోకు సరైన డ్రెస్ ఎంపిక చేయాల్సిన బాధ్యత మాదే. మహేష్‌కు ఎలాంటివి సూటబుల్ అవుతాయని వెతుకులాడుతున్న సమయంలో మంజుల నా పాలిట దేవతలా ఇటలీ నుంచి వచ్చే ఫ్యాషన్ మ్యాగజైన్ ఒకటి పరిచయం చేశారు.

రాబోయే సంవత్సరం డిజైన్స్‌ను ఈ సంవత్సరమే అందులో ఇస్తారు. అది చూశాక నా కష్టాలు తీరాయి. ఐదు వేల రూపాయల ఖరీదుండే ఆ మ్యాగజైౖన్‌లోని డిజైన్స్‌ను చూసే 'పోకిరి' సినిమాలో మహేష్ ధరించే దుస్తులను ఎంచుకున్నాను. వాటిని ట్రైల్ కోసం మహేష్ ఇంటికి తీసుకెళ్లినప్పుడు నమ్రత చూసి మార్కులు వేసేవారు. 'పోకిరి'తో నాకు మంచి పేరొస్తుందని కూడా ఆమె అన్నారు. ఆ మాటే నిజమయింది.

బ్లాస్టర్ కాంబినేషన్...
'దూకుడు' సినిమాకు మహేష్ కాస్ట్యూమ్స్‌తోపాటు, యూనిట్ దుస్తులన్నీ నేనే ఇవ్వాల్సి ఉండేది. సెట్‌లో 56 మంది నటీనటులు ఉండే అతిపెద్ద ప్యాడింగ్ సినిమా అది. ముందురోజు చెబితే రెండో రోజు దుస్తులు రెడీ చేసేవాడ్ని. ఈ సినిమా ఆఖరి సీన్స్ తీస్తున్నప్పుడే 'బిజినెస్‌మేన్' సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫీసు నుంచి పిలుపొచ్చింది. ఆ సినిమాకు కూడా కాస్ట్యూమ్స్ బాధ్యత నాకే ఇచ్చారు. ఒకవైపు దూకుడు షూటింగ్ పూర్తి అవుతుండగానే బిజినెస్‌మేన్ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే ఎలక్షన్ సీన్స్ తీశారు. అందులో వివిధ రాష్ట్రాల రాజకీయనాయకులు మాట్లాడుతారు.

వారందరికీ దుస్తులు అందించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కేరళ, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నాయకుల డ్రెస్ డిజైన్స్ తయారుచేసి ఇచ్చాను. ఆ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకున్నప్పటికీ, ఏ రోజూ ఇబ్బంది రాకుండా అనుకున్న సమయంలోనే దుస్తులు ఇవ్వగలగడం నాకు మంచి జ్ఞాపకం. మహేష్‌తో పర్సనల్ కాస్ట్యూమర్‌గా ఇప్పటివరకు 16 దేశాలు తిరిగాను. నేను కాస్ట్యూమర్‌గా పనిచేసిన 'పోకిరి', 'దూకుడు', 'బిజినెస్‌మేన్' సినిమాలు పరిశ్రమ మరచిపోలేని విజయాలు సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.''

No comments:

Post a Comment