Pages

Monday

ఈమెకు ఆకాశం ఓప్లేగ్రౌండ్...!



ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని వింగ్ కమాండర్లకు సాహసమే ఊపిరి. సాహసాల్లో పురుషులకు మేమేం తీసిపోమని నిరూపించారు వింగ్ కమాండర్ ఆశా జ్యోతిర్మయి సారథ్యంలోని మహిళా స్కైడైవింగ్ టీం. భారత వైమానిక దళంలో తొలిసారిగా మహిళా స్కైడైవింగ్ బృందాన్ని ఏర్పాటు చేసిన ఘనత వింగ్‌కమాండర్ ఆశా జ్యోతిర్మయికే ద క్కింది. అందుకే ఇటీవల జరిగిన ఉత్సవాల్లో ఆమె విన్యాసాలను రిటైర్డు ఎయిర్ చీఫ్ మార్షల్ ఐ.హెచ్.లతీఫ్ కొనియాడారు. 588 సార్లు ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేసిన జ్యోతిర్మయితో మనమూ కాసేపు ఆకాశ విహారం చేద్దాం!.

హైదరాబాద్ నగర శివార్లలోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్... 2012 జనవరి 21వతేదీ ఉదయం 9.50 గంటలు... ఆరుగురు వింగ్ కమాండర్లు ఎక్కిన ఎం.ఐ.8 హెలికాప్టరు టేకాఫ్ అయింది.

తొమ్మిది నిమిషాల్లో బేగంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కొచ్చి ఆకాశంలో ఆరువేల అడుగుల ఎత్తులో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అన్ని వేల అడుగుల ఎత్తులో వున్న హెలికాప్టర్ నుంచి ఆరుగురు సభ్యులతో కూడిన ఎయిర్ డెవిల్స్ బృందం ఒక్కసారిగా కిందకు దూకింది. ఆకాశంలో విన్యాసాలు చేసిన ఆ బృందం పారాచ్యూట్‌ల సాయంతో, ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సురక్షితంగా మైదానంలో దిగి, చిరునవ్వులు చిందించుకుంటూ సభికులకు అభివాదం చేసింది. అత్యంత సాహసోపేతమైన ఈ స్కైడైవింగ్ చేసిన బృందానికి నాయకత్వం వహించిన మహిళ బేగంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో వింగ్‌కమాండర్‌గా పనిచేస్తున్న ఆశా జ్యోతిర్మయి. మహిళలు ఎవరూ చేపట్టని ఈ సాహస విన్యాసాలను సాగించే క్రమంలో ఆమె వేసిన ప్రతి అడుగూ ఓ అద్భుతం.

పాఠశాలలో అథ్లెటిక్స్‌తో ఆరంభం
హైదరాబాద్‌లోని ఏఎస్ రావునగర్‌కు చెందిన ఆశా జ్యోతిర్మయి పాఠశాల స్థాయి నుంచి అథ్లెటిక్స్‌లో బాగా రాణించి, జాతీయ స్థాయికెదిగారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చంద్రశేఖర్ ప్రోత్సాహంతో ఈసీఐఎల్‌లోని ఆటమిక్ ఎనర్జీ స్కూలులో షాట్‌పుట్, జావెలిన్, లాంగ్‌జంప్ తదితర క్రీడలలో రాణించారు. "బాల్యంలోనే అప్పుడు యూనిఫాంలో ఉన్న సిపాయిలను చూసి, స్ఫూర్తి పొంది నేను ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని '' నిర్ణయించుకున్నానంటారు జ్యోతిర్మయి.

కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదివిన ఆశా క్రీడల్లో సాధించిన పతకాలతో స్పోర్ట్సు కోటాలో దక్షిణ మధ్య రైల్వే, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్టుమెంట్‌లలో ఉద్యోగాలు వచ్చినా ఏడాది మాత్రమే పనిచేశారు. ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనే లక్ష్యంతో ఆ రెండు ఉద్యోగాలు వదిలి 1997లో కమిషన్డ్ ఆఫీసర్‌గా చేరారు. వింగ్‌కమాండర్‌గా ఆగ్రా, చెన్నయ్, దిబ్రూఘర్, న్యూఢిల్లీలలో పనిచేసి ఇటీవల బేగంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు.

స్కైడైవింగ్ సాహసాలకు శ్రీకారం
పారాజంపింగ్‌లో కమాండర్ సంజయ్ థాపర్ చేసిన అత్యధిక జంప్‌లను చూసి స్ఫూర్తి పొందిన జ్యోతిర్మయి పురుషులే కాదు మహిళలు కూడా స్కైడైవింగ్ సాహసాలు చేసేలా ఆరుగురు తోటి మహిళా వింగ్‌కమాండర్లతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత, ప్రియాంక, నిషా, దూపల్ ఠాకూర్, ప్రియాంక హుడాలతో కలిసి ఏర్పాటు చేసిన మహిళా స్కైడైవర్‌లకు నాయకత్వం వహిస్తూ దేశ, విదేశాల్లో 588 జంప్‌లు చేసి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోనే అగ్రస్థానంలో నిలిచారామె. భర్త ఈకెఎన్ స్వరూప్ కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్‌కమాండర్‌గా పనిచేస్తూ 400 పారాజంప్‌లు చేశారు. ఎయిర్‌ఫోర్స్‌లో స్కైడైవింగ్ పారాజంప్‌లు చేసే దంపతులుగా ఆశా స్వరూప్‌లు పేరొందారు.

ప్రపంచమంతా కీర్తి బావుటా
స్కైడైవింగ్ చేయటమే హాబీగా పెట్టుకున్న ఆశా జ్యోతిర్మయి పలు సాహసాలు చేశారు. 2010 వ సంవత్సరంలో స్విట్జర్లాండ్‌లో జరిగిన 35వ ప్రపంచ మిలటరీ క్రీడోత్సవాల్లో పారా జంపింగ్ చేసిన మొట్టమొదటి మహిళగా ఇండియా కీర్తి ప్రతిష్ఠలను పెంచారు. మైక్రోలైట్ విమానంలో నుంచి పారాజంప్ చేసిన ఏకైక మహిళా స్కైడైవర్‌గా నిలచి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సాధించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 75మంది స్కైడైవింగ్ బృందంలో సభ్యురాలిగా ఈమె పాల్గొన్నారు.

గౌహతీలో జరిగిన ఎయిర్‌ఫోర్స్ శిబిరంలో 14000 అడుగుల పైనుంచి పారా జంపింగ్ చేసిన ఆశా మిజోరం గవర్నరు నుంచి ప్రశంసలు పొందారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన వాటర్‌స్పోర్ట్సు, సెయిలింగ్‌లలో అద్భుత ప్రతిభ కనబర్చి ఛాంపియన్‌షిప్ సాధించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అభినందనలు పొందారు. అమెరికాలోని అరిబోనాలో రోజుకు ఎనిమిది పారాజంప్‌లు చేస్తూ 45 రోజుల పాటు కఠోర శిక్షణ పొందానంటారామె. ఆ శిక్షణ నన్ను మరిన్ని జంప్‌లు చేసేందుకు ఉపకరిస్తుందని ఆమె వివరించారు.

ప్రమాదంతో సయ్యాట
"ఓ సారి చెన్నయ్‌లో తాంబరం ఎయిర్ బేస్‌లో పారా జంప్ చేస్తున్నపుడు హఠాత్తుగా వాతావరణం మారి భారీ వర్షం మొదలైంది. విమానం నుంచి దూకి పారాచుట్ తెరుచుకోగానే వర్షం ఆరంభమైంది. ఆ వర్షానికి పారాచుట్ తడిసి, అధిక గాలి వల్ల నేను ల్యాండ్ అయ్యే ప్రదేశం దిశ మారింది. ఓ పెద్ద భవనం, ఆ పక్కనే హైటెన్షన్ వైర్లు కనిపించాయి. 

దీంతో నా శక్తినంతా కూడదీసుకొని పారాచుట్ దిశ మార్చి అత్యవసరంగా ఓ రేకుల ఇంటిపై ల్యాండ్ అయ్యాను. దీంతో రెండు పళ్లు విరిగిపోవటంతోపాటు నుదుటి వద్ద చిన్న గాయాలయ్యాయి. నెలరోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. యాక్సిడెంట్ అయినా నా సంకల్పంలో మారలేదు. కోలుకున్న మరుసటి రోజు నుంచి మళ్లీ పారా జంప్‌లు చేయటం మొదలెట్టాను. స్కైడైవింగ్‌కు వెళుతున్న ప్రతిసారీ దేవుడిని ప్రార్థించుకోమ్మా... అని మా అమ్మ చెబుతూ వుంటుంది. నువ్వు దేవుడిని ప్రార్థించు...నేను జంప్‌లు చేస్తూ ఉంటాను'' అంటాను అన్నారు ఆశా నవ్వుతూ.

విమానంలో ఆకాశంలోకి వెళ్లి 14వేల అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయటం ప్రమాదంతో కూడుకున్నదైనా, ఎన్నిసార్లు చేసినా మళ్లీ మళ్లీ పారాజంప్‌లు చేయాలనిపిస్తుంటుంది అంటారామె. పక్షిలాగా ఎగురుతూ పారాచుట్ సాయంతో కిందకు దిగినపుడల్లా నేనెంతో థ్రిల్లింగ్‌గా ఫీలవుతుంటాను అంటారామె. 'సాహస విన్యాసాలు చేసే నీలాంటి ఫ్రెండ్ మాకున్నందుకు చాలా సంతోషమంటూ' నా బాల్యస్నేహితురాళ్లు ఎస్ఎంఎస్‌లు, ఫేస్‌బుక్‌ల ద్వారా సందేశాలు పంపిస్తుంటారు.

అది చూసి మరిన్ని పారాజంప్‌లు చేసేందుకు సమాయత్తమవుతుంటాను అంటారు ఆశా జ్యోతిర్మయి. ఆరునెలల బాబును మా అమ్మానాన్నల దగ్గర వదిలి స్విట్జర్లాండ్‌లో పారాజంప్‌లు చేసేందుకు వెళ్లగలిగానంటే, నా విజయంలో కుటుంబసభ్యుల సహకారం ఎంతగా వుందో మీకు అర్థం అయివుంటుందన్నారు ఆశా. సాహస విన్యాసాలతో మనకీర్తిని ప్రపంచవ్యాప్తం చేస్తున్న ఆశా జ్యోతిర్మయికి హ్యాట్సాఫ్ చెబుదామా!

No comments:

Post a Comment