Pages

Monday

భారతీయులు.. బ్యాక్టీరియా వాహకులు ఇండియాలో 20 కోట్ల మందిలో.. రెండు రకాల ప్రమాదకార బ్యాక్టీరియా

జర్మన్ పత్రిక విషప్రచారం
తీవ్రంగా ఖండించిన కేంద్ర ఆరోగ్య శాఖ


 "భారత దేశంలో మందులకు లొంగని 'సూపర్ బగ్' ఉంది. అది అక్కడికి వైద్యచికిత్సల కోసం వెళ్లి వస్తున్న వారి ద్వారా మిగతా ప్రపంచానికి పాకుతోంది'' ... రెండేళ్ల క్రితం భారతదేశంపై బ్రిటన్ చేసిన విషప్రచారమిది. తాజాగా, డెర్ స్పీగెల్ అనే జర్మన్ న్యూస్ మేగజైన్ ఒకటి అదేతరహా విషప్రచారానికి ఒడిగట్టింది. మందులకు లొంగని రెండురకాల బ్యాక్టీరియాలకు భారతీయులువాహకులంటూ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. "భారతదేశంలో 10 నుంచి 20 కోట్ల మందిలో ప్రపంచంలో ఏ యాంటీబయాటిక్ మందులకు లొంగని 'హెచ్ఏ-ఎంఆర్ఎస్ఏ', సీఎ-ఎంఆర్ఎస్ఏ' అనే రెండు అత్యంత ప్రమాదకర బ్యాక్టీరియాలకు వాహకులుగా ఉంటున్నారు. ఇది మహమ్మారిగా మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది'' .. ఇదీ దాని సారాంశం. 

ఫిలిప్ బెత్‌గే, వెరోనికా హేకెన్‌బ్రోచ్, లారాహోఫ్లింగర్, మైఖేల్ లియోక్స్, ఉడో లుడ్విగ్‌లు రాసినట్టుగా చెబుతున్న ఈ వ్యాసంలో.. పారిశుద్ధ్య లేమి, మందు చీటీ లేకుండానే మందులు కొనే వెసులుబాటు ప్రతిఒక్కరికీ ఉండటం, విచ్చలవిడి యాంటీబయాటిక్ మందుల వాడకమే పరిస్థితి తీవ్రతకు కారణమని పేర్కొన్నారు. కాస్మోటిక్ సర్జరీల కోసం అక్కడ నుంచి ఇక్కడకు వచ్చిన ఆంగ్లేయులకు ముందుగా ఆ బ్యాక్టీరియాలు సోకాయని, తద్వారా అక్కడికి వ్యాపించాయని, ఇప్పటికే అక్కడ వందల మంది వాటి బారిన పడ్డారని అందులో వివరించారు. 

ఒక్క బ్రిటన్‌కే కాదు.. జర్మనీ, అమెరికా, ఇజ్రాయిల్, న్యూ మెక్సికో తదితర దేశాలకు కూడా పాకుతోందని రాశారు. అయితే ఈ వ్యాసాన్ని.. కేంద్ర ఆరోగ్య శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆరోగ్య పరిశోధన విభాగాల డైరెక్టర్ జనరల్ కటోచ్ తీవ్రంగా ఖండించారు. "ఏ దేశంపై అయినా ఇలాంటి ఆరోపణలు చేయడం తప్పు. మేం ఇలాంటి నిరాధార వ్యాఖ్యలను అంగీకరించం. దీనికి సంబంధించి.. జీవ, వైద్య పరమైన అంశాలను అధ్యయనం చేస్తాం. 

ఆ పత్రికలో ప్రచురితమైన వ్యాసం విశ్వసనీయతను «ద్రువీకరించుకుంటాం. ఈ రెండూ జరిగాకే దీనిపై తగు చర్యలు తీసుకుంటాం'' అని కటోచ్ వ్యాఖ్యానించారు. 2010లో కూడా బ్రిటన్‌కు చెందిన లాన్సెట్ పత్రిక ఇదే తరహాలో 'ఎన్‌డీఎం-1' అనే సూపర్‌బగ్‌కు ఇండియా పుట్టిల్లు అంటూ విషప్రచారం చేసింది. అప్పట్లో మన ప్రభుత్వం కూడా దానికి ఘాటుగా స్పందించింది. ఆ సూపర్‌బగ్‌కు న్యూఢిల్లీ పేరుపెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది. 

ఆ రెండూ...
జర్మన్ పత్రిక ప్రస్తావించిన రెండు బ్యాక్టీరియాలూ.. కమ్యూనిటీ ఎక్వైర్డ్ మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫలోకోకస్ ఏరియస్ ( సీఏ-ఎంఆర్ఎస్ఏ), హాస్పిటల్ ఎక్వైర్డ్ మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫలోకోకస్ ఏరియస్ (హెచ్ఏ-ఎంఆర్ఎస్ఏ). వీటిలో మొదటిది చిన్నపిల్లలను, యువతీయువకులను... రెండోది వృద్ధులను, ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందినీ ప్రభావితం చేస్తాయి.

No comments:

Post a Comment