Pages

Tuesday

వణికించిన 2011...


రాజకీయ రంగ పరిణామాలే పతాక శీర్షికలుగా, ప్రధాన వార్తలుగా ఉండే దేశీయ మీడియాలో ఆర్థిక రంగానికి మరీ ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక రంగాలకు సంబంధించి వార్తలే ఇప్పుడు కీలక స్థానం ఆక్రమిస్తున్నాయి. విధాన నిర్ణేతల గుండెల్లో రైళ్లను పరుగెత్తించే ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, విత్తలోటు కావచ్చు... పారిశ్రామికవేత్తలను గడగడలాడించే టెలికాం, మైనింగ్, ఆయిల్, గ్యాస్... రంగాల్లోని కార్పొరేట్ కుంభకోణాలు కావచ్చు. ఈ వార్తలు లేకుండా ఏ రోజూ గడవడం లేదు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్‌ల పర్యవసానమా లేక యుగ ధర్మమా.. ఈ చర్చ పక్కనబెటిదే ఈ ఏడాది ఇన్వెస్టర్లను, వినియోగదారులను, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేసిన కొన్ని ముఖ్య అంశాల పరామర్శ.
చేతులు కాల్చిన సెన్సెక్స్
ఈ ఏడాది సెన్సెక్స్ 23 శాతం నష్టపోయింది. ఏడాది తొలి రోజు ట్రేడింగ్‌లో 20561 పాయింట్ల వద్ద ట్రేడయిన సెన్సెక్స్ డిసెంబర్ 26 సోమవారం నాడు 15970 వద్ద ముగిసింది. నికరంగా 22.32 శాతం నష్టం చవిచూసింది. అధిక మూలధనం ఉన్న పెద్ద కంపెనీల షేర్ల కంటే చిన్న తరహా కంపెనీలు, మధ్యతరహా కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన లక్షలాది మంది ఇన్వెస్టర్లు దారుణంగా చేతులు కాల్చుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీల యూలిప్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడుల విలువ కూడా 25-30 శాతం మేర తగ్గిపోయింది.

మొ త్తం ఇన్వెస్టర్ల సంపద 20 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. మ న మార్కెట్ లక్ష కోట్ల డాలర్ క్లబ్ నుంచి జారిపోవడం ఈ సంవత్సరంలో మరో చేదు అనుభవం. ఇన్వెస్టర్లకు ఇది విషాద సంవత్సరం. మార్కెట్ ప్రతికూల పరిస్థితుల కారణంగా నిధులసమీకరణ కోసం పెట్టుబడుల మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకున్న కంపెనీలు కూడా తమ ప్రతిపాదనలు వాయిదా వేసుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 40 వేల కోట్ల రూపాయలను సమీకరించాలన్న భారీ లక్ష్యంపెట్టుకున్న ప్ర భుత్వం కూడా మార్కెట్ దెబ్బకు చేతులెత్తేసి, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది.

కేంద్ర ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్న అతిపెద్ద సవాలు డాలర్ మారకంలో రూ పాయి విలువ పతనం. ఈ ఏడాది జూన్ - జూలై వరకు స్వల్ప మార్పులతో డాలర్ మారకంలో 44 రూపాయల వద్ద స్థిరంగానే ఉంటూ వచ్చిన రూపాయి ఆ తర్వాత జారుడు బండనెక్కింది. డిసెంబర్ నాటికి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 54 రూపాయలను తాకింది. మళ్లీ స్వల్పంగా పుంజుకున్నా మారకం విలువపై అనిశ్చితి మాత్రం తొలగలేదు. గత ఆరు నెలల్లో రూపాయి విలువ 23 శాతం మేర నష్టపోయింది.

పెరుగుతున్న వాణిజ్య లోటు, అదుపుతప్పుతున్న ద్రవ్యలోటు ప్రభుత్వాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఎగుమతులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నా వాణిజ్య లోటు తగ్గే అవకాశం మాత్రం లేదు. మిలటరీ కొనుగోళ్లు, నిత్యవసరమైన చమురు దిగుమతి భారం భారీగా పెరుగుతోంది. ముడిసరుకుల కోసం దిగుమతులపై ఆధారపడిన అనేక కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఆర్‌బిఐ దగ్గర ఉన్న ఫారెక్స్ నిల్వలు రూపాయిని ఎంత మేరకు నిలబెడుతాయన్నది అతిపెద్ద ప్రశ్న. విధాన నిర్ణేతలతో ద్రవ్యోల్బణం కబడ్డి ఆడింది.

ఎప్పటికప్పుడు వారు ప్రకటించిన అంచనాలను తలకిందులు చేస్తూ ముందుకు దూసుకుపోయింది. ఏడాది చివరలో కొంత శాంతించినప్పటికీ ఏడాది పొడవున ఆహార ద్రవ్యోల్బణం కొట్టిన బుసలకు జనజీవితం అతలాకుతలమైంది. ఉల్లిపాయలు, టమోటాల ధరలు కూడా తారాజువ్వలా దూసుకుపోయాయి. ఏడాది ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్‌బిఐ ఎడాపెడా కీలక వడ్డీరేట్లను పెంచినప్పటికీ ఫలితం మాత్రం కనిపించలేదు. హోల్‌సేల్ ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది అంతా 8.2 నుంచి 9.4 మధ్య కొనసాగింది. ఆహార ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి తగ్గినట్టుగా కనిపిస్తున్నా బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా ఎనలిస్టులు చెబుతున్నారు.

వాణిజ్య, పారిశ్రామిక రంగాలను కుంగదీసిన అతిపెద్ద సమస్య వడ్డీరేట్లు. ద్రవ్యోల్బణంపై అస్త్రంగా వడ్డీరేట్ల పెం పును ఆర్‌బిఐ ప్రయోగిస్తూ రావడంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై భారం పెరిగింది. నిధుల సమీకరణ వ్యయం పెరగడంతో అనేక కంపెనీలు నష్టాలపాలయ్యాయి. రియల్టీ కంపెనీలు దారుణంగా దెబ్బతిన్నాయి. మరోవైపు బ్యాంకులకు కూడా ఇదో పెద్ద సమస్యగా మారింది. డిఫాల్ట్‌లు పెరగడంతో ఎన్‌పిఎల భయంతో బ్యాంకులు గడగడలాడుతున్నాయి.

కార్లు, గృహాలు, వాణిజ్య రుణాలు, వ్యక్తిగత రుణాల రేట్లు పెరగడంతో వినియోగంపై దాని ప్రభావం పడింది. పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలోని మందగమనానికి ముఖ్య కారణం భగ్గుమంటున్న వడ్డీరేట్లే. 2011లోనే మొత్తం ఏడుసార్లు ఆర్‌బిఐ రేట్ల పెంపు చేపట్టింది. గత ఏడాది మార్చి నుంచి వరుసగా 13 సార్లు రేట్లను పెంచిన ఆర్‌బిఐ ఎట్టకేలకు ఈ డిసెంబర్‌లో రేట్ల పెంపునకు విరామం ప్రకటించింది. ఇప్పుడున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువని చెబుతున్నారు. వినియోగదారులకు సంబంధించి సేవింగ్స్ ఖాతాల వడ్డీరేట్లపై నియంత్రణను ఎత్తివేయడం ఆర్‌బిఐ తీసుకున్న సంచలన చర్య.

నూరేళ్ల సంబరాలు జరుపుకుంటున్న భారతీయ విమానయాన రంగం ఈ ఏడాది పూర్తి ప్రతికూల వాతావరణంతో కంపించిపోయింది. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ వడ్డీ రేట్ల భారం, ఇంధన వ్యయం ఎయిర్ లైన్స్ కంపెనీలను చావుదెబ్బతీశాయి. విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్ ఫిషర్ పుట్టిమునిగే స్థాయికి చేరింది. ప్రభుత్వ సహకారం కోసం అంగలార్చాల్సి వచ్చింది. పలు మార్గాల్లో సర్వీసులను రద్దు చేసుకోవల్సి వచ్చింది. నష్టాలు, రుణాల భారం ఈ సంస్థను కుంగదీశాయి.

ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా కూడా మూతపడే స్థితికి చేరింది. సమ్మెలతో సంస్థ అల్లాడిపోయింది. ఎయిరిండియాపై అప్పుల భారం 43 వేల కోట్ల రూపాయలుంటుందని అంచనా. పలు సందర్భాల్లో సర్వీసులను రద్దు చేసుకున్నది. పరిశ్రమనష్టాలు 15 వేల కోట్ల రూపాయలుంటాయని అంచనా. మరోవైపు పలువురు వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లతో పైలెట్లుగా చేరారన్న వార్త సంచలనం సృష్టించింది. ఈ స్కామ్‌లో 23 మందిని అరెస్టు చేశారు. చౌక ధరల విమానయాన సంస్థలు మాత్రమే ఈ ఏడాది రాణించాయి. విదేశీ విమానయాన సంస్థలను దేశీయ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతించాలన్న డిమాండ్, దీనికి ప్రభుత్వ సానుకూల స్పందన ఈ ఏడాది విశేషం.

వెండి, బంగారం మెరుపులు మెరిపించాయి. ఈ రెండు ముఖ్య లోహాల్లోనూ స్పెక్యులేషన్‌కు వెళ్లిన ఇన్వెస్టర్లు భారీగా చేతులు కాల్చుకున్నారు. జాగ్రత్తపడి తక్కువ స్థాయిల్లో కొనుగోలు చేసిన వారు దండిగా లా భపడ్డారు. బంగారం ఈ ఏడాది మొత్తమ్మీద 32.7 శాతం పెరిగింది. పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లు చలిస్తూ వచ్చాయి. జనవరిలో 1,350 డాలర్లు ఉన్న ఔన్స్ (28.34 గ్రాములు) బంగారం ధర డిసెంబర్‌లో 1,600 డాలర్లకు చేరింది. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య 1,900 డాలర్లను కూడా తాకింది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం (స్వచ్ఛమైన) ధర ఏడాది జనవరిలో 20,660 రూపాయల స్థాయిలో ఉంది. డిసెంబర్‌లో (8వ తేదీ ) అదే 10 గ్రాముల బంగారం ధర 30 వేల రూపాయలకు చేరువగా వెళ్లింది. డిసెంబర్‌లో కిలో వెండి ధర 71,500 (ఏప్రిల్ 30) రూపాయల వరకు వెళ్లింది.

ప్రస్తుతం 53 వేల రూపాయల స్థాయిలో ఉంది. పర్యావరణ కారణాలతో మైనింగ్‌కు విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేంగా భారీ ఎత్తున ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో అనే క ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయి. వేదాంత, పోస్కో వంటి బహుళజాతి సంస్థలు వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అవాంతరాలు ఏర్పడ్డాయి. మైనింగ్ రంగంలోని కంపెనీలు తమ లాభాల్లో కొంత వాటాను స్థానిక ప్రజల అభివృద్ధి కోసం వెచ్చించాలన్న కొత్త మైనింగ్ బిల్లులోని నిబంధనపై కార్పొరేట్ రంగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

మరోవైపు మైనింగ్ రంగంలోని భారీ స్కామ్‌లు కూడా బయటకు వచ్చాయి. లైసెన్స్‌లు అనుమతులతో నిమిత్తం లేకుండా యధేచ్చగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో ముడి ఇనుమును విక్రయించి వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఆరోపణలపై కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఆయన సహచరులు ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. బొగ్గు కొరత ఒకవైపు, సహజవాయువు కొరత మరోవైపు తీవ్రం కావడంతో దేశీయంగా తీవ్రమైన విద్యుత్ కొరత మొదలైంది. పారిశ్రామిక సంస్ధలకు ఇది శాపంగా మారింది. ఉత్పత్తి కుంటుబడింది. దిగుమతి చేసుకున్న ఇంధనంతో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ వ్యయం భారీగా ఉండటంతో చిన్న కంపెనీలపై భారం విపరీతంగా పెరిగింది.

No comments:

Post a Comment