Pages

Sunday

ఫ్యాటీలివర్‌తో కాలేయానికి ముప్పు


మానవ శరీరంలో అతికీలకమైన అవయవం కాలేయం. ఈ అవయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్ సమస్య మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారే అవకాశం ఉన్న ఈ సమస్యను ఆధునిక చికిత్సలతో సులభంగా తగ్గించవచ్చని అంటున్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా. ఎమ్.ఎన్. పవన్‌కుమార్.

పై పొట్టలో నొప్పి వస్తుంటే ఎసిడిటీ అనుకుని తెలిసిన మాత్రలేవో వేసుకుని ఉండిపోతారు. చివరకు నొప్పి ఎక్కువయ్యాక ఆసుపత్రికి వెళితే అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఫ్యాటీలివర్ అని తేలుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

కారణాలు
ఫ్యాటీ లివర్ సమస్య చేజేతులా కొనితెచ్చుకుంటున్నదే. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీలివర్ సమస్య కనిపిస్తోంది. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చిప్స్, బర్గర్స్ వంటి జంక్‌ఫుడ్స్ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, సమయపాలనలేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పులు కాలేయవాపుకు కారణమవుతున్నాయి. డయాబెటిస్ మూలంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది.

ఏం జరుగుతుంది?
శరీరంలోని కొవ్వును వివిధ భాగాలకు అందజేసే ప్రక్రియను నిర్వర్తించడంలో లివర్ ప్రధానపాత్ర పోషిస్తుంది. శరీరంలోకి వచ్చిన ఫ్యాట్ అంతా కాలేయంలో నుంచి వచ్చిన ఎంజైమ్స్‌తోనే డైజెస్ట్ అవుతుంది. శరీరానికి, గుండె వంటి కొన్ని అవయవాలకు కొంత ఫ్యాటీ యాసిడ్స్ అవసరమవుతాయి. కానీ అధిక మొత్తంలో కొవ్వు వచ్చి చేరినపుడు అది శరీరంలో పేరుకుపోతుంది. ఫలితంగా కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా కణాలు ఉబ్బి ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది. ఇది మొదటి దశ. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉబ్బిన కణాలు పగిలిపోతాయి. దీంతో ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఇది రెండవ దశ. ఆల్కహాల్ ఎక్కువ మెతాదులో తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లయితే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. ఆహారపు అలవాట్ల వల్ల వచ్చినట్లయితే నాన్ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. వైరస్‌ల వల్ల వచ్చినట్లయితే వైరల్ హెపటైటిస్ అని పిలుస్తారు. ఈ దశలో కూడా చికిత్స తీసుకోకపోతే లివర్ పూర్తిగా సింక్ అవుతుంది. దీన్ని లివర్ సిర్రోసిస్ అంటాము. ఇది మూడవదశ.

లక్షణాలు
పొట్టలో బరువుగా ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. పొట్ట పైభాగంలో నొప్పిగా ఉంటుంది. కొందరిలో అల్ట్రాసౌండ్ పరీక్షలో ఫ్యాటీలివర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. లక్షణాలు మాత్రం కనిపించవు. రెండవ దశలో కామెర్లు(జాండిస్) కనిపిస్తాయి. రక్తస్రావం మొదలవుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి. లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. పొట్టలో, కాళ్లలో నీరు పేరుకుపోతుంది. మూడవ దశలో కూడా ఇవే లక్షణాలు కనిపించడంతో పాటు ఇతర అవయవాలు దెబ్బతినడం మొదలవుతుంది.

చికిత్స
ఫ్యాటీలివర్ సమస్య ఎందువల్ల వచ్చింది కనుక్కోవాలి. కారణాన్ని తెలుసుకుని అందుకు తగిన చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌ను ఫాస్టింగ్‌లో చేయించాలి. కాలేయ పనితీరును తెలుసుకోవడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను మందులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, బరువును తగ్గించుకోవడంతో పాటు మందులు వాడాల్సి ఉంటుంది. రెండవ దశలో ఆసుపత్రికి వెళ్లినా మందులతో బాగు చేయవచ్చు. 70 శాతం లివర్‌పాడయినా మిగతా బాగున్న 30 శాతం లివర్ దెబ్బతినకుండా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మూడవ దశలోకి అంటే లివర్ సిర్రోసిస్‌కు దారితీయకుండా కాపాడటం జరుగుతుంది. 

మూడవ దశ అంటే లివర్‌సిర్రోసిస్‌లో కాలేయం సింక్ అయిపోయి ఉంటుంది. పాడయిన లివర్‌ను బాగుచేయడం కుదరదు. అయితే లివర్ 10 శాతం బాగున్నా శరీరానికి సరిపోతుంది. ఈ దశలో చికిత్స ఏమిటంటే ఆ పది శాతం దెబ్బతినకుండా కాపాడటమే. దీంతోపాటు కాలేయం మీద ఒత్తిడి పడకుండా చూడటం, ఇతర కాంప్లికేషన్స్ రాకుండా మందులు ఇవ్వడం జరుగుతుంది. లివర్‌కు సపోర్టుగా మెడిసిన్స్ ఇవ్వడం, శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా మందులు ఇవ్వడం, పేగుల్లో బాక్టీరియా తగ్గడానికి యాంటీ బయాటిక్ మందులు ఇవ్వడం వంటివి చేస్తాము. మొదటి దశ, రెండవ దశలో వచ్చిన వారికి చికిత్స ఇవ్వగలం. మూడవ దశలో చికిత్స ద్వారా పాడయిన కాలేయాన్ని బాగుచేయలేం.

గాల్‌స్టోన్స్
గాల్‌స్టోన్స్ ఏర్పడటానికి కొలెస్ట్రాల్ కారణమవుతుంది. గాల్‌బ్లాడర్ కాలేయం కింద ఉంటుంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువయినపుడు కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. అప్పుడు కాలేయం దాన్ని బయటకు పంపించేస్తుంది. ఇది గాల్‌బ్లాడర్‌లోకి వెళుతుంది. లివర్ నుంచి ఉత్పత్తి అయ్యే బైల్‌లో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇది గాల్‌బ్లాడర్‌లోకి వెళ్లి చివరకు గట్టిపడి స్టోన్స్‌గా మారిపోతుంది. జీర్ణక్రియ జరుగుతున్నపుడు బైల్ అంతా జీర్ణక్రియ కోసం వెళుతుంది. ఫాస్టింగ్ ఉన్నప్పుడు బైల్ అంతా ఎక్యుములేట్ అయిపోతుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తే గాల్‌స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

చికిత్స
గాల్‌బ్లాడర్‌లో ఏర్పడే స్టోన్స్ మెడిసిన్‌తో కరగవు. ఇవి కొలెస్ట్రాల్ మూలంగా ఏర్పడినవి. ఆపరేషన్ చేసి తొలగించడం ఒక్కటే పరిష్కారం. అయితే రాళ్లు ఉన్నంత మాత్రాన అందరికీ సర్జరీ అవసరం లేదు. నొప్పి ఉన్నప్పుడు, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అంటే షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేనప్పుడు ఆపరేషన్ చేయాల్సిఉంటుంది. మళ్లీ రాళ్లు ఏర్పడకుండా ఉండటం కోసం గాల్‌బ్లాడర్‌ను పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ప్రస్తుతం లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా గాల్‌బ్లాడర్ స్టోన్స్ తొలగించడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో సిల్స్(సింగిల్ ఇన్‌సిషన్ లాప్రోస్కోపిక్ సర్జరీ) అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో బొడ్డు దగ్గర ఒకే రంధ్రం చేసి గాల్ బ్లాడర్ తొలగించడం జరుగుతుంది. ఈ సర్జరీ వల్ల రోగి త్వరగా కోలుకుంటారు. 

No comments:

Post a Comment