Pages

Friday

అంతరిక్షానికి ప్రతిసృష్టి...!


రోదసీ... ఓ అంతుపట్టని రహస్యం. భూమితో పోల్చితే అక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నం, సంక్లిష్టం. వ్యోమగాములు మామాలుగా గ్రహాలపై దిగడం, అంతరిక్షంలో నడవడం వంటి పనులే చాలా కష్టం. మరి.. కక్ష్యలో వేగంగా దూసుకెళ్లే ఉల్కలపై దిగి, విలువైన ఖనిజవనరులను తవ్వాలంటే ఇంకెంత కష్టంగా ఉంటుంది? అందుకే 2025 నాటికి ఉల్కల మైనింగ్‌ను చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అచ్చం అలాంటి వాతావరణాన్నే ప్రతిసృష్టి చేస్తూ, రెండేళ్లుగా అనుకరణ ప్రయోగాలు నిర్వహిస్తోంది. టెక్సాస్‌లోని జాన్సన్ అంతరిక్ష కేంద్రం తాజాగా ఆ ప్రయోగాలకు వేదికైంది...
అంతరిక్ష పరిశోధనలు మొదలై ఎన్నో ఏళ్లు అయినా, చంద్రుడు, అంగారకుడు, ఇతర గ్రహాలపై మాత్రమే ఎక్కువగా దృష్టిపెట్టారు. ఉల్కలపై పరిశోధన అంత సులభం కాదు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు పెద్దగా జరగలేదు. ప్రస్తుతం సాంకేతిక రంగం బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో నాసా ఉల్కల మైనింగ్ పైనా దృష్టి సారించింది. అయితే కక్ష్యలో తిరిగే ఉల్కలపై రోబోలు లేదా వ్యోమగాములను దింపడమనేది చాలా కష్టం కాబట్టి.. ‘డెజర్ట్ ర్యాట్స్’ అనుకరణ ప్రయోగాల (మాక్‌అప్స్) తో అసలు ప్రయోగాలకు నాసా బాటలు వేసుకుంటోంది. 

డెజర్ట్ ర్యాట్స్ అంటే...


భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష కార్యక్రమాల్లో ఉపయోగించనున్న రోబోలు, యంత్రాలు, ఇతర పరికరాలను కృత్రిమ రోదసీ వాతావరణంలో పరీక్షించడం, వ్యోమగాములతో అనుకరణ ప్రయోగాలు నిర్వహించడం కోసం ప్రారంభించిన కార్యక్రమమే ‘డెజర్ట్ ర్యాట్స్’. దీనిని నాసా 1997లో ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా ఇంతకాలం అంతరిక్షంలోని వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకరణ ప్రయోగాలు చేపట్టిన నాసా ఉల్కల మైనింగ్‌పై ప్రయోగాలు మాత్రం గత ఏడాదే మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరిలో రెండోసారి మిషన్ చేపట్టగా, మూడోసారి ప్రయోగాలు ఇటీవల ప్రారంభించింది. తొలుత అరిజోనా ఎడారిలో ప్రయోగాలు నిర్వహించగా, ఉల్కల మైనింగ్ ప్రయోగాలు మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టెక్సాస్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో జరుగుతున్నాయి. ఎడారిలో ప్రయోగాలు ప్రారంభించినందు న, ఈ మిషన్‌కు డెజర్ట్ ర్యాట్స్ (రీసెర్చ్ అండ్ టెక్నాలజీ స్టడీస్) అని పేరుపెట్టారు. 

ఇవీ ప్రయోగాలు...
తాజా ప్రయోగంలో భాగంగా... డెజర్ట్ ర్యాట్స్ బృందం ఆస్టరాయిడ్ (ఉల్క) ఇటోకోవా మిషన్ చేపట్టింది. పదిరోజుల పాటు జరిగే ఈ మిషన్‌లో... మొదటి రోజు వ్యోమగాములు స్పేస్ సెంటర్‌లోని మల్టీ మిషన్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ వెహికిల్ (ఎంఎంఎస్‌ఈవీ) లోకి ప్రవేశిస్తారు. కక్ష్యలో సెకనుకు 25 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఇటోకోవా ఉల్కకు అనుకరణగా జాన్సన్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఉల్కపై ర్యాట్స్ బృందం దిగనుంది. ఖనిజాలను సేకరించడం, స్పేస్‌వాక్ చేయడం వంటి పనులూ చేస్తారు. జీరో గ్రావిటీ వాతావరణంలో ఎంఎంఎస్‌ఈవీలో నివసిస్తూ ఆస్టరాయిడ్‌కు వెళ్లడం, పరికరాల తరలింపు చేపడతారు. ఈ వాహనం నిజం రోదసీని తలపించేలా కదులుతుంది. ధ్వని ప్రసారం 50 సెక న్లు ఆలస్యంగా ఉంటుంది.


ఈ మొత్తం తతంగం భూమికి, ఆస్టరాయిడ్‌కు మధ్య కాంతివేగంతో ప్రయాణించినట్లు అనిపించేలా ఉంటుంది. క్రేన్ మాదిరిగా వ్యోమగాములను గాలిలో వేలాడదీసే ఆర్గోస్ అనే యాక్టివ్ రెస్పాన్స్ గ్రావిటీ ఆఫ్ లోడ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తూ వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లో జీరో గ్రావిటీ వాతావరణంలో స్పేస్‌వాక్ చేస్తారు. ఆస్టరాయిడ్‌కు సమీపంలోకి వెళ్లాలంటే దాని వేగం, స్థానం కచ్చితంగా తెలియాల్సిందే. కేవలం ఒక సుత్తితో ఆస్టరాయిడ్ రాయిని కొట్టినా కూడా వ్యోమగామి దాని నుంచి చాలా దూరం వరకు ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది. సేకరించిన శాంపిల్స్ కూడా ఎగిరిపోవచ్చు. కాబట్టి ఈ పనులన్నీ అనుకరిస్తూ ప్రాక్టీస్ చేస్తారు. అంతరిక్షంలో నడిచేందుకు ప్రస్తుతం వాడు తున్న స్పేస్ సూట్ల కంటే ఆధునికమైన, మెరుగైన సూట్‌పోర్టులను కూడా ఉపయోగిస్తారు. ఒక రోజులో నాలుగుసార్లు గంటచొప్పున వీటితో స్పేస్‌వాక్ చే స్తారు.

No comments:

Post a Comment