Pages

Sunday

అబ్దుల్ కలాం 'టర్నింగ్ పాయింట్'


అబ్దుల్ కలాంకు మంత్రి పదవి: 98లో వాజపేయి ఆఫర్- vajpayee wanted induct kalam as minnister in NDA

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆ పదవిలో కూర్చోవడానికి నాలుగేళ్ల ముందే కేంద్రమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చింది. 1998లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా చేరాలంటూ కలాంను ఆహ్వానించారు. అయితే కాలం ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇటీవల రాసిన టర్నింగ్ పాయింట్స్ పుస్తకంలో కలాం ఈ విషయాలను పేర్కొన్నారు.

వాజ్‌పేయి అహ్వానాన్ని అంగీకరించి ఉంటే రాష్ట్రపతిగా ఎంపిక కాక ముందు అబ్దుల్ కలాం కేంద్ర మంత్రి అయ్యేవారు. వాజ్‌పేయి కోరిక తీరి ఉంటే కలాం కేంద్ర మంత్రిగా మరో కొత్త పాత్రలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించేవారు. అయితే, ఆయన అప్పటికే దేశ ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నందున వాజ్‌పేయి ఆహ్వానాన్ని అంగీకరించలేకపోయారు.

1998లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఏడాది మార్చి 15న అర్ధరాత్రి వాజ్‌పేయి నుంచి ఫోన్ వచ్చిందని, తాను కొత్త మంత్రివర్గం ఏర్పాటు కోసం జాబితా సిద్ధం చేస్తున్నానని తనను కూడా అందులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తనకు చెప్పారని, దీంతో తాను కొంత సమయం ఇస్తే ఆలోచించుకుని చెబుతానని బదులిచ్చానని, ఆలోచించుకుని రేపు ఉదయం తొమ్మిది గంటలకు తనను కలవాల్సిందిగా వాజ్‌పేయి కోరారని, అప్పటికప్పుడు తన సన్నిహిత మిత్రులతో సంప్రదింపులు మదలు పెట్టానని, తెల్లవారుజామున మూడు గంటల వరకూ మాట్లాడుకుంటూనే ఉన్నామని, ఆ తర్వాత రోజు ఉదయం తాను ప్రధాని నివాసానికి వెళ్లి, మంత్రివర్గంలో చేరరాదన్న నిర్ణయాన్ని చెప్పానని కాలం తన పుస్తకంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం తమ బృందం దేశ ప్రయోజనాలకు సంబంధించి కీలకమైన రెండు బాధ్యతలు నెరవేర్చడంలో తలమునకలై ఉందని, ఒకటి అగ్ని క్షిపణిని అభివృద్ధి పరచడం, రెండోది అణు కార్యక్రమానికి చెందిన వరుస పరీక్షలు నిర్వహించడమని, ఈ రెండు పనులు ఎంతో కీలకమైనవని, తన పూర్తి సమయాన్ని వాటికి సంబంధించిన పనుల కోసం వెచ్చించాల్సి ఉందని, దేశం కోసం ఈ పనులు చేసేందుకు మీరు అనుమతిస్తే ముందుకు సాగుతాను అని చెప్పానని రాశారు. దీంతో మీ భావాలను తాను అభినందిస్తున్నానని, మీ లక్ష్య సాధనలో మీరు ముందుకు సాగిపోవచ్చని వాజ్‌పేయి బదులిచ్చారని కలాం పేర్కొన్నారు.


2004లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రచ్చ
2004లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రచ్చ పైన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇన్నాళ్ల తర్వాత బహిర్గతం చేశారు. రాష్ట్రపతిగా తన ఐదేళ్ల పదవీ కాలానికి సంబంధించిన అనుభవాలతో కలాం 'టర్నింగ్ పాయింట్' అనే పుస్తకాన్ని రాశారు. అది త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు మీడియాకు వెల్లడయ్యాయి. 2004 సాధారణ ఎన్నికల తర్వాత ప్రధానిగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అభ్యర్థిత్వంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. ఆమెతో ప్రమాణ స్వీకారం జరిపించడానికి రాష్ట్రపతి భవనం సిద్ధమైందని కలాం తన పుస్తకంలో వెల్లడించారు.

వివాదాస్పద నిర్ణయాల పేరిట రాసిన పుస్తకంలోని ఓ శీర్షికలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోనియా ప్రధాన పదవిని కోరుకొని ఉంటే ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం మినహా రాజ్యాంగపరంగా మరో ప్రత్యామ్నాయమేమీ ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే అనూహ్యంగా సోనియానే మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారన్నారు. సోనియా ప్రధాని కాకపోవడమే కాదు.. మన్మోహన్ ఆ పదవిని చేపట్టడమూ తనను అమితాశ్చర్యానికి గురిచేసిందని కలాం వెల్లడించారు.

ఆ సమయంలో చాలామంది నేతలు కలిసి ఒత్తిళ్లకు లొంగకుండా సోనియాను ప్రధానిగా నియమించాలని విజ్ఞప్తి చేశారని, దీన్ని మన్నించడానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు కూడా ఏమీ లేవని, ఆమె సిద్ధమై ఉంటే సోనియాను నియమించడం తప్ప తనకు మార్గాంతరం లేదని స్పష్టం చేశారు. ఊ పుస్తకం ద్వారా కలాం సోనియా అభ్యర్థిత్వానికి తాను మోకాలడ్డానన్న వాదనను పటాపంచలు చేశారు.

అప్పట్లో అబ్దుల్ కలామే సోనియా అభ్యర్థిత్వంపై విముఖత చూపినట్లుగా కథనాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అటు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే, ఇటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఏ పోటీ పడ్డాయని తెలిపారు. ఆ సంకట సమయంలో తాను ఆందోళన పడటానికి తగిన కారణమే ఉందన్నారు. అయినా.. పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కే తొలి అవకాశం ఇవ్వాలని నిర్ణయించానని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ లేఖ పంపానని చెప్పారు. ఫలితాలు వెల్లడవగానే సోనియా.. ప్రధానిని వెంట పెట్టుకొని తన వద్దకు వచ్చిన సందర్భాన్ని వివరించారు.

సోనియా కలవాలనుకుంటున్నారని తనకు తెలిపారని, ఆ రోజు (మే 18) మధ్యాహ్నం 12. 30 గంటల సమయంలో మన్మోహన్‌ను వెంటబెట్టుకొని ఆమె వచ్చారని, ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం తమ పార్టీకి ఉన్నట్టు చెప్పారని, కానీ, పార్టీకి మద్దతు ఇస్తూ వివిధ పార్టీలు ఇచ్చిన సమర్థన లేఖలను మాత్రం అప్పుడు ఇవ్వలేదన్నారు. 19న అందిస్తానని చెప్పారని, కానీ, అదేరోజు రాత్రి కలవాలనుకుంటున్నట్టు సోనియా నుంచి ఈ మెయిల్ అందిందన్నారు. ఆ వెంటనే ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరించరాదంటూ అనేకమంది వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ఈ మెయిల్ వరద పారించాయన్నారు.

ఆ రాత్రి జరిగిన భేటీలో సోనియా.. మద్దతు లేఖలను అందించానని తెలిపారు. ఆ వెంటనే తాను ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించానని చెప్పారు. మీరు సమ్మతిస్తే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పానని, అప్పుడే ఆమె మన్మోహన్ సింగ్ పేరును ప్రస్తావించారని, తమ పార్టీ ఆయనను ప్రధానమంత్రిగా ఖరారు చేసినట్టు వెల్లడించారని, ఆ నిర్ణయం తనను అమిత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. సోనియా ప్రమాణ స్వీకారానికి చేసిన ఏర్పాట్లను అప్పటికప్పుడు మార్చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మే 22న మన్మోహన్ సింగ్ ప్రమాణం చేశారని, అప్పటికీగానీ.. పెద్ద భారం తప్పిపోయినట్టు తాను ఊపిరి పీల్చుకోలేకపోయానని వివరించారు. ఐదేళ్లలో ఇలాంటి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ పవిత్రతను కాపాడేందుకు పలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, అయితే ప్రతిసారీ తన ఆలోచనలు నిష్పక్షపాతంగా ఉండేటట్టు చూసుకున్నానని, నిర్ణయానికి ముందు న్యాయ, రాజ్యాంగ నిపుణులను తీసుకున్నానని గుర్తుచేశారు. హార్పర్ కోలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ కలాం పుస్తకం వచ్చేవారం మార్కెట్‌లోకి విడుదల కానుంది.

2002లో గుజరాత్ గోద్రా అనంతర అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటించాలని తాను నిర్ణయం తీసుకోవడం గురించి కూడా కలాం ఈ పుస్తకంలో వివరించారు. పర్యటన వద్దని మంత్రిత్వ, అధికారవర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైందని పేర్కొన్నారు. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి కూడా ఈ సమయంలో పర్యటన అవసరమని భావిస్తున్నారా అని అడిగారని, దానికి తాను చాలా ముఖ్యమైన బాధ్యత అని బదులిచ్చానని వివరించారు.

అయితే, సోనియాపై కలాం వ్యాఖ్యలకు ఇప్పుడు విలువ లేదని జేడీ(యూ) పెదవి విరిచింది. ఈ పని ఆయన 2004లోనే చేసి ఉంటే దేశానికి మంచి జరిగేదని ఆ పార్టీ చీఫ్, ఎన్డీయే కన్వీనర్ శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవిని వదులుకొని సోనియా పెద్ద త్యాగమేమీ చేయలేదని బిజెపి ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ గుర్తు చేశారు. గతించిన చరిత్రగా ఈ ఉదంతాన్ని సిబిఐ జాతీయ నేత రాజా అభివర్ణించారు.

No comments:

Post a Comment