Pages

Tuesday

సరైన కాలేజ్‌ను ఎంచుకోండిలా..


ఎంసెట్ ఫలితాలు, ర్యాంకులు వచ్చేశాయి. ఈ వారంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక... ఇప్పుడు విద్యార్థుల కసరత్తు మంచి కళాశాలను ఎంచుకోవడంపైనే. ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
ఒక కళాశాల మెరుగైందా? కాదా? అని తెలుసుకోవడం ఎలా?..
నిపుణుల సలహాలు..

667: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు
3,21,000: అందుబాటులోని సీట్లు
2,07,473: ఎంసెట్(ఇంజనీరింగ్)లో ఉత్తీర్ణులు

ఈ గణాంకాలు పరిశీలిస్తే ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ సీటు గ్యారంటీ అని స్పష్టమవడమే కాకుండా.. అర్హులందరికీ సీట్లు లభించిన తర్వాత కూడా లక్షకుపైగా సీట్లు ఖాళీగా ఉండే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది. కౌన్సెలింగ్‌కు హాజరైన ప్రతి విద్యార్థి అలాట్‌మెంట్ లెటర్ అందుకోవడమూ నిస్సందేహమే. అయితే సమస్యంతా మంచి కాలేజ్ ఏంటనేదే? ఏ కాలేజ్‌లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందనేదే? దీనికోసం దశలవారీగా పరిశీలించాల్సిన అంశాలు..

తొలి సాధనం.. గత ర్యాంకుల విశ్లేషణ:
‘మంచి కాలేజ్ ఏది?’ అని తెలుసుకునే క్రమంలో తొలి సాధనం గత ఏడాది చివరి ర్యాంకుల విశ్లేషణ. గత ఏడాది కౌన్సెలింగ్‌లో ఒక కళాశాలలో నిర్దిష్ట బ్రాంచ్‌లో చివరి సీటు భర్తీ అయిన ర్యాంకు; అదే విధంగా సదరు కళాశాలలో మొత్తం బ్రాంచ్‌లలో గరిష్టంగా ఏ ర్యాంకు వరకు అవకాశం లభించింది; అనే అంశాలను తెలుసుకునే అవకాశం ఉంది. తక్కువ ర్యాంకుతో సీట్లు భర్తీ అయిన కళాశాలలను మెరుగైనవిగా భావించొచ్చు.

విద్యార్థులకు ఇలాంటి సదుపాయం కల్పించడంకోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్ ‘ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ -2011’ డేటాను అందుబాటులో ఉంచింది. ఈ వివరాలు సాక్షి www.sakshieducation.comలో కూడా లభిస్తాయి. వీటిని పరిశీలిస్తే సీటు లభించే అవకాశం ఉన్న కళాశాలల విషయంలో ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది.

సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్లో మాక్ కౌన్సెలింగ్:
విద్యార్థులు సీటు లభించే అవకాశమున్న కళాశాలలను తెలుసుకునేందుకు www.sakshieducation.com.. 2011 సీట్ల ఎలాట్‌మెంట్ ఆధారంగా మాక్ కౌన్సెలింగ్‌కు రూపకల్పన చేసింది. ర్యాంకు, కేటగిరీ, రీజియన్, కోరుకుంటున్న బ్రాంచ్ వివరాలను ఎంటర్ చేస్తే సీటు లభించే అవకాశం గల కాలేజ్‌ల వివరాలు కనిపిస్తాయి.

సర్వేలు.. రేటింగ్స్:
ఇటీవల కాలంలో ప్రొఫెషనల్ కళాశాల(ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ తదితర)లకు సంబంధించి పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆయా కళాశాలల్లోని వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా రేటింగ్స్ ఇస్తున్నాయి. కాలేజ్ ఎంపిక విషయంలో ఈ సర్వేలు.. రేటింగ్స్ కూడా ఉపయుక్తంగా ఉంటాయి.

అయితే ఈ సందర్భంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా గుర్తించాల్సిన అంశం.. సదరు సర్వే సంస్థకు ఉన్న ప్రామాణికత, పేరు, ప్రఖ్యాతులు. ‘ప్రస్తుతం ఎడ్యుకేషన్ వ్యాపారమైన నేపథ్యంలో దాని ద్వారా లబ్ధి పొందేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కొందరికి ప్రయోజనం కలిగే విధంగా లోపభూయిష్టమైన సర్వేలు నిర్వహించి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.’ అని ఒక నిపుణుడు పేర్కొన్నారు.

వ్యక్తిగత పరిశీలన:
పలు మాధ్యమాల ద్వారా ప్రీవియస్ ర్యాంక్ అనాలిసిస్, సర్వేలు వంటి సాధనాల ద్వారా ప్రాథమిక అవగాహనకు వచ్చిన విద్యార్థులు ‘బెస్ట్ కాలేజ్?’ అనే విషయంలో వ్యక్తిగత పరిశీలన చేయడం ఎంతో లాభిస్తుంది. ప్రీవియస్ ర్యాంకు అనాలిసిస్ ద్వారా తమకు అవకాశమున్న కళాశాలలకు వెళ్లి వ్యక్తిగతంగా అక్కడి సదుపాయాలను పరిశీలించాలి.

ముఖ్యంగా లేబొరేటరీ, లైబ్రరీ, ఫ్యాకల్టీ సభ్యుల సంఖ్య ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో తెలుసుకోవాలి? వాస్తవానికి విద్యార్థులకు ఇన్ని వివరాలు అందించేందుకు కళాశాలలు అంత సుముఖంగా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ల ద్వారా సమాచారా న్ని సేకరించి కళాశాల పనితీరు తెలుసుకోవచ్చు.

ప్రకటనలతో అప్రమత్తం:
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ప్రతి మండలానికి ఒక కళాశాల ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కళాశాలల మధ్య పోటీ పెరిగింది. వ్యాపార దృక్పథం మొదలైంది. ఆయా కళాశాలలు ‘మేమంటే.. మేమే సాటి? అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయస్థితికి లోనవుతున్నారు. దీనికి పరిష్కార మార్గం కూడా వ్యక్తిగతంగా ఆయా కళాశాలలను పరిశీలించడమే.

ఫ్యాకల్టీ విషయంలోనూ:
ఆయా కళాశాలలు పేర్కొనే ఫ్యాకల్టీ సంఖ్య, అర్హతల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక శాతం కళాశాలలు సరైన ఫ్యాకల్టీ లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నాయి. పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఒకరిద్దరు మినహా.. చాలా వరకు బీటెక్ ఉత్తీర్ణులతోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. దీనికోసం ఏఐసీటీఈ కల్పించిన ఓ చిన్న సౌలభ్యాన్ని (పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులు లభించకపోతే బీటెక్ ఉత్తీర్ణులను కూడా నియమించుకోవచ్చు) యథేచ్ఛగా వినియోగించుకుంటున్నాయి. ఇది చివరకు విద్యార్థి అకడెమిక్ స్కిల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయం.

జేఎన్‌టీయూ-హైదరాబాద్ అకడెమిక్ ఆడిట్ సెల్ పరిధిలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గత ఏడాది చివర్లో నిర్వహించిన తనిఖీల్లో యూనివర్సిటీ పరిధిలోని పలు కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత స్పష్టంగా కనిపించడం; దానిపై నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లోని ఫ్యాకల్టీ లేమికి చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరనున్న విద్యార్థులు ఆయా కళాశాలలు పేర్కొన్న ఫ్యాకల్టీ వివరాలు సరైనవో?కావో? అని సీనియర్ల ద్వారా నిర్ధారించుకోవడం తప్పనిసరి.

అకడెమిక్ రికార్డ్:
బెస్ట్ కాలేజీలను గుర్తించే విషయంలో ఉపయోగపడే మరో అంశం ఆ కళాశాలలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఫలితాల శాతం. ఫలితాలు తక్కువగా ఉంటే ‘ఏదో లోపం ఉన్నట్లే?’. ఆ లోపం విద్యార్థుల్లో ఉందా? లేదా ఫ్యాకల్టీ కొరత కారణంగా ఉందా అనే విషయాలను కూడా పరిశీలించాలి. ఫ్యాకల్టీ కొరతే కారణమైతే సదరు కళాశాలను ఎంపికలో పునరాలోచించుకోవాలి.

ఇతర అంశాల్లో ఎలా?
ప్రస్తుత పోటీ ప్రపంచంలో.. ఆయా సంస్థలు, పరిశ్రమలు కేవలం అకడెమిక్ రికార్డ్‌కే కాకుండా సాఫ్ట్‌స్కిల్స్‌కు కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కళాశాలలో సాఫ్ట్‌స్కిల్స్ (కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్) శిక్షణ ఏ మేరకు ఉంది? అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. వీటికోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారా? లేదా? అని పరిశీలించడం మరింత ఉపయుక్తం.

పరిశోధనలు.. పరిశ్రమలతో ఒప్పందాలు:
భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఉద్యోగం అంటే పరిశోధనల సమ్మిళితం. అందులో విజయానికి అకడెమిక్ స్థాయిలోనే పునాది వేసుకోవాలి. వీటికి కళాశాలలే సరైన చిరునామాలు. అందుకే సదరు కళాశాలలో పరిశోధనలకు గల అవకాశాలు; ఆ క్రమంలో పరిశ్రమలతో అవి కుదుర్చుకున్న ఒప్పందాలు వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పరిశోధనలు బాగా ఉన్న కళాశాలల్లో భవిష్యత్తుకు చక్కటి మార్గం ఏర్పడుతుంది.

ఆ మూడూ ఉంటేనే:
ప్రతి కళాశాలకు ఏఐసీటీఈ గుర్తింపు; యూనివర్సిటీ అక్రెడిటేషన్; అఫ్లియేషన్.. ఈ మూడు గుర్తింపులుంటేనే షార్ట్‌లిస్ట్‌లో పొందుపర్చుకోవాలి. వీటితోపాటు బ్రాంచ్‌వారీగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్‌బీఏ) ఇచ్చే గ్రేడింగ్స్‌ను చూడాలి. దీని ఆధారంగా ఒక కళాశాలలో ఏ బ్రాంచ్ మంచిదో తెలుసుకునే వీలు ఏర్పడుతుంది.

సోషల్ నెట్‌వర్క్.. సో యూజ్‌ఫుల్:
వందల్లో కళాశాలలు; పదుల సంఖ్యలో పరిశీలనాంశాలు. ఈ నేపథ్యంలో ప్రతి కళాశాలకు వెళ్లడం సాధ్యం కాని విషయమే. ఈ పరిస్థితుల్లో ఉపయోగపడే సాధనాలు ‘సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్’. వీటి ద్వారా ఒక కళాశాలలో చదివే విద్యార్థులు, సీనియర్లతో పరిచయాలు ఏర్పరచుకుని వాస్తవ వివరాలు పొందొచ్చు.

ఇప్పుడు ప్రతి కళాశాలకు పూర్వ విద్యార్థుల సంఘాలు (అలూమ్నీ) ఉన్నాయి. వీటితోనూ సంప్రదించొచ్చు. ఇలా.. వెబ్‌కౌన్సెలింగ్‌కు ముందే పకడ్బందీగా అడుగులు వేస్తే తమకు వచ్చిన ర్యాంకు పరిధిలోనే అందుబాటులో ఉండే కళాశాలల్లోనే మంచి కళాశాలను ఎంచుకోవచ్చు.

...............
ఆ ప్రమాణాలకు మించి ఉంటే మంచిది
సాధారణంగా కళాశాల ఎంపిక విషయంలో ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు ఉన్నాయా? లేదా? అని మాత్రమే పరిశీలిస్తారు. అయితే అంతకుమించిన సదుపాయాలు, సౌకర్యాలు ఉన్న వాటిని ఎంచుకోవడం మంచిది. అంతేకాకుండా చాలామంది ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం, ఇతర కారణాల వల్ల.. ప్రమాణాలపరంగా కొంచెం అటూఇటూ ఉన్నా కూడా తమకు సమీపంలోని కళాశాలలపై మొగ్గు చూపుతారు.

కానీ భవిష్యత్తు బాగుండాలంటే దూరమైనా.. మంచి కళాశాల అనుకున్న దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి కళాశాల విషయంలో గత ఏడాది చివరి ర్యాంకుల విశ్లేషణ ద్వారా ప్రా థమిక అవగాహన పొందవచ్చు. ఎన్‌బీఏ అక్రెడిటేషన్ గురించి కచ్చితమైన పరిశీలన చేయాలి.
డా॥బి. చెన్నకేశవరావు, ప్రిన్సిపల్, సీబీఐటీ, హైదరాబాద్
................

ప్లేస్‌మెంట్స్ కీలకం
ఒక కళాశాలను ఎంపిక చేసుకునే క్రమంలో మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ రికార్డ్స్. ఆ రికార్డ్ మంచిగా ఉన్న కళాశాలను గుర్తించి దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ప్లేస్‌మెంట్ రికార్డ్ బాగుందనే కారణంతోనే చేరడం సరిపోదు. నాలుగేళ్ల తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న విద్యార్థి ఆ ప్లేస్‌మెంట్స్ పొందేందుకు మొదటి రోజు నుంచే కృషి చేయాలి. ఇప్పుడు ప్రతి కంపెనీ అకడెమిక్‌గా ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది.

ఈ నేపథ్యంలో డిస్టింక్షన్ సాధించేలా కృషి చేస్తే మరింత మంచి ప్లేస్‌మెంట్ లభిస్తుంది. బ్రాంచ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సలహా కాకుండా తమకు ఆసక్తి, సామర్థ్యం ఉన్న బ్రాంచ్‌లనే ఎంచుకుంటే సుస్థిర భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రతి బ్రాంచ్‌లోనూ ప్లేస్‌మెంట్స్ బాగున్నాయి. కాబట్టి స్వీయ ఆసక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

- డా॥ఎ.వినయ్‌బాబు,ప్రిన్సిపల్,
జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,
హైదరాబాద్
.....................

ప్లేస్‌మెంట్ రికార్డ్స్
ఇంటర్మీడియెట్ చదివినా.. ఇంజనీరింగ్‌లో చేరాలనుకున్నా.. ప్రతి ఒక్కరి లక్ష్యం ఉద్యోగ సాధనే. అందుకే కళాశాలను ఎంపిక చేసుకునేముందు ఆ కళాశాలలో గతంలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, అపాయింట్‌మెంట్స్ గణాంకాలను క్షుణ్నంగా పరిశీలించాలి. అంతేకాకుండా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించిన కంపెనీల పూర్వాపరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవి ఎంఎన్‌సీలైతే ఇక నో టెన్షన్.
................

ప్లేస్‌మెంట్స్.. డొమైన్.. నాన్-డొమైన్
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరిశీలన దశలో విద్యార్థులు గమనించాల్సిన అంశం ఆ రిక్రూట్‌మెంట్స్ డొమైన్ ఏరియాలోనే జరిగాయా (ఉదాహరణకు మెకానికల్ అభ్యర్థులకు కోర్ సెక్టార్‌లోనే అపాయింట్‌మెంట్)? నాన్ డొమైన్ ఏరియాలో జరిగాయా? అనేది. ప్రస్తుతం పేరెన్నికగల సంస్థలు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ (బీపీఓ, కాల్ సెంటర్) విభాగాలున్నాయి. వీటిలో ఉద్యోగాల భర్తీకి కూడా ఆ సంస్థలు ఇంజనీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి.

ఉద్యోగం తప్పనిసరైన కొందరు విద్యార్థులు తమ కోర్ ఏరియా కాకున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సైతం సిద్ధపడుతున్నారు. వీటిని కూడా ఆయా కళాశాలలు ప్లేస్‌మెంట్ రికార్డ్స్‌లో చూపుతూ ‘మా కళాశాలలో వంద శాతం ప్లేస్‌మెంట్స్’ అంటూ ప్రకటిస్తున్నాయి. ‘ప్రస్తుతం టైర్-2, 3 పట్టణాల్లోని చాలా కళాశాలల్లో ఇలాంటి రిక్రూట్‌మెంట్సే ఎక్కువ. కానీ ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థి తన కోర్ ఏరియాలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ మేరకు అకడెమిక్‌గా కృషి చేయాలి’ అనేది ఓ ప్రముఖ కళాశాల ప్రిన్సిపల్ సూచన.

No comments:

Post a Comment