Pages

Tuesday

“ గడియారంలో పరమాత్మ ”


పరమాత్మను కాలాతీతుడు అని, కాలుడు అని పిలుస్తుంటారు. కాలం లేదా సమయానికి అతీతుడు కాబట్టే అతన్ని కాలాతీతుడు అని అంటారు. అంటే కాలం పరమాత్మకు లోబడివున్నదే కానీ, అతడు కాలానికి లోబడిలేడు అని భావం. కాలాన్ని లోబరుచుకున్నవాడు అంటే సమయపరిపాలన చేసేవాడని. సమయపాలన చేసేవారందరూకూడా కాలాతీతులే, గొప్పవారే. యముడ్నికూడా కాలుడు అని అంటారు. ఎందుకంటే, సమయం ఆసన్నమైనప్పుడు, జీవుల్ని కాలగమనంలో కలిపివేస్తుంటాడు కాబట్టి.
కాలానికి అనాదినుంచి మన పెద్దలు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ప్రతి నిముషం అతి విలువైనది అని గుర్తుచేయటానికే, గడియారాన్ని ఆవిష్కరించారు. ముంజేతి గడియారాన్నీ ఆవిష్కరించారు. గడియారం ఎంతో ఆధ్యాత్మిక తత్త్వాన్ని తెలియజేస్తుంది. అదే విషయాన్ని మీతో చెప్పాలనుకున్నా. ఆలకించండి:
మన జీవితాన్ని గడియారంతో పోల్చుకుందాం. గడియారంలో గంటల్ని చూపించే ఒక చిన్నముల్లు, నిముషాల్ని చూపించే ఒక పెద్దముల్లు వుంటుంది. మొత్తం పన్నెండు అంకెలు, పన్నెండు గంటల్ని సూచిస్తాయి. చిన్నముల్లు రెండుసార్లు పన్నెండు దగ్గరకు వస్తే, ఒక పగలు, ఒక రాత్రి పూర్తిఅయినట్లే. గడియారం ఎప్పుడూ సవ్యదిశలోనే తిరుగుతూవుంటుంది. జీవితంకూడా సవ్యదిశలోనే ముందుకు సాగాల్సి వుంటుంది. అప్పుడే, జీవితంలోని విశేషాల్ని తెలుసుకొని, అనుభవించి, ఆఖరికి జీవిత గమ్యాన్ని చేరుకుంటాం. అలాకాక, అపసవ్యంగా జీవితం సాగితే, ఏమీ తెలుసుకోకుండానే, బయలుదేరిన చోటుకే వచ్చి ఆగిపోతాము. గడియారాన్నికూడా అపసవ్యంలో తిప్పితే, ఆగిపోతుంది కదా!!
పరమాత్మ, జీవాత్మ. గడియారంలో చిన్నముల్లుని పరమాత్మతో ; పెద్దముల్లుని జీవాత్మతో పోలుద్దాం. అన్ని జీవాత్మలకు మూలం పరమాత్మేనని; జీవాత్మ, పరమాత్మకంటే భిన్నం కాదనీ మన ఋషులు చెప్పారు. పెద్దముల్లు, పెద్ద,పెద్ద అంగలతో ముందుకు నడుస్తూ, చిన్నముల్లును ప్రతి గంటకూ ఒకసారి దాటివెళ్తూ, చిన్నముల్లు ఎప్పుడూ నాకు వెనకబడే వుంటుంది; వేగంలో నన్నందుకోలేదు అని అనుకుంటుంది. అయితే, ఒక గంట సమయాన్ని పూర్తి చేయటానికి, పెద్దముల్లు ఒకసారి పన్నెండు అంకెల్ని దాటితే, చిన్నముల్లు ఒకే ఒక అంకెను దాటితే సరిపోతుంది. అయితే, విషయాన్ని పెద్దముల్లు ఎప్పుడూ గ్రహించదు. అందుకు కారణం దానిలోని అహం అనే గుణం. ఇదే సరిగ్గా, మనిషి పట్లకూడా జరుగుతుంటుంది. జీవాత్మ అయిన తాను, తనలోని అహం వల్ల, లేదా అజ్ఞానం వల్ల, తన వల్లే సమస్త కార్యాలు చక్కబెట్టబడుతున్నవి అని అనుకుంటుంటాడు. తన మూలశక్తి పరమాత్మే అని తెలుసుకోలేడు.
గడియారంలోని అంకెలు పన్నెండు. గడియారంలోని ముల్లుల గమనాన్ని గమనిస్తే, పెద్దముల్లు, పన్నెండు అంకెనుంచి బయలుదేరి, మరల పన్నెండు అంకె దగ్గరకు చేరుకొనే కాలపయనంలో, ప్రతి గంటకూ ఒకసారి, చిన్నముల్లుని దాటుకువెళ్తూనే వుంటుంది. చిన్నముల్లుని దాటబోయే సమయంలో, చిన్నముల్లుతో, ఒక చోట, ఒక సమయంలో కలిసిపోయి వున్నట్లు కనిపిస్తుంది. అంటే, రెండు ముళ్ళు, ఒక ముల్లుగానే కనిపిస్తుంది. .కు:- గం. 1-05; 2-05; 3-17; 4-22 …. 8-44; 9-45; 10-55 నిముషాలకు రెండు ముళ్ళూ కలిసిపోయి, ఒకటిగా కనిపిస్తాయి. విధంగా, 11 సార్లు కనిపిస్తుంది. అయినప్పటికీ, పెద్దముల్లు, చిన్నముల్లుయొక్క presence ని చూసీచూడనట్లుగానే వుండి, ముందుకు వెళ్తూవుంటుంది. అదేవిధంగా, మనిషి ఆయుర్దాయం నూరు సంవత్సరాలు. నూరుని, గడియారంలోని పన్నెండు అంకెలతో భాగిస్తే, ఒక్కొక్క అంకెకు 8-33 సంవత్సరాలు షుమారుగా వస్తాయి. పన్నెండు అంకెలను పన్నెండు దశలు అని అనుకుందాం. అవి:– “ 0-8.33 సం.లు బాల్యం; 8-16 సం.లు యవ్వనం; 16-24 సం.లు కౌమారం; 24-33 సం.లు ఉత్తర-కౌమారం; 33-41 సం.లు పూర్వ-మధ్య కాలం; 41-50 సం.లు జీవిత మధ్యకాలం; 50-58 సం.లు ఉత్తర-మధ్యకాలం; 58-66 సం.లు పూర్వ-సంధ్యాకాలం;
66-75 సం.లు సంధ్యాకాలం ( సూర్యాస్తమయంలాగా, జీవన అస్తమయ కాలాని ముందు భాగమే సంధ్యాకాలం ); 75-83 సం.లు ఉత్తర-సంధ్యాకాలం; 83-91 సం.లు పూర్వ-సంపూర్ణకాలం; 91-100 సం.లు జీవిత ఆఖరి లేదా సంపూర్ణదశగా చెప్పుకోవచ్చు.
పైన చెప్పుకున్నట్లుగా, గడియారంలో పెద్దముల్లు 11 సార్లు చిన్నముల్లుతో కలిసినా, చిన్నముల్లుయొక్క presence; importance ని ఎట్లా గుర్తించదో, మనిషికూడా 11 దశల్లో పరమాత్మను తెలుసుకొనే అవకాశం కల్గినా, తనలోని అహం; అజ్ఞానం వల్ల, అతనిని తెలుసుకోలేక, ముందుకు సాగిపోతుంటాడు. మొదటిది బాల్యదశలో పరమాత్మగురించి అసలు అవగాహనే వుండదు; రెండవది యవ్వనదశలో చదువు, ఆట,పాటలతో గడిచిపోతుంది; మూడవది కౌమారదశలో ఉన్నత చదువులతో; నాల్గవదశ ఉత్తర-కౌమారంలో ఉద్యోగం, వివాహంతో; ఐదవదశ పూర్వ-మధ్యకాలంలో పిల్లల పెంపకం, సంపాదనతో; ఆరవదశ జీవిత మధ్యకాలంలో జీవితంలో స్థిరపడే ఆలోచనలు, పధకాలతో; ఏడవదశ ఉత్తర-మధ్యకాలంలో పిల్లల వివాహాలతో; ఎనిమిదవదశ పూర్వ-సంధ్యాకాలంలో మనవళ్ళు, మనుమరాళ్ళ మురిపాలతో; తొమ్మిదవదశ సంధ్యాకాలంలో దేశాటన, తీర్ధయాత్రలతో; పదవదశ ఉత్తర-సంధ్యాకాలంలో అనారోగ్యం, వయసు మీదబడి, శరీరం సహకరించకపోవటంతో పరమాత్మను గురించి తెలుసుకునే ప్రయత్నాలే చేయరు. 11; 12 దశల స్థాయికి చేరేవారే తక్కువ. అథవా, దశలకు చేరినా, వార్ధక్యంవల్ల మతిమరుపు, శరీర నిస్సహాయ స్థితిలో వుండి, పరమాత్మను గురించి తెలుసుకోవాలని కోరికవున్నా, సఫలీకృతం కాలేరు. 80 ఏళ్ళ వయసులో వున్న ఒక వృద్ధుడు, గణితం నేర్చుకొని, ఏదో సాధించాలని కలలుగంటుంటే, శ్రీ శంకరాచార్యులవారు, అతనిని చూసి, “ భజగోవిందం, భజగోవిందం, గోవిందం భజ మూఢమతే… అంటూ పాడారట. దీని పరమార్ధం, పరమాత్మను గురించి తెలుసుకోవలసిన సమయంలో తెలుసుకోలేకపోయావు, ఆఖరి క్షణాల్లోకూడా ఇంకా మూఢమతిగా వుండొద్దు అని బోధించటమే!
ఉపసంహారం:– మనకున్న 24 గంటల్లో, పది గంటలు నిద్రావస్థలోనే గడుపుతాం. ఇక మిగిలింది 14 గంటలు. అందులో తొమ్మిది గంటలు ఉద్యోగానికి; రెండు గంటలు భోజన సమయానికి పోతే, ఆఖరికి మిగిలింది కేవలం మూడు గంటలే!! ‘మూడునాళ్ళ ముచ్చటేరా జీవితం అనుకుంటూ వాపోకుండా, కనీసం, మూడు గంటల సమయాన్ని అయినా సద్వినియోగపరుచుకొని, పరమాత్మ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. “ కౌసల్యా… సుప్రజా… రామా…అంటూ మనం సుప్రభాత ప్రార్ధన చేస్తూ, పరమాత్మని మేల్కొలపటానికి ప్రయత్నిస్తుంటాం. ప్రార్ధనలోని తత్త్వరహస్యం ఏమిటంటే, పరమాత్ముడు నిజంగా నిదురపోతుంటాడని కాదు; కరిగిపోయే జీవిత కాలంలో తానెవరో తెలుసుకోవటానికోసం, తనను మేలుకొల్పి, తానెవరో, తన అసలు స్వరూపమేదో విడమర్చి చెప్పమని వేడుకుంటూ చేసే ప్రార్ధనే సుప్రభాతం. చిన్నతనం నుంచే పెద్దలు, పిల్లలకు దీన్ని నేర్పిస్తే, జీవితకాలంలో, గడియారంలోని పన్నెండు అంకెలులాగా, ప్రతి దశలోనూ, మనల్ని మనం తెలుసుకోవటానికి కావలసినంత సమయం మన చేతిలోనే వుంటుంది. అంటే, మనం కాలాతీతులమనే కదా అర్ధం!! మన మనస్సులో ఎప్పుడైతే సుప్రభాతం అవుతుందో, అదే మన జీవితకాలాన్ని ప్రభావితం చేస్తుంది. గడియారం పన్నెండు గంటలు కొట్టింది; పెద్దముల్లు, చిన్నముల్లు రెండూ కలిసి, ఒకటిగానే కనిపిస్తున్నాయి. జీవాత్మ, పరమాత్మ కలిసిపోయి, ఒకటిగానే గోచరిస్తున్నారు

From
మీతో చెప్పాలనుకున్నా!!!


No comments:

Post a Comment