బ్రహ్మ, తనకు లభించిన శక్తితితో, తెలివితేటలతో, ఎన్నోరకాల జీవులను సృష్టించాడు. ఆ జీవులన్నిట్లిల్లోకల్లా తెలివిగల జీవి మానవుడు. బ్రహ్మకు నాలుగు మొహాలుంటాయి. అంటే నాలుగు మొదడ్లు, లేదా నాలుగు మనసులున్నాయని అనుకోకూడదు. సృష్టి చేసేటప్పుడు ఏ పనినైనా నాలుగు రకాలుగా ఆలోచించి, ఉత్తమంగా చేయాలనేది అందులోని తత్త్వం. సరే, ఈ విషయం ఇక్కడ ఆపి, కంప్యూటర్ గురించి కొంచెంసేపు చర్చిద్దాం.
మనిషి, వేలాది సంవత్సరాలలో ఎంతో పరిణితిచెంది, తన మేధస్సుతో, తన సుఖమయ జీవితానికి కావలిసిన ఎన్నో విషయాలను/వస్తువులను ఆవిష్కరించాడు. అందులో ఒకటి “కంప్యూటర్”. దీని గురించి ఈ కాలంలో అందరికీ బాగానే తెలుసు. మనిషి మేధస్సుకు కంప్యూటర్ ఒక “ప్రతీక” లాంటిది. అతను చేయగలిగిన, చేయలేని పనులనుకూడా సునాయసంగా చేయగలదీ కంప్యూటర్. ఉదాకు:- భారతదేశంలో వున్న ఒక వ్యక్తి, ఒక సమాచారాన్ని, అమెరికాలోవున్న ఒక వ్యక్తికి పంపించాలి. అతను విమానంలో అమెరికా వెళ్ళి సమాచారాన్ని ఇచ్చిరావచ్చు. కానీ, దానికి దాదాపు ఒక రోజు పడుతుంది. అదే కంప్యూటర్ ద్వారా అయితే, కొన్ని క్షణాలలో, సమాచార మార్పిడిలో ఎటువంటి లోపాలులేకుండా, అవతలి వ్యక్తికి సమాచారాన్ని అందచేయవచ్చు.
ఇదంతా అందరికీ తెలిసిందే కదా? మళ్ళీ ఈయన చెప్పేదేముందీ అని అనుకుంటున్నారా? కానీ, కొంచెం ఓపిక పట్టి ముందుకు చదవండి:
ఈ కంప్యూటర్ లో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి: ప్రధానమైనది – సీ.పీ.యు., మానిటర్; కీ-బోర్డ్. మొత్తం కంప్యూటర్‍కి మొదడు లాంటిది “సీ.పీ.యు”. ఇందులోకి ఎక్కించిన “సాఫ్ట్‍వేర్” ద్వారా, మనిషి చెప్పిన పనులన్నిటినీ చిటికలో చేస్తుంది ఇది. ఈ సాఫ్ట్‍వేర్, మనిషిలోని మనస్సులాగా, కంటికి కనిపించదు; కానీ, అదిచేసే పనులు, మనిషి ముఖంలో కనిపించే ముఖకవళికల్లాగా, మానిటర్ మీద కనిపిస్తాయి. అంతేకాదండోయ్, దీనికి “అంటువ్యాధులు (వైరస్) కూడా వస్తుంటాయి. అయితే ఏమి? మనిషి, వాటిని నియంత్రించి, అదుపులోకి తీసుకువచ్చి, ఆ తరువాత వాటిని సమూలంగా నిర్మూలనచేసి, కంప్యూటర్‍ని కాపాడుకుంటూ, అది యధావిధిగా తనుచెప్పిన కార్యకలాపాలను చేసేటట్లుగా చూసుకుంటాడు. ఎంత జాగ్రత్తో చూసారా? మరి అది తన సృష్టి కదా!!
సరే, కంప్యూటర్ సంగతి కొంతసేపు ప్రక్కనపెట్టి, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంతకుముందే చెప్పుకున్నాం, జీవులన్నిటిలోకన్నా, మనిషి అత్యంత పరిణితిచెందిన జీవి అని. కంప్యూటర్‍లోలాగే ఇతనిలోకూడా ముఖ్యంగా మూడు భాగాలున్నాయి: తల, మొండెము, కాళ్ళు,చేతులు. భౌతిక శరీరాన్ని “హార్డ్వేర్”తో పోలుద్దాం. మెదడులోని మనస్సు ( మనస్సు, బుద్ధి, చిత్తం – ఈ మూడింటినీ కలిపి ఒక్క మాటలో మనస్సు అని చెప్పవచ్చు ) సాఫ్ట్‍వేరు లాంటిది. ఈ మనస్సుకూడా కంటికి కనిపించనదే. ” బ్రహ్మ మనిషిలో కొంత ప్రాధమిక సాఫ్ట్‍వేర్‍ని నిక్షిప్తం చేసి పంపితే, మనిషి, తను వృద్ధిచేసుకున్న మేధస్సుతో, ఎంతో అభివృద్ధి పరిచిన సాఫ్ట్‍వేర్‍ని (advanced software) ఎప్పటికప్పుడు తన మనస్సులోకి ఎక్కించుకుంటూవున్నాడు. దీని సహాయంతో, ఎన్నో శాస్త్ర, విజ్ఞాన విషయాలను ఆవిష్కరిస్తూ పురోగమనం చెందుతూవున్నాడు. తన జీవితాన్ని భౌతిక సంపదల ప్రపంచంలో నడిపిస్తూ, సుఖాల్ని అనుభవిస్తున్నాడు. ఇందులో తప్పేమీ లేదు. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే, ఈ సుఖాలు, తనకంటే బలహీనుడైన వ్యక్తియొక్క జీవిత విలువలను ఫణంగా పెట్టి; తన స్వార్ధ సుఖంకోసం ఇతరుల సుఖాల్ని కాలరాచి గానీ అనుభవించటానికి వెనుకాడటలేదు. ఈ రెండు విషయాలవల్లే, ప్రపంచం మొత్తం ( మానవులతో పాటు వృక్షజాతి, జంతుజాతి, ప్రకృతి కూడా ) విషతుల్యమవుతున్నది.
ఉదాకి:- మనిషి అణు విజ్ఞానాన్ని ఆవిష్కరించాడు. దాని సహాయంతో అణువిద్యుత్తును రూపొందించాడు; జాతికి మేలు జరిగింది. కానీ, అదే విజ్ఞాన సహాయంతో అణుబాంబులను తయారుచేసి, స్వార్ధంతో, ఇతర దేశాలమీద ఆధిపత్యానికోసం, ఆ బాంబులను మనుషులపై ప్రయోగించి, మానవజాతి మారణహోమం చేసి, చెయ్యకూడని తప్పు చేసాడు. ఇప్పటికీ, అదే త్రోవలో పయనిస్తూనేవున్నాడు. కాదంటారా? అణ్వస్త్ర నిరాయుధీకరణ అంటూనే, చిన్న దేశాలకు మొట్టికాయలు వేస్తూ, చాపక్రింద నీరులాగా, పెద్ద దేశాలవారు బలపడుతూనేవున్నారు. తమ మాట వినని వారిపై ఆర్ధిక ఆంక్షలు ప్రయోగించి లొంగదీసుకుంటున్నారు. ఈ ఒక్క విషయం చాలు, మానవుని బుద్ధి ఎటువైపు పయనిస్తున్నదో తెలుసుకోవటానికి. ఇప్పుడు చెప్పండి, మానవుడు భౌతికంగా అభివృద్ధి చెందాడా? మానసికంగా/నైతికంగా అభివృద్ధిచెందాడా?
పైన పేర్కొన్న ఉదాహరణ ద్వారా మనిషిలో “నైతిక విలువలు” రోజురోజుకీ అణగారిపోతున్నాయి అని తెలుస్తూనే వున్నది. ఇది పెద్ద,పెద్ద దేశాధినేతల స్థాయిలోనే జరుగుతుందికానీ, చిన్నవాళ్ళ స్థాయిలో జరుగదు అని ఎవరైనా వాదించవచ్చు. కానీ, మీరే, మీ చుట్టుప్రక్కల జరుగుతున్న విషయాలను నిశితంగా పరిశీలించండి. మరొక చిన్న ఉదాహరణ తీసుకుందాం:- మన దేశంలోనే ఒక మంత్రిగారు వున్నారు. వారికి ఎంతోమంది అనుచరులు ప్రాంతాలవారీగా వుంటారు. ఒక అనుచరుడు, లేదా, ఒక చిన్న గల్లీ-లీడర్ అని అందాం, శ్రామికవాడలో వున్న వారికి “తెల్ల రేషను కార్ద్” కావాలంటే, ప్రతి ఒక్కరిదగ్గర కొంత సొమ్ముని తీసుకొని, ఆ కార్డులను ప్రభుత్వంనుంచి వాళ్ళకు ఇప్పిస్తాడు. ప్రతిస్థాయిలో ఇటువంటి వాటిని ఎన్నిటినో ఉదహరించవచ్చు.
ఇక్కడ, ఇప్పుడు, పైన చెప్పిన విషయాల్ని ఒక్కసారి సింహావలోకనం చేద్దాం:- బ్రహ్మ సృష్టించిన జీవుల్లో మనిషి చాలా తెలివిగలవాడు; బ్రహ్మ, ఆదిలో, మనిషిలో కొంత ప్రాధమిక సాఫ్ట్‍వేర్‍ని నిక్షిప్తంచేసాడు; మనిషి తన తెలివితేటల్ని వృద్ధిచేసుకొని, తనలోని సాఫ్ట్‍వేరుని ఇంకా అభివృద్ధి చేసుకున్నాడు; ఎన్నో గొప్ప గొప్ప విషయ,వస్తువులను ఆవిష్కరించాడు, అనుభవిస్తున్నాడు; కానీ అవి అన్నీ స్వార్ధంతో మానవజాతి మనుగడకు హాని చేసేవిగా తయారుఅవుతున్నాయి; మానవ నైతిక విలువలు అణగారిపోతున్నాయి అని చెప్పుకున్నాం.
కంప్యూటర్‍లో ” CONTROL, SHIFT, ALT (alternative), ESCAPE, DELETE, and INSERT అనే ఆరు ముఖ్యమైన కీస్ (KEYS) వున్నాయి. వీటి వినియోగం అందరికీ తెలిసిందే. తన మేధస్సుతో కంప్యూటర్‍ని సృష్టించిన మనిషి, కంప్యూటర్‍లో తీవ్రమైన లోపాలు వచ్చినప్పుడు, వాటిని సరిచేసి, కంప్యూటర్ సిస్టమ్‍ని సిస్టమేటిక్ చేస్తాడు. అదే మనిషి, తనలో వస్తున్న లోపాలను, తనకు తెలిసికూడా, సరిచేసుకోవటంలేదు. ప్రయత్నిస్తే, CONTROL
KEY ద్వారా తనలోని లోపాలను నియంత్రించి; SHIFT KEY ద్వారా తను వున్న అనైతిక స్థితినుంచి షిఫ్ట్‍అయి; ALT KEY ద్వారా ఉన్నత స్థితిని ఎంచుకొని; ESCAPE KEY ద్వారా అనైతిక, అనారోగ్యమైన వాతావరణ పరిస్థితులనుండి తప్పుకొని; DELETE KEY ద్వారా తనలోని మితిమించిన స్వార్ధాన్ని, చెడును, అమానవీయతను పూర్తిగా తొలగించి; INSERT KEY ద్వారా తనలో మానవత్త్వాన్ని, మంచిని పొందుపరుచుకొని, స్వయంగా, తానే ఒక బ్రహ్మగా, తన జీవిత గమనాన్ని ఒక క్రాంతిపథంలోకి నడిపించకోవచ్చు.
సర్వేజనా సుఖినోభవంత్.From
మీతో చెప్పాలనుకున్నా!!!
No comments:
Post a Comment