Pages

Thursday

మంగళసూత్రం వెనుక ఉన్న శాస్త్రీయత


భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం రెండు కుటుంబాలు, రెండు దేహాల కలయిక కానే కాదు, అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన శక్తి సంబంధిత అనుకూలత ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పుడే వివాహాన్ని నిశ్చయించే వారు. చాలా సార్లు అసలు వివాహం చేసుకోబోతున్న ఇరువురు ఒకరినొకరు పెళ్లి రోజు దాకా చూసుకునే సందర్భం కూడా ఉండేది కాదు. అయినా అది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే వారి మధ్య సయోధ్యను కుదిర్చిన వారు, ఆ జంట కంటే ఆ విషయం బాగా తెలిసిన వారు. వధూవరుల వివాహ సమయానికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసేవారు.

పవిత్రమైన సూత్రం
'మంగళసూత్రం' అనగా 'పవిత్రమైన సూత్రం' (దారం). ఈ పవిత్రమైన సూత్రాన్ని తయారు చేయటం విస్తృతమైన శాస్త్రం. కొన్ని వడికిన నూలు దారాలను తీసుకొని, పసుపు కుంకుమలు రాసి ఒక పద్ధతిలో శక్తిమంతం చేస్తారు. ఒకసారి ముడి వేస్తే ఈ జీవితానికే కాక ఆపైన కూడా నిలిచి ఉండేలా మంగళ సూత్రం తయారు చేసే వారు. ఆ ఇద్దరిని కలిపి ముడి వేసేందుకు వారు నియోగించిన విధానాలు కేవలం భౌతిక, మానసిక స్థాయిలోనే కాక వారి నాడులు కూడా కలిపి ముడి వేయటం వల్ల, అదే జంట అనేక జీవితాల పర్యంతం అలా కలిసి ఉంటుంది.

భౌతికమైన, మానసిక, భావావేశ స్థాయిల్లో చేసేది ఏదైనా మరణంతో పూర్తి అయి పోతుంది. కానీ శక్తి స్థాయిలో చేసేది శాశ్వతంగా మిగులుతుంది. ఎంతో గాఢంగా, మన అవగాహనకు అందని విధంగా ఎలా ముడి వేయాలో తెలిసిన వారిచే ముడి వేయటం వల్ల ఆ బంధం గురించి పునరాలోచన చేసే ప్రశ్నే లేదు. ఇదే క్రతువు ఈనాడూ జరుగుతున్నా ఏమీ తెలియని వారిచేత జరుపుతున్నారు. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోవటం వల్ల అది నిరర్ధకం. ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడేటపుడు, వారు కేవలం భావోద్వేగపరంగానే మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు నేడొకటి చెపితే రేపొకటి చెప్తాయి. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండక్కరల్లేని పరిస్థితి వచ్చింది.

భర్తకే అంకితం
రాజస్థాన్ దేశంలో ఒకప్పుడు విక్రమాదిత్యుడనే రాజు ఉండేవాడు. అతనికి పడుచుదనంలో ఉన్న సౌందర్యవతి అయిన, అంకితభావంతో ఉండే భార్య ఉండేది. కానీ ఆ రాజుకు అనేకమంది వేశ్యలు ఉండేవారు. రాజు తననే ఆరాధించే భార్యను పిచ్చిదాని లాగా చూసేవాడు. తన కోసమే అంకితమైన ఆమెను చూస్తే ఆయనకు వినోదంగా అనిపించేది. ఒకోసారి మరీ ఎక్కువ అనిపించినపుడు ఆమెను విదిలించేసే వాడు. కాని ఆ స్త్రీమూర్తి మాత్రం తన భర్తకే అంకితమై ఉండేది.

మైనా మరణంతో...
ఆ దంపతులకు రెండు మైనా పక్షులు ఉండేవి. ఒక రోజు అందులో ఒక మైనా హఠాత్తుగా మరణించింది. రెండవది ఏమీ తినకుండా కూర్చుంది. రెండురోజుల్లో ఆ మైనా పిట్ట కూడా మరణించింది. ఈ విషయం రాజుగారిని బాగా కదిలించింది. రాజు గారు తన భార్యతో ఈ విషయం ప్రస్తావించినపుడు, ' ఎవరైనా మరొకర్ని నిజంగా ప్రేమిస్తే, వారిని కోల్పోయినప్పుడు, వారితో బాటే తనూ వెళ్లిపోవడం సహజమే కదా, ఎందుకంటే ప్రేమించిన వారు లేని జీవనం రెండో వారికి అర్థరహితం అనిపిస్తుంది' అని ఆమె అన్నది. రాజుగారు హాస్య ధోరణిలో, 'నీవు కూడా ఇంతేనా ? నీవు నన్నింతగా ప్రేమిస్తున్నావా?' అని అడిగారు. రాణి 'అవును, నేనూ అంతే' అని సమాధానం ఇచ్చింది. రాజుగారికిది హాస్యాస్పదంగా తోచింది.

ప్రాణాలర్పించిన భార్య
ఒక రోజు, స్నేహితులతో రాజు గారు వేటకు వెళ్లారు. ఆ పక్షి మరణం ఆ తర్వాత తన భార్య సమాధానం ఇవన్నీ రాజు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆ విషయాన్ని ఆయన పరీక్షించాలనుకున్నారు. అందుకని తన దుస్తులు విప్పి రక్తంతో తడిపి రాజమందిరానికి పంపారు. 'రాజుగారు పులివాత పడి మరణించారు' అని చాటింపు వేయించారు. రాణిగారు అతని దుస్తులను చాలా సంయమనంతో కంట ఒక్క నీటిచుక్క కూడా లేకుండా స్వీకరించారు. ఆమె వెంటనే చితిని పేర్పించి అందులో ఆ బట్టలు వేసి, తనూ ఆ చితిపై పడుకొని ప్రాణాలర్పించారు. తిరిగి వచ్చిన రాజు గారు ఈ వార్త విని కంగు తిన్నారు. హృదయం బద్ధలైంది. ఏదో సరదాకు హాస్యమాడితే, ఆమె నిజంగానే మరణించింది. అదీ ఆత్మహత్య చేసుకొని కాదు...అలవోకగా ప్రాణాలు విడిచింది.

పెనవేసిన బంధం
భారతదేశంలో ఎందరో దంపతులు ఒకరు మరణించిన కొద్ది కాలానికే మరొకరు ఆరోగ్యంగా ఉన్న వారైనా కొద్ది నెలల వ్యవధిలో మరణిస్తారు. ఇది కేవలం వారి ప్రాణశక్తులు ముడివడి ఉన్నవి కనుకనే. మీరు ఇలాంటి అనుబంధంలో మరొక వ్యక్తితో కలిసి ఉంటే ఇద్దరూ ఒకే ప్రాణమై జీవిస్తారు. అది అద్భుతమైన సహజీవనం.

No comments:

Post a Comment