Pages

Monday

తుషార(వ)ం...

ఆకాశం నుండి దూకుతున్నట్లుండే ఈ జలపాతం తమిళనాడులో ఉంది. చూపరులకు కళ్లు చెదిరినట్లనిపించడం దీని ప్రత్యేకత. ఆకాశమంతా అలుముకున్న పొగమంచులో నుండి భూమి మీదకు దూకుతున్నట్లుండే ఈ వాటర్‌ఫాల్ హోగెనక్కల్. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే ఈ ప్రదేశం సహజత్వానికి చేరువగా ఉంది. పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయమే అయినా, సౌకర్యాలకు చాలా దూరం.

బెంగుళూరు నుండి ఉదయం బయలు దేరి రాత్రికి తిరిగి బెంగుళూరు చేరితే ట్రిప్ థ్రిల్‌గా ఉంటుంది. బెంగుళూరులో బయలు దేరినప్పటి నుండి ఎంజాయ్‌మెంట్ మొదలైనట్లే. సిటీ దాటి గ్రామీణ ప్రాంతంలోకి దారి తీసినప్పటి నుండి ప్రకృతి సిద్ధమైన సహజ అందాలు ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి. రోడ్డుకు రెండు వైపులా పచ్చటి మల్బరీ తోటలుంటాయి. ఇక్కడ పట్టుపురుగుల పెంపకం కేంద్రాలు ఎక్కువ. వెడల్పాటి ఆకులను సన్నగా కత్తిరించి పురుగులకు ఆహారంగా వేస్తుంటారు. హోగెనక్కల్‌కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్లాలి. దాదాపుగా దగ్గరకు వెళ్లే వరకు ఆనవాలు కూడా కనిపించదు.

ఝుమ్మనే రవం
జలపాతానికి కిలో మీటరు దూరం నుండి ఝుమ్మనే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎత్తు నుండి జాలువారుతున్న నీటి సందడే. ముందుకెళ్లే కొద్దీ శబ్దం ఎక్కువవుతుంది. అప్పుడే మన మనోఫలకం మీద ఒక రూపం లీలగా రూపుదిద్దుకుంటుంది. తీరా దగ్గరకు వెళ్తే ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. మనమేదో భ్రాంతిలో ఉన్నామా? శబ్దం తాలూకు ట్రాన్స్‌లో ఒక రూపాన్ని ఊహించుకుంటున్నామా? నిజంగా జలపాతాన్ని చూస్తున్నామా? అని గిల్లుకుని చూడాల్సిందే.

ఎందుకంటే అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, లెక్కపెట్టలేనన్ని వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతున్నాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్‌ఫాల్స్ నీరు కావేరీ డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్లు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్దం అని.

ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒకే కొండ మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. జలపాతం హోరు చూసి పర్యాటకులు కొండ దగ్గరకు వెళ్లడానికే భయపడతారు. స్థానికులు ముఖ్యంగా పదిహేనేళ్ల పిల్లలు కొండ అంచుల వరకు ఎక్కి ప్రవాహంలోకి దూకుతారు. ఇలా అడ్వెంచర్ చేస్తూ పర్యాటకులను డబ్బులు అడుగుతుంటారు. ప్రాణాలకు తెగించే సాహసం వద్దన్నా వినకుండా పరుగెడుతుంటారు.

ఆరోగ్యస్నానం
హోగెనక్కల్‌కు ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం ఉంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్‌కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు. ఇక్కడి వాళ్లకు ఇది కుటీర పరిశ్రమ. హోగెనక్కల్ ట్రిప్‌లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది.

నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఆ రుచి మరెక్కడి చేపకూ రాదు. అరుదైన ప్రకృతి సోయగాలు సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంత సేపున్నా ఇంకా ఉండాలనిపిస్తుంది. కానీ రాత్రయితే దారి మర్చిపోతామేమోనన్న భయమే మనల్ని తిరిగి బయలు దేరదీస్తుంది. వర్షకాలంలో ప్రయాణం అసౌకర్యంగా ఉంటుందన్న కారణం మినహా, ఏడాదిలో ఎప్పుడైనా ఇక్కడ పర్యటించవచ్చు.

ఎక్కడుంది?
ఇది భౌగోళికంగా తమిళనాడులో ఉంది కానీ, బెంగుళూరు నుండి వెళ్లడం సులభం. సేలం నుండి
114కి.మీ. బెంగుళూరుకు
133 కి.మీ. నిజానికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది.

No comments:

Post a Comment