Pages

Friday

రాజా లైసెన్సులు రద్దు స్పెక్ట్రమ్ బహిరంగ వేలానికి ఆదేశం కార్పొరేట్, రాజకీయ రంగాల్లో సంచలనం రాజాపై ధర్మాసనం నిప్పులు టెలికం, ట్రాయ్‌లకు అక్షింతలు యూపీఏకు పాలించే హక్కులేదు ప్రధాని, చిదంబరం దిగిపోవాలి బీజేపీ డిమాండ్ తప్పంతా రాజా, ఎన్డీఏలదే: సిబల్ కంగుతిన్న కాంగ్రెస్.. అంతర్మథనం


ఒక్క దెబ్బ... ఒకే ఒక్క దెబ్బ! సుప్రీం కోర్టు సూటిగా... సుత్తితో కొట్టిన దెబ్బ! అటు రాజకీయ రంగాన్ని... ఇటు కార్పొరేట్ సెక్టార్‌ను కుదిపి, కుదేలు చేసిన 'సుప్రీం' దెబ్బ! ఈ దెబ్బతో అక్రమార్కుల కళ్లు బైర్లు కమ్మాయి. టెలికం శాఖను ఇష్టారాజ్యంగా పాలించిన రాజా 'అక్రమార్క' జారీ చేసిన 122 లైసెన్సులు రద్దయిపోయాయి. 2జీ స్పెక్ట్రమ్ అనే అక్రమాల చరిత్రకు సర్వోన్నత న్యాయస్థానం చరమగీతం పలికింది. అరుదైన, అత్యంత విలువైన జాతి సంపదను ప్రైవేటుకు కానుకగా కట్టబెట్టారంటూ తప్పుపట్టింది. 

3జీ తరహాలోనే 2జీ స్పెక్ట్రమ్‌ను కూడా బహిరంగ వేలం వేయాల్సిందేనని తీర్పు చెప్పింది. 'స్పెక్ట్రమ్‌ను మాత్రమే కాదు! ఇలాంటి జాతి వనరులను, సహజ సంపదను వేలం ద్వారా మాత్రమే కేటాయించాలి' అని భవిష్యత్ నిర్దేశం కూడా చేసింది. నాటి టెలికం మంత్రి రాజాతోపాటు మంత్రివర్గ సిఫారసులను, ప్రధాని సూచనలను విస్మరించిన ట్రాయ్, టెలికం విభాగాలను సైతం ఉతికి ఆరేసింది. జస్టిస్ సింఘ్వీ, జస్టిస్ ఏకే గంగూలీతో కూడిన సుప్రీం ధర్మాసనం గురువారం ఈ సంచలనాత్మక తీర్పు చెప్పింది. 

గురువారమే పదవీ విరమణ చేసిన జస్టిస్ గంగూలీ... చరిత్రాత్మకమైన తీర్పుతో తన కెరీర్‌ను ముగించారు. కారాగారవాస 'వార్షికోత్సవం' జరుపుకొంటున్న రోజునే రాజా గూబ గుయ్య్‌మంది. 2జీ స్పెక్ట్రమ్‌లో తప్పు జరిగిన విధానమిదీ... అంటూ సుప్రీం కోర్టు ఒక్కో అంశాన్ని సవివరంగా ప్రస్తావించింది. సునిశిత వ్యాఖ్యలు చేసింది. 'తప్పుడు మార్గం'లో లైసెన్సులు సొంతం చేసుకున్న టెలికం కంపెనీలపైనా కోర్టు భారీ జరిమానా విధించింది. సుప్రీం దెబ్బ ఆ టెలికం కంపెనీలకు చావుదెబ్బలా మారింది. స్టాక్ మార్కెట్‌లో యూనిటెక్ ధర భారీగా పతనమైంది. డీబీ రియల్టీ, వీడియోకాన్ షేర్ల ధరలూ పడిపోయినప్పటికీ... తర్వాత పూర్వస్థాయికి చేరుకున్నాయి. 

ఆయా కంపెనీలకు వేల కోట్ల రుణాలు, గారెంటీలు ఇచ్చిన బ్యాంకులకూ సుప్రీం తీర్పు శరాఘాతంలా మారింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ తదితర బ్యాంకులు 2జీ లైసెన్సులు పొందిన కంపెనీలకు అప్పులు ఇచ్చాయి. అయితే... మొత్తంగా సుప్రీం తీర్పు ఇల్లు చక్కదిద్దేలాగానే ఉందని కార్పొరేట్ వర్గాలు పేర్కొడం గమనార్హం. బ్యాంకులు, టెలికం కంపెనీలపై సుప్రీం తీర్పు చూపే ప్రభావంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. "తీర్పు వచ్చింది. దాని పరిణామాలను, ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంది'' అని ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. 

మరోవైపు... 2జీ లైసెన్సుల రద్దుతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారికి నిరంతరాయంగా సేవలు అందుతాయని 'ట్రాయ్' తెలిపింది. ఈ తీర్పు కేవలం 5 శాతం మందిపై మాత్రమే ప్రభావం చూపుతుందని, వారు నంబర్ పోర్టబులిటీ సేవను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. 2జీ లైసెన్సులు నాలుగు నెలలు మాత్రమే అమలులో ఉంటాయని, ఆ తర్వాత రద్దవుతాయని సుప్రీం తీర్పు చెప్పడంతో వినియోగదారులకు కొంత వెసులుబాటు లభించింది. 

రాజాపై సుప్రీం కొరడా విపక్షాల చేతికి ప్రధానాస్త్రంగా లభించింది. అయితే... 2జీ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న రాజానే కాంగ్రెస్ బలి పశువును చేస్తోంది. చిదంబరాన్ని వెనకేసుకొచ్చింది. ఎన్డీయేపైనా ఎదురు దాడికి దిగింది. తన తీర్పులో రాజాను దునుమాడిన సుప్రీం కోర్టు... ప్రధానమంత్రి మన్మోహన్, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరాన్ని తప్పు పట్టకపోవడం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చింది. పైగా... స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలన్న ప్రధాని సూచనను రాజా పట్టించుకోలేదని, ఆర్థిక శాఖ అభ్యంతరాలనూ పట్టించుకోలేద ని చెప్పడమంటే... పరోక్షంగా వారికి 'క్లీన్‌చిట్' ఇవ్వడమే అని కాంగ్రెస్ భావిస్తోంది. 

గిఫ్టుగా ఇచ్చేశారు
* విలువైన జాతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు కానుకగా ఇచ్చారు. కారుచౌకగా కట్టబెట్టారు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమనే వాదన చెల్లదు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగితే జోక్యం చేసుకోకుండా ఊరుకోలేం.
* రాజా జారీ చేసిన స్పెక్ట్రమ్ లైసెన్సులు ఏకపక్షం, నిర్హేతుకం, చట్ట విరుద్ధం. అవి చెల్లవు! వాటి జీవిత కాలం మరో 4 నెలలు మాత్రమే. ఆ తర్వాత వాటిని రద్దు చేయాలి.
* 'తొలుత వచ్చిన వారికే తొలి ప్రాధాన్యం' పేరిట జరిగిందంతా ముందస్తు పథకం ప్రకారం ఆడిన నాటకం! కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు చేసేందుకే ఇదంతా!
* 2జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేసి ఉంటే.. జాతి సంపదకు వేల కోట్లు జమ అయ్యేవి.
* వేలం ద్వారా మాత్రమే పారదర్శకత సాధ్యం. 3జీ తరహాలో 2జీని కూడా వేలం వేయాల్సిందే. స్పెక్ట్రమ్‌ను మాత్రమే కాదు... ఇలాంటి జాతి సంపదను, అరుదైన వనరులను వేలం ద్వారా మాత్రమే కేటాయించాలి.
* 2జీ లైసెన్సుల కేటాయింపులో అవకతవకలను విజ్ఞులైన పౌరులు బయటపెట్టకపోయి ఉంటే... ఈ అరుదైన జాతి సంపద అర్థ బలంతో వ్యవస్థలను ప్రభావితం చేయగలిగే కొందరి చేతికి చిక్కేది. సైన్యం కోసం కేటాయించిన ఈ వనరు స్వార్థ శక్తులకు దక్కేది.

No comments:

Post a Comment