Pages

Monday

జడ్జీల ఎంపికలో వృత్తినిపుణులు...


మన న్యాయవ్యవస్థలో నెలకొనివున్న శోచనీయ పరిస్థితులకు పెండింగ్‌లోఉన్న కేసుల సంఖ్యే ఒక నిదర్శనం. న్యాయమూర్తులు వెలువరిస్తున్న తీర్పుల ప్రమాణాలు సైతం అంతకంతకూ దిగజారిపోతున్నాయని న్యాయవాదులు వాపోతున్నారు. నైతిక నిష్ఠ సందేహాస్పదమైన వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులుగా నియమితులవుతున్నారు. న్యాయవ్యవస్థలో పరిస్థితులను చక్కదిద్దడానికి, ముఖ్యంగా న్యాయమూర్తుల నియామకానికి జాతీ య స్థాయిలో ఒక జుడీషియల్ కమిషన్ నేర్పాటు చేయాలని పలు రాజకీయపక్షాలు కోరుతున్నాయి. 

ప్రస్తుతం న్యాయమూర్తులపై వస్తు న్న ఫిర్యాదులను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తులతో కూడిన జడ్జీల సంఘం విచారణ జరుపుతోంది. ఈ ఫిర్యాదులపై విచారణకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఒకటి పరిశీలనలో ఉన్నది. ప్రతిపాదిత కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తే ఉంటారు. సభ్యులుగా సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వారు వుంటారు. అదనంగా కొంతమంది ప్రముఖ పౌరులను కూడా నియమించాలనే ప్రతిపాదన ఒకటి వుంది. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాత్మక పాత్రలో ఎటువంటి మార్పు ఉండబోదు. 

ప్రధాన సమస్యేమిటంటే న్యాయమూర్తులు ఆ అత్యున్నత స్థానాలలో తమ నియామకాలకు ప్రభుత్వ మద్దతు పై ఆధారపడివుండడం. వృత్తి జీవితంలో వారి పురోగతిపై ప్రభుత్వం తన నీడలను సదా ప్రసరిస్తూనే ఉంటుంది. జుడీషియల్ కమిషన్ సభ్యులు సుప్రీంకోర్టు సీనియర్ న్యామూర్తులయినా లేక ప్రభుత్వం నియమించిన వారయినా పరిస్థితిలో పెద్దగా తేడా ఉండదు. జోధ్‌పూర్ రైతు ఒకరు సమస్యను ఇలా వివరించారు: 'తీర్పు ఇచ్చినందుకు వేతనాన్ని తీసుకొనే వ్యక్తి న్యాయం చేయలేడు. 

స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తి మాత్రమే న్యాయం చేయగలుగుతాడు'. మన సంప్రదాయంలో 'పాంచ్' కు వేతనాలు సమకూర్చరు. ఈ పంచాయతీ న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుందో కొద్ది సంవత్సరాల క్రితం బెంగళూరు మురికివాడలో నేను ప్రత్యక్షంగా గమనించాను. ఏదైనా ఒక తగవు చోటుచేసుకున్నప్పుడల్లా ఆ వాడ ప్రజలు ఒకచోట గుమిగూడతారు. తమ నుం చి ఐదుగురు పెద్దవారిని న్యాయమూర్తులుగా ఎంపిక చేసుకుంటా రు. ఈ ఎంపికకు ఎటువంటి ఓటింగ్ పద్ధతినీ అనుసరించరు; మురికి వాడ అధ్యక్షుడు గానీ, మరెవరూ గానీ వారిని నియమించరు. ఆ మురికివాడవాసులే ఏకాభిప్రాయంతో వారిని ఎంపిక చేసుకుంటారు. 

మన రాజ్యాంగ వ్యవస్థలో న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమిస్తుంది. మరి పాలకులు ఇష్టపడిన వ్యక్తి మాత్రమే న్యాయమూర్తి కాగలుగుతాడు. వివిధ అంశాలపై ప్రభుత్వం అనుసరించే విధానాలకు సానుకూలంగా ఉండే వారు మాత్రమే న్యాయమూర్తులవ గలుగుతారు. కనుక నిష్పాక్షికమైన తీర్పులను వెలువరించడంలో వారికి అనేక పరిమితులు ఉంటాయి. 

న్యాయపాలన విషయంలో మన సంప్రదాయ చింతనారీతులను అర్థం చేసుకోవల్సిన అవసరముంది. సంస్కృత విద్వాంసురాలు ఒక సదస్సులో ఆ పురా సంప్రదాయాన్ని వివరించారు. కాళిదాస మహాకవిని ఉటంకిస్తూ ప్రభుత్వాన్ని ఐదు పద్ధతులలో అదుపులో ఉంచవచ్చని ఆమె తెలిపారు. అవి: ఒకటి- జ్ఞానం లేదా అధ్యయన శీలత; రెండు- ఒక గురువు బోధనలు; మూడు-విమర్శ; నాలుగు-సాధువులు పెట్టే శాపాలు. నేటి న్యాయవ్యవస్థ ఈ పద్ధతులను ఉపయోగించలేదు. ప్రభుత్వానికి జ్ఞానాన్ని లేదా వివేకాన్ని అది సమకూర్చలేదు. 

న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి గురువు కాదు. న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని విమర్శించగలదు; అయితే న్యాయమూర్తులు తమ నియామకాలు, వేతన భత్యాలు, పదోన్నతులకు పూర్తిగా ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై ఆధారపడివుంటారు కనుక అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేరు. శాపాలు పెట్టగల జ్ఞానం, శక్తి సామర్థ్యాలు నేటి న్యాయమూర్తులకు పూర్తిగా కొరవడ్డాయి. కనుక న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని నియంత్రించ లేదు; ప్రజలకు నిష్పాక్షిక న్యాయా న్నీ సమకూర్చలేదు. 

ప్రభుత్వానికి గాక, ప్రజలకు జవాబుదారీగా ఉండే న్యాయ వ్యవస్థను నెలకొల్పుకోవల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. న్యాయమూర్తులు తమ తీర్పులను నిష్పాక్షికంగా ఇవ్వాలంటే ప్రభుత్వం న్యాయవ్యవస్థలో ఏ విధంగానూ జోక్యం చేసుకోకూడదు. న్యాయవ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. వృత్తి నిపుణుల సంఘాల అధ్యక్షులను న్యాయమూర్తుల ఎంపిక సంఘంలో సభ్యులుగా నియమిస్తే న్యాయమూర్తులు స్వేచ్ఛగా వ్యవహరించేందుకు దోహదం జరుగుతుంది. డాక్టర్లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. అలాగే రైతులు, వ్యాపారస్తులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులకు వారి వారి వృత్తి పరమైన సంఘాలు ఉన్నాయి. 

ఈ వృత్తి నిపుణుల సంఘాల నాయకులను జుడీషియల్ కమిషన్‌లో సభ్యులుగా నియమించాలి. సదరు సభ్యులు ప్రభుత్వ ఉదారత నుంచి గాక, వృత్తి సంఘాల సభ్యుల నుంచి తమ హక్కు లు, అధికారాలను పొందుతారు. తద్వారా వారు ప్రభుత్వ నిర్ణయాలను, న్యాయమూర్తుల పక్షపాత తీర్పులను వ్యతిరేకించగలుగుతారు. ఒక నిర్దిష్ట వివాదంలో తమ తీర్పు వెనుక తర్క బద్ధతను పాంచ్‌ను మురికివాడ వాసులు ప్రశ్నించగలుగుతారు. అలాగే రైతుల సంఘాధ్యక్షుడు న్యాయమూర్తుల నిర్ణయాల తర్క బద్ధతను ప్రశ్నిస్తాడు. లోక్‌పాల్ నియామకంలో కూడా ఇదే విధానం సముచితంగా ఉంటుంది. 

No comments:

Post a Comment