Pages

Monday

అమెరికా అర్మీకి కోత! సైన్యం సంఖ్య లక్షకు కుదింపు పదాతి దళంలో 70వేల మందికి విశ్రాంతి

ఐదేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం
రక్షణ బడ్జెట్ తగ్గడమే కారణం
పదేళ్లలో రూ.24,35,000 కోట్ల మేర తగ్గించనున్న ప్రభుత్వం
సంఖ్య తగ్గినా పదును తగ్గదు: పనెట్టా


అగ్రదేశం అమెరికా తన సైన్యాన్ని తగ్గించుకోనుంది. వచ్చే ఐదేళ్లలో లక్ష మంది మేర త్రివిధ సైనికుల సంఖ్యను కుదించాలని, కొత్తగా ఎవరినీ భర్తీ చేసుకోరాదని నిర్ణయించింది. అంతేకాదు, అందుబాటులో ఉన్న మిలిటరీ, నేవీ, వైమానిక శక్తికే మరింత పదును పెట్టి పొదుపు పాటించాలని నిశ్చయించింది. 9/11 దాడి తరువాత సైనిక శక్తిని అమేయంగా పెంచేసిన అమెరికా, ఇప్పుడీ 'కుదింపు' నిర్ణయం తీసుకోవడం వెనక కారణం? 

ఆ దాడికి సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఆద్యుడు బిన్ లాడెన్ హతమవడంతో అమెరికా 'నిశ్చంత' భావనకు గురవుతున్నదా లేక ఆగర్భ శత్రువు, లిబియా నేత గడాఫీ అంతం కావడంతో ఇక బయట ముప్పు లేదనుకుంటున్నదా.. ఈ ప్రశ్నలకు కాదనే సమాధానం ఇస్తున్నారు ఆ దేశ రక్షణ మంత్రి లియోన్ పనెట్టా. పిండికొద్ది రొట్టె అనే సామెతను ఆయన గుర్తు చేస్తున్నారు. దేశ బడ్జెట్‌లో రక్షణ బడ్జెట్‌కు వచ్చే పదేళ్లలో 487 బిలియన్ అమెరికా డాలర్ల ( రూ.24,35,000 కోట్లు )కోత పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సైన్యం సంఖ్యను కుదించాల్సి వస్తోందని పనెట్టా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. 

సైనిక విభాగంలో 72 వేల మంది (మొత్తం 5,62,000 మంది), నేవీ విభాగంలో 20 వేల మంది (మొత్తం 2,02,000 మంది) చొప్పున కుదిస్తామని వివరించారు. పొదుపు పద్ధతులను సూచనాప్రాయంగా ఆయన వెల్లడించారు. " సీ-5ఏ, సీ-130 యుద్ధ విమానాల్లోని కాలం చెల్లిన సిబ్బందికి విశ్రాంతినిస్తాం. 60 సాంకేతిక బృందాల్లో ఆరుంటిని, ఒక శిక్షణా టీమ్‌ను రద్దు చేస్తాం. అంత ఉపయోగం లేని తక్కువరకం క్షిపణులకు సెలవు ఇచ్చి, వాటి స్థానంలో అత్యాధునిక విధ్వంసక క్షిపణులను రంగంలోకి దించుతాం. 

అలాగే కొన్ని యుద్ధ పరికరాలు, సహాయక యుద్ధ నౌకలను పక్కన పెడతాం'' అని వివరించారు. వైమానిక దళ సామర్థ్యం పరీక్షించడానికి పదాతి దళాల కుదింపు నిర్ణయం దోహదం చేస్తుందని రక్షణ శాఖ సమీక్షా సమావేశం అభిప్రాయపడినట్టు చెప్పారు. వైమానిక దళంలోని అనవసర విభాగాలు, పరికరాలు, వాహనాలను రద్దు చేసుకోవాలని, తక్షణం ఉపయుక్తమనుకున్న వాటిని రంగంలోకి తెచ్చి, వాటి ప్రమాణాలను, నాణ్యతను కాపాడాలని సమావేశం నిర్ణయించిందని చెప్పారు. సంఖ్యను కుదించినా ఎంతమాత్రం పదును తగ్గదని పనెట్టా వివరించారు.

No comments:

Post a Comment