Pages

Friday

ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ఉన్నాయి...

పొలంలో పనులన్నీ ముగించుకుని  ఒక రైతు సాయంత్రం యింటికి తిరిగివస్తున్నాడు.బాగా అలసిపోయి ఉండటంతో,ఎప్పుడెప్పుడు ఇల్లుచేరి స్నానం చేసి,భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామా అని అతని మనసు తహతహలాడుతుంది.అలా నడుస్తూ ఒకరాళ్లగుట్ట దగ్గరకు వచ్చాడు.ఆరాళ్ళ సందుల్లో ఒకపులితోక ఇరుక్కుని,చాలా పెద్దది,కిందకీ,పైకీ కదులుతోంది.
రైతు భయంతో వణికిపోయాడు.పులితోకను వదిలించుకుని రైతుమీదకు దూకాలని ప్రయత్నించింది.కానీ రైతు పులితోకను అతనివైపుకు లాగాడు.పులి భీభత్సంగా గర్జిస్తూ,బుసలుకొడుతుంది.రైతు చెమటతో ప్రాణభీతితో తడిసి ముద్దయి పోయాడు.కొంతసేపయ్యాక అ దారివెంట ఒకముని వెళుతూ కనిపించాడు.
ఓహొ!దేవుడే ఈ సాధువును పంపించాడని భావించి.‘స్వామీ,అదిగో నేలమీద నా కొడవలి ఉంది,ఈపాడు పులిని  చంపి నాప్రాణం కాపాడండి’అంటూ బతిమలాడాడు రైతు.ఆ ముని రైతు వైపు ప్రశాంతంగా చూసి ‘ప్రాణాలు తీయటమనేది నా సిద్ధాంతాలకు విరుద్ధం’ అన్నాడు. ‘అయ్యో అవేం మాటలు స్వామీ,నేను ఈ తోకను వదిలేస్తే పులి నామీద పడి హతమారుస్తుంది’అని వేడుకున్నాడు.‘నేనేం చెయ్యలేను నాయనా,మా మతవిశ్వాసాల ప్రకారం,ఏజీవరాశి ప్రాణం తీయకూడదు’శెలవిచ్చాడు ముని.‘మీరు నాకు సాయం చెయ్యకపోతే ఈ పులి నన్ను చంపుతుంది,అప్పుడు నాచావుకు కారణం మీరే అవుతారు గదా! అని తర్కించాడు రైతు.దానికి కూడా,‘అడవిలో బలమైన జంతువు బలహీనమైన ప్రాణిని చంపటమనే సామాన్య ఆటవిక న్యాయముంటుంది,దానికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను,శాస్త్రాలలో జీవహింస చేయకూడదూ అని ఆజ్ఞాపించారు’అంటూ చెప్పుకొచ్చాడు మునివర్యుడు.
రైతు చేతుల్లో ఓపిక మెల్లగా క్షీణిస్తుంది.ఏ క్షణాన్నైనా పులి తప్పించుకుపోయే ప్రమాదం ఉంది.దానితో ఒక ఉపాయం ఆలోచించాడు అతను.
‘స్వామీ,శాస్త్రాలకు వ్యతిరేకంగా మీరు ఎందుకు చెయ్యాలి కానీ,మీరు పులిని చంపొద్దు,కాకపోతే నాకొక చిన్న సాయం చెయ్యండి.మీరు పులి తోక పట్టుకోండి.నేను దాని సంగతి చూస్తాను’అని బతిమలాడుకున్నాడు.
‘పులితోక పట్టుకొవద్దని మా పురాణాల్లో చెప్పలేదులే,కాబట్టి,నువ్వడిగినట్టు చేస్తాను’ అన్నాడు ముని.రైతు చేతుల్లో నుంచి పులితోక పట్టుకున్నాడు.రైతు పక్కకు వచ్చి కండువాతో చెమట తుడుచుకుని తాపీగా,‘పట్టుకున్నావా?’ అని అడిగాడు.‘ఆ.. పట్టుకున్నాను’ చెప్పాడు ముని.‘గట్టిగా పట్టుకున్నావా?లేదా?అడిగాడు రైతు.‘ఆహా,గట్టిగానే పట్టుకున్నాను’అని బదులిచ్చాడు ముని.
కింద ఉన్న కొడవలి తీసుకుని,బట్టలకు అంటుకున్న దుమ్ము దులుపుకుని,తన ఊరికేసి బయలు దేరాడు రైతు.పులి మళ్ళీ ముందుకు లాగటం మొదలుపెట్టింది.మునికి అప్పుడు ప్రాణభయం అంటే ఏమిటో తెలియటం మొదలయ్యింది.‘త్వరగా వచ్చి పులిని చంపు,చంపేయ్’అంటూ అరవసాగాడు.రైతు అవేమీ వినిపించుకోకుండా తన ఊరివైపు వెళుతూనే ఉన్నాడు.
‘ఓయ్,ఎక్కడికి వెళ్తున్నావ్?ఇదిగో నేను ఈతోక ఎక్కువ సేపు పట్టుకోలేను,వచ్చి పులిని నరికేయ్’అంటూ కేకలు పెడుతున్నాడు.ఆకేకలకు రైతు ఆగి,‘స్వామీ,జీవహింస చెయ్యకూడదు అనే మీ హితోపదేశం విన్నాక,నేను కూడా పూర్తిగా మారిపోయాను,భూతదయ అలవర్చుకున్నాను.నన్ను మార్చారు స్వామీ మీరు,పులితోకను అలాగే పట్టుకోండి ఓపికగా,మన సిద్ధాంతలు నమ్మనివారెవరన్నా ఇటువచ్చి మిమ్మల్ని విడిపిస్తారు,శెలవు స్వామీ అంటూ మునికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు రైతు.

No comments:

Post a Comment