బటన్ అనేరాజ్యాన్ని పరిపాలించే రాజుకు విలువిద్య అంటే ప్రాణం.అనేకమంది రాజులు,సంపన్నులు,గుర్రపుస్వారీ,ఆటపాటలు,వస్తాదుల కుస్తీ పోటీలతో కాలక్షేపం చేస్తుంటే ఈరాజుకు మాత్రం విలువిద్యను మించిన వ్యాపకం మరొకటిలేదు.రాజాస్థానంలోని మంత్రులు,ఉద్యోగులకు రాజకీయాలు,భక్తి,సాహిత్యాలను గురించి చర్చించుకోవటం ఇష్టమయినా రాజు కొరకు వాళ్ళందరూ తమ సంభాషణలను విలువిద్యమీదకే మళ్ళించేవారు.
ఆ రాజ్యంలో ఎందరో యువకులు రాజుగారి కుమార్తెను పెళ్ళాడాలని ఉవ్విళ్ళూరుతుండేవారు.ఆ విషయమై ఎన్నో ప్రయత్నాలు కూడా చేసారు.కానీ,గొప్ప విలుకాడు అయిన వీరుడికే తనకుమార్తెను ఇచ్చి వివాహాం చేస్తానని రాజు స్పష్టం చేసాడు.ఆసంగతి ఆనోటా,ఈనోటా దేశమంతటా పాకింది.
బజన్ బుడిమాన్ అనేవ్యక్తి ఎలాగైనా రాకుమారిని భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.అతను నూకలు చల్లి,వలవేసి కొన్ని పక్షులను పట్టగలిగాడు,తర్వాత వాటన్నిటికి కుడికన్ను తొలగించాడు.ఒక తాడుకు వాటన్నిటినీ కట్టి,‘ఒంటికంటి పిట్టలు అమ్ముతాం,ఒంటికంటి పిట్టలు అమ్ముతాం’అని అరుస్తూ వీధుల్లో తిరుగటం మొదలుపెట్టాడు.కానీ,ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.అలాగే అరుస్తూ,తిరుగుతూ రాజుగారి కోట గుమ్మం ముందుకు వచ్చాడు.‘ఒంటికంటి పిట్టలు అమ్ముతాం’అంటూ కేకలు పెట్టాడు.ఒంటికంటి పిట్టలు అనే మాట వినడంతో కోటలో సైనికులు,పరిచారికలు పగలబడి నవ్వటం మొదలుపెట్టారు.తన పరివారం ఎందుకు నవ్వుతున్నారో తెలుసుకున్న రాజు,ఆ అరిచే వాడిని తనముందు ప్రవేశపెట్టమన్నాడు.వేటగాడిని తెచ్చి రాజుముందు నిలబెట్టారు.
‘మహారాజా, ఇవి చాలా తాజా పక్షులు, ఇవ్వాళ ఉదయాన్నే పట్టాను’అని చెప్పుకొచ్చాడు బజన్. ‘అవునూ,ఒక్కకన్ను పక్షుల్నే ఎలా పట్టగలిగావు’అని ఆరా తీసాడు రాజు.దానికి,‘అవి మామూలుగా రెండు కళ్ళు ఉన్న పక్షులే ప్రభూ,కాకపోతే,నేను వాటిని నాబాణంతో కుడికంటిలో కొట్టి పట్టగలిగాను’అని వివరించాడు బజన్.
‘ఏమిటి మాతోటి వేళాకోళమా?’అని కోపగించుకున్నాడు రాజు ఆ మాటలకు.‘కాదు ,మహారాజా,తమరే పరీక్షించండి’అని కోరటంతో రాజు వాటిని శ్రద్ధగా పరిశీలించాడు. అన్ని పక్షులకూ కుడికంటిలో బాణం దెబ్బతగిలినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు.‘ఇంతకు ముందు నీగురించి నేనెప్పుడూ వినలేదే?మన రాజ్యం మొత్తం మీద నిన్ను మించిన విలుకాడు లేడ’ని కితాబిచ్చాడు రాజు.
‘నాదేముంది ప్రభూ,ఏదో పొట్టకూటి కోసం పిట్టలను పట్టుకుని బ్రతికేవాడిన’ని వినయంగా బదులిచ్చాడు బజన్.‘బజన్,విలువిద్యతో పాటు వినయం కూడా ఉన్న నీవే రాకుమారికి తగిన భర్తవ’ని రాజు ప్రకటించాడు.దానికి మరింతవినయంగా‘మీరిచ్చే బహుమతిని అందుకోవటానికి నాలాంటి నిరుపేద,అజ్ఞాని తగడు మహారాజా’అని బదులిచ్చాడు. ‘లేదయ్యా,నీలాంటి భర్త దొరకటం మాఅమ్మాయి అదృష్టం అని మరింతగా ప్రశసించాడు రాజు ఆనందంతో.‘ప్రభూ,మీ అమ్మాయి నన్ను పెళ్ళాడినా,నాతో పూరి గుడిసెలో ఉంటూ పొట్టకూటి కోసం ఇదిగో ఈ ఒంటి కంటి పిట్టలను అమ్ముకోవాల్సిందే’అని నిరాశగా అన్నాడు బజన్.
‘ఇంకా నువ్వు ఆ పిట్టలూ,ఈపిట్టలూ ఎందుకమ్ముతావోయ్?!వీరాధివీరవిలుకాడిగా,ఇక్కడే
మాతోటి రాజభవనంలో నివసిస్తావు గానీ’అని వివరించాడు రాజు.బజన్ ను లోపలికి తీసుకుపోయి స్నానం చేయించి.చక్కగా అలంకరించి,కొత్తబట్టలు ధరింపజేయమని ఆజ్ఞాపించాడు.తర్వాత ఒకవారం రోజులతర్వాత బజన్ కు,రాజకుమారికి రంగరంగ వైభవంగా వివాహం జరిగింది.విందులు,వినోదాలతో కొన్నిరోజులు క్షణాల్లా గడిచిపోయాయి.
ఒకరోజు,‘బజన్,నీ విలువిద్యానైపుణ్యాన్ని చూడాలని మాకెంతో ఉబలాటంగా ఉంది,ఈరోజు ధనుర్విద్య ప్రదర్శనతో మమ్ముల్ని ముగ్ధులిని చెయ్యాల’ని కోరాడు రాజు.‘అయ్యో,నా విల్లంబులు లేవే?’అని తప్పించుకునేందుకు ప్రయత్నించాడు బజన్.‘ఇంకా ఆ విల్లెందుకు?మా ధనస్సు ఉపయోగించు’అని రాజు తన విల్లంబులు బజన్ కు అందజేసాడు.‘సాయంత్రం వరకూ ఆగి అప్పుడు చూద్దాం’ అని సమాధానమిచ్చాడు బజన్.‘అలా కాదు,నీ ప్రతిభాపాటవాలు చూడాలని ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చారు,వారిని నిరాశపర్చటం సమంజసం కాదు,ఇప్పుడే,ఇక్కడే నీ కౌశల్యం ప్రదర్శించాలని రాజు గట్టిగా చెప్పాడు.
బజన్ కు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.అందరూ బజన్ ఎప్పుడు తనవిద్యను ప్రదర్శించటం మొదలుపెడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చివరికి చేసేదేమీ లేక విల్లు ఎక్కుబెట్టి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు.పైన కొంగలు బారులుబారులుగా ఎగురుకుంటూ పోతున్నాయి.అయిపోయిందిరా బజన్ పని అయిపోయింది,రాజకుమారితో నీపెళ్ళి ముచ్చట మూడురోజుల్లో ముగిసింది,బాణాన్ని వదిలావా నీ పని అయిపోయినట్టే,కాకపోతే ఎలా బాణం వదలాలో కూడా నాకు తెలిసి చావదే’అంటూ లోలోపల మధనపడిపొతున్నాడు బజన్.విగ్రహంలా అలా నిలబడిపోవటం తప్ప విల్లంబులకు పని చెప్పకపోవటంతో జనానికి విసుగెత్తింది.
‘వీడికసలు నిజంగా విలువిద్య వచ్చంటావా?’అంటూ ఒకడు పక్కవాడిని అడిగాడు.‘చూడబోతే వచ్చినట్టు లేదే ’అన్నాడు ఆపక్కవాడు.మరో పక్కవాడు ‘రానట్టుగా ఉంది ’అంటూ పెదవి విరిచాడు.ప్రజలు రకరకాలుగా అరుస్తున్నారు,కేకలు పెడుతున్నారు,ఎగతాళి చేస్తున్నారు కానీ బజన్ ఉలకడు,పలకడు.విసుగుతోపాటు కోపమొచ్చిన కుర్రాడొకడు,రాకుమారిని పెళ్ళాడాలని కోరుకున్న వారిలో ఒకడు వీడికేం రాదంటూ బజన్ వీపు మీద చరిచాడు.హఠాత్తుగా తగిలిన దెబ్బకు ఉలికిపడి బజన్ బాణాన్ని గాలిలోకి విడిచాడు.ఆబాణం వెళ్ళి అటుగా ఎగురుతున్న కొంగలగుంపులో ఒకకొంగ మెడలో గుచ్చుకుంది.బాణం పైకిపోయినంత వేగంగా కొంగకిందపడింది.జనమంతా ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.
రాజు ముందుకొచ్చి ‘గాలిలో ఎగిరేకొంగను మెడలో తగిలేలా కొట్టగలగటం అనేది ఎంతో అద్భుతం’
అంటూ ప్రశంసించాడు.అయితే బజన్ మాత్రం చాలా ఇబ్బందిగా ముఖం పెట్టి,‘ఈరోజు నా పరువంతా పోయింది,నేను ఎప్పుడూ పక్షుల్ని గురితప్పకుండా కుడికంటిలోనే కొట్టేవాడిని,ఇడుగో ఈ తలతిక్క వెధవ నన్ను వీపు మీద చరవకపోతే చక్కగా,ఆకొంగ కుడి కంటికి తగిలేలా నా బాణం వదిలేవాడిని.మిగిలిన కొంగలు బజన్ ప్రతాపం తగ్గిపోయిందని దేశదేశాల్లో ప్రచారం చేస్తాయే!?అద్దంలో నా ముఖం నేను ఎలా చూసుకోను ఇకపై,మిగతా వారికి ఎలా చూయించను?!ఇకముందు,జీవితంలో మళ్ళీ విల్లంబుల్ని నాచేతితో తాకను అని దేవుడిమీద ఒట్టుపెట్టుకుంటున్నాను’అంటూ ధనుర్బాణాలను ముక్కలుముక్కలుగా చేసాడు.బజన్ వీపుమీద కొట్టినవాడికి కొరడాదెబ్బల శిక్షపడింది.రాజు తర్వాత ఆ రాజ్యానికి బజన్ రాజయ్యాడు.
No comments:
Post a Comment