Pages

Tuesday

ట్రిలియన్ డాలర్ హోదా గోవిందా ,నాలుగున్నరేళ్ల రికార్డుకు పాతర

ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన స్టాక్ మార్కె ట్లు ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. అత్యంత అరుదైన ఈ హోదా భారతీయ స్టాక్ మార్కెట్‌కూ ఇప్పటివరకు ఉంది. మంగళవారం నాటి పతనంతో ఈ హోదా మటుమాయమైంది. సెన్సెక్స్ 28 నెలల కనిష్ఠానికి పతనం కావడంతో ట్రిలియన్ డాలర్ల క్లబ్బు నుంచి ఇండియన్ మార్కెట్ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకూ ఈ హోదా 14 దేశాలకు మాత్రమే ఉంది. భారత్ నిష్క్రమణతో ఈ క్లబ్బు సభ్యుల సంఖ్య 13కు పరిమితమైంది. సరిగ్గా నాలుగున్నరేళ్ల క్రితం 2007 మే 28న ట్రిలియన్ డాలర్ల క్లబ్బులో భారత్ తొలిసారిగా స్థానం సంపాదించింది. అక్కడి నుంచి బుల్‌స్పీడ్‌తో సెన్సెక్స్ దూసుకుపోవడంతో 2008 జనవరిలో ఒకసారి, 2011లో మరోసారి రెండు ట్రిలియన్ డాలర్ల సమీపంలోకి (1.9 ట్రిలియన్ డాలర్లు) భారతీయ స్టాక్ మార్కెట్లు చేరుకున్నాయి. కాని ఆ తర్వాత ఏర్పడిన పతనాలతో బిఎస్ఇలో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 52,60,440 కోట్లకు (99,497 కోట్ల డాలర్లు) క్షీణించింది. మంగళవారం డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.52.87.

ఈ లెక్కన మార్కెట్ క్యాప్ ట్రిలియన్ డాలర్ల కంటే తగ్గింది. భారత్‌ను మినహాయిస్తే.. ట్రిలియన్ డాలర్ల క్లబ్బులో ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, దక్షిణ కొరియా, చైనా, జపాన్, స్పెయిన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు కొనసాగుతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ విలువ రూ. 51,42,566 కోట్లకు పరిమితమైంది. ప్రస్తుతం బిఎస్ఇలో 2,900 కంపెనీలు లిస్ట్ కాగా ఎన్ఎస్ఇలో 1,600 కంపెనీలు మాత్రమే లిస్ట్ అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో భారతీయ స్టాక్ మార్కెట్ విలువ 73 లక్షల కోట్ల రూపాయలు. ప్రస్తుత విలువను పరిగణనలోకి తీసుకుంటే మార్కెట్ క్యాప్‌కు ఏకంగా 20 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది.

No comments:

Post a Comment