Pages

Friday

అవినీతి నిర్మూలనకు లోక్‌పాల్ ఒకటే సరిపోతుందా..?



ఇటీవల అవినీతి, దాని నిర్మూలన సగటు భారతీయుని ఆలోచన, సంభాషణ సరళిలో ప్రముఖ ఘట్టం. రాష్ట్రపతి మొదలుకుని గ్రామీణ ప్రాంతంలోని నిరక్ష్యరాస్యులు, నిరుపేదలతో సహా అందరూ అవినీతిని తుదముట్టించాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు కనపడుతుంది. ఇంతకీ అవినీతి అంటే ఏమిటి? ప్రభుత్వ అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకోవడమే అవినీతి. సాధారణ పరిభాషలో అవినీతి అంటే లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం. వాస్తవానికి దీని పరిధి మరింత విస్తృతం. చట్టవ్యతిరేకమైన ఏ కార్యకలాపమైనా అవినీతి కిందకు వస్తుంది.

ఉదారవాదం, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో భారత్‌లాంటి దేశాలు ఆర్థికంగా ఎంతో పురోభివృద్ధిని సాధించినప్పటికీ అంతే మోతాదులో అవినీతి కూడా పెరిగిపోయిందనే విమర్శ కూడా ఉంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 2010లో వెలువరించిన వివరాల ప్రకారం భారతదేశంలో ఉన్న నల్లధనం ప్రపంచం మొత్తంలో ఉన్న న ల్లధనం కంటే ఎక్కువ. ఇటీవల చోటుచేసుకున్న 2 జీ స్పెక్ట్రం, కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణాలలో ఊహించలేనంత పెద్ద మొత్తంలో నల్లధనం అక్రమంగా చేతులు మారినట్లు మనందరికీ తెలిసిందే.

ఒకవైపు రాజకీయ నాయకులు, ఇంకోవైపు ప్రభుత్వోద్యోగులు ధనదాహంతో అవినీతికి గేట్లు ఎత్తుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని పారిశ్రామికవేత్తలు, నేరపూరితులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు దాదాపు పదివేల కోట్లు ఖర్చు అయ్యాయి. అందులో ఎన్నికల సంఘం కేవలం * 1300 కోట్లు ఖర్చు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు * 700 కోట్లు ఖర్చు పెట్టాయి. మిగిలిన * 8,000 కోట్లు వివిధ రాజకీయ పక్షాల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు ఖర్చు చేశారు.

ఇంత భారీ ఎత్తున ఎన్నికల ఖర్చు జరిగిందంటే భారతదేశంలో నల్లధనం ఏ మేరకు పేరుకుపోయిందో అర్థమవుతుంది. ప్రపంచ విత్త నైతిక నివేదిక అంచనాల ప్రకారం భారతదేశానికి చెందిన ధనం అక్రమంగా ఇతర దేశాల్లో 1.4 ట్రిలియన్ డాలర్లు (70 లక్షల కోట్లు) దాచిపెట్టడం జరిగింది. దీనిని బట్టి భారతదేశం అవినీతిలో ఏ మేరకు కూరుకుపోయిందో తెలుస్తుంది.

క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దంలోనే కౌటిల్యుడు తాను రాసిన అర్థశాస్త్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి అనివార్యమని, దానిని నిర్మూలించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. ఆధునిక కాలంలో బ్రిటీష్ పాలనలో అవినీతి ప్రభుత్వ యంత్రాంగంలో కొంత ఉన్నప్పటికి ప్రస్తుత భారీ కుంభకోణాలతో పోలిస్తే అది నామమాత్రమే.

ఆరో దశకంలో ప్రభుత్వ యంత్రాంగంలో పెరుగుతున్న అవినీతిపై పార్లమెంటులో విస్తృత చర్చలు జరగడం వల్ల సీనియర్ పార్లమెంటేరియన్ సంతానం అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ సూచనల మేరకు 1964లో కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది కేవలం అవినీతి నిర్మూలనకు సలహాలిచ్చే సంస్థ మాత్రమే. ఏడో దశకం నుంచి మొదటి పాలన సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు కొన్ని రాష్ట్రాలు లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశాయి.

జాతీయ స్థాయిలో పటిష్టమైన లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒకవైపు రాజకీయ పక్షాలు, ఇంకోవైపు ఉద్యోగస్వామ్య వ్యవస్థ అయిష్టతను చూపడంతో అనేక దఫాలు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పటిష్టమైన లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని అనేకసార్లు ప్రకటించినప్పటికీ ఏదో నెపంతో దాన్ని నీరుగార్చింది.

ఈ నేపథ్యంలో అన్నాహజారే నాయకత్వాన పౌరసమాజం అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించటం, అందులో భాగంగా జనలోక్‌పాల్ బిల్లును రూపొందించి దానిని యధావిధిగా పార్లమెంట్ ఆమోదించాలని పట్టుబట్టింది. గత్యంతరం లేక ప్రభుత్వం తనదైన శైలిలో బలహీనమైన లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వాస్తవానికి ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లు, అన్నా బృందం జనలోక్‌పాల్ బిల్లు రెండూ ఆచరణాత్మకం కాదు.

ప్రభుత్వం ప్రతిపాదించిన అంబుడ్స్‌మన్ (లోక్‌పాల్) వ్యవస్థ ఎలాంటి అధికారాలు లేని కాగితపు పులి అయితే జనలోక్‌పాల్ అపరిమిత అధికారాలు కలిగి అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఇస్తుంది. అన్నాహజారే బృందం అభిప్రాయం ప్రకారం లోక్‌పాల్ పరిధి కేంద్రంలోని అన్ని స్థాయిలలోని ప్రభుత్వోద్యోగులు, స్వచ్ఛంధ సేవా సంస్థలు, కార్పొరేట్ వ్యవస్థలకు విస్తరిస్తుంది. న్యాయ వ్యవస్థ, ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీని పరిధిలోకి వస్తాయి. తొమ్మిదిమందితో కూడిన ఈ బహుళ సభ్య వ్యవస్థ ప్రాసిక్యూటర్‌గా, న్యాయమూర్తిగా వ్యవహరిస్తుంది. సీబీఐలాంటి నేర విచారణ చేసే వ్యవస్థలు దీని పరిధిలోకి వస్తాయి.

సీబీఐ, సీవీసీలాంటి వ్యవస్థలు తమకు మరింత స్వత్రంతప్రతిపత్తి కావాలని, లోక్‌పాల్ పరిధిలోకి వస్తే తమ విధులకు న్యాయాన్ని చేకూర్చలేమని అభ్యంతరం తెలిపాయి. పై రెండు నమూనాలకు మధ్యస్థంగా అరుణారాయ్ నేతృత్వంలోని ప్రజల సమాచార హక్కు జాతీయ ఉద్యమం ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇది కొంతమేరకు అన్నా బృందం నమూనాతో ఏకీభవించినప్పటికీ, ఉన్నత స్థాయిలోని న్యాయవ్యవస్థను లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకించింది.

ప్రధానమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తేవడాన్ని ఇది ఆమోదించినప్పటికీ, ప్రధానమంత్రికి కొన్ని రక్షణలు కల్పించాలని సిఫారసు చేసింది. గ్రూప్-ఏ తరగతికి చెందిన ప్రభుత్వోద్యోగులను మాత్రమే లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని మిగిలిన ఉద్యోగులను పటిష్టమెన సీవీసీ పరిధిలోకి తేవాలని, పౌరక్లేశ నివారణకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది.

ఇలా అన్ని వర్గాలు లోక్‌పాల్ వ్యవస్థ ఆవశ్యకతను గుర్తించినప్పటికీ ప్రభుత్వం, మేధావులు, పారిశ్రామిక వేత్తలు, న్యాయనిపుణులు అభిప్రాయపడినట్లు లోక్‌పాల్ వ్యవస్థ ఒక్కటే అవినీతిని నిర్మూలించలేదు. లోక్‌పాల్ వ్యవస్థతోపాటు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర నేర విచారణ వ్యవస్థ (సీబీఐ), ప్రతిపాదనలో ఉన్న జాతీయ న్యాయ కమిషన్, అప్రమత్తమైన పౌర సమాజం మొదలైనవి సంఘటితంగా వ్యవహరించినప్పుడే అవినీతిని ప్రభావవంతంగా నిర్మూలించడానికి వీలవుతుంది.

అవినీతి నిర్మూలనకు సూచనలు:
* జాతీయ స్థాయిలో రాజ్యాంగ హోదా కలిగిన లోక్‌పాల్ వ్యవస్థతోపాటు రాష్ట్ర స్థాయిలో అదే హోదాలో పనిచేసే వ్యవస్థలను అనుసంధానం చే యాలి.
* వాస్తవానికి లోక్‌పాల్ వ్యవస్థ అవినీతికి చికిత్స జరపగలదేగాని దానిని నివారించలేదు. దానిని పూర్తిగా నిర్మూలించాలంటే పోలీస్, న్యాయవ్యవస్థ, పాలనా యంత్రాంగాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి.
* నేరమయ రాజకీయ వ్యవస్థను శుద్ధీకరించాలి.
* సమగ్రమైన ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టాలి. అప్పుడే ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని తగ్గించడానికి వీలవుతుంది.
* నిర్ణయీకరణ ప్రక్రియలో పారదర్శకత ఉండాలి.
* ఉద్యోగస్వామ్యానికిచ్చిన విచక్షాధికారాలను తగ్గించాలి. అవినీతికి పాల్పడినవారిని త్వరితగతిన విచారించడం, కఠినమైన శిక్షలు విధించడం అవసరం.
* అసమర్థులను తొలగించి సమర్థులకు బహుమానాలు, పదోన్నతులు లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆసియాలోని ప్రముఖ దేశాల ఉద్యోగస్వామ్యాలతో పోల్చితే మనదేశ ఉద్యోగస్వామ్య సమర్థత అట్టడుగున ఉంది.

అవినీతి ప్రధానంగా ఈ రూపాల్లో జరుగుతుంది.. అవి లాలూచి, బలవంతం, ముందుగా ఊహించడం.
* లాలూచి: ఇందులో ఇరుపక్షాలు (లంచం ఇచ్చేవారు, పుచ్చుకునేవారు) ఆమోదం మేరకు జరుగుతుంది. ఉదా: 2 జీ స్పెక్ట్రం కుంభకోణం. ఇలాంటి సందర్భాల్లో ఇరుపక్షాలను కఠినంగా శిక్షించాలి.
* బలవంతం: ఇందులో ప్రభుత్వోద్యోగి పౌరునికి చట్టబద్ధంగా చేయవలసిన సేవలను నిరాకరిస్తారు.
ఉదా: రేషన్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్లను లంచం ఇవ్వనిదే జారీ చేయరు. దీనివల్ల సగటు పౌరుడు ముఖ్యంగా నిరుపేదలు ఎంతగానో నష్టపోతున్నారు. ఈ తరహా అవినీతిలో ప్రభుత్వోద్యోగులను కఠినంగా శిక్షించాలి.
* ముందుగా ఊహించడం: ఇందులో మంత్రులు, ఉన్నతాధికారులు తమకు అనుకూల నిర్ణయాలను ప్రకటించడానికి బడా పారిశ్రామికవేత్తలు ముందుగానే వారికి ప్రతిఫలాన్ని ముట్టచెబుతారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇరుపక్షాలను కఠినంగా శిక్షించాలి.

అవినీతికి సంబంధించిన సమాచారాన్ని అందించినవారికి తగిన రక్షణ కల్పించడంతోపాటు ప్రోత్సాహకాలు అందజేయాలి. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించడం ద్వారా పారదర్శకత్వాన్ని ప్రోత్సహించి అవినీతిని తగ్గించవచ్చు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో భూక్రయ, విక్రయాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించడం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతిని కొంతమేరకు తగ్గించడానికి వీలైంది. ఆధార్ కార్డ్ ఉపయోగించి నగదు బదిలీ పద్ధతి ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతిని చాలా వరకు తగ్గించవచ్చు.

సమాచార హక్కును ఉపయోగించుకుని పౌరులు ప్రభుత్వం నుంచి ముఖ్య సమాచారాన్ని కోరినప్పుడు దానిని సకాలంలో ఇవ్వకపోతే సంబంధిత ఉద్యోగులపై భారీ ఎత్తున జరిమానా విధించడం ద్వారా ప్రభుత్వం అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించవచ్చు. గనుల కేటాయింపు, భూ సేకరణ, టెలికం స్పెక్ట్రం, ఇంధన వెలికితీత హక్కులు మొదలగు కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత్వాన్ని పాటించాలి. పాలనా వ్యవస్థలో జవాబుదారితనాన్ని పెంచాలి. ఈ-టెండర్ విధానాన్ని అమలు జరపాలి. వస్తువులు, సేవల పన్ను విధానం అవినీతి నిర్మూలనకు శక్తివంతమైన ఆయుధం. ఇది సమాంతర ఆర్థిక వ్యవస్థను నిరుత్సాహపరుస్తుంది.

ఈ విధానంలో అనేక స్థాయిల్లో పన్ను విధిస్తారు కాబట్టి అనధికారకంగా పన్ను పరిధి నుంచి తప్పించుకోవడం కష్టం. ఉదా: స్థిరాస్థి క్రయవిక్రయాలలో భవన నిర్మాణ కార్యకలాపాలకు వినియోగించే సిమెంటు, ఇనుము, కలప కొనుగోళ్లు వాటంతట అవే దీని పరిధిలోకి వస్తాయి. ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రమేయాన్ని వీలైనంత మేర తగ్గిస్తే అవినీతిని చాలావరకు తగ్గించవచ్చు.

పన్ను చెల్లింపు, ఈ-ఫైలింగ్ విధానం ఇప్పటికే అమలులో ఉంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారునికి సంబంధిత అధికారులతో ప్రత్యక్ష సంబంధాలుండవు. అసమగ్ర సమాచారమివ్వడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, వెనుకటి తేదీలతో పత్రాలను సమర్పించడంలాంటి అవకతవకలకు పాల్పడటానికి వీలుండదు. పాన్ ఆధారిత వస్తువుల, సేవల పన్ను రిజిస్ట్రేషన్ ద్వారా పన్ను చెల్లింపుదారుని ఆర్థిక లావాదేవీలను తరచూ తనిఖీ చేయడానికి వీలవుతుంది.

కఠిన చట్టాలు, వాటి అమలు అవినీతి నిర్మూలనకు ఎంతగానో తోడ్పడతాయి. అమెరికాలో లంచం, మోసపూరిత కార్యకలాపాలను చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రముఖ బహుళజాతి సంస్థ సీమన్స్ ఒక బిలియన్ డాలర్ల జరిమానాకు గురైంది. అలాగే బ్రిటన్ 2010లో రూపొందించిన అవినీతి వ్యతిరేక చట్టం ప్రపంచంలోనే అత్యంత పదునైనది. మరి మనదేశంలో అవినీతి వ్యతిరేక చట్టం (1989)లో అన్నీ లొసుగులే. ఆర్థిక వ్యవస్థను ప్రత్యక్షంగా ప్రభావితం చేసేది అవినీతి. విదేశీ, జాతీయ పెట్టుబడుల మీద నకారాత్మక ప్రభావాన్ని చూపడంతోపాటు, సామాజిక అవసరాలైన ఆహార భద్రత, ఆరోగ్యం, విద్య మొదలైనవి పేద ప్రజలకు అందకుండా పోతాయి. వార్షిక జాతీయ స్థూలాదాయంలో రెండు శాతం తరుగు అవినీతి ప్రభావమే.

కిందిస్థాయిలో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు అంతంతం మాత్రమే. వాస్తవానికి సగటు పౌరునికి వీరితోనే ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. వీరికి ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వడం కొంతవరకు అవినీతి నిర్మూలనకు దోహదం చేస్తుంది. మితిమీరిన ఉద్యోగ భద్రత కూడా అవినీతికి కారణమవుతుంది. రాజ్యాంగంలోని 311వ ప్రకరణను సవరించి, అవినీతి పరులను తక్షణం తొలగించే వెసులుబాటు కల్పించాలి. అక్రమ ఆస్తులను రెవెన్యూ చట్టం కింద ప్రభుత్వం సత్వరం స్వాధీనం చేసుకోవడానికి నిబంధనలు సవరించాలి.

అవినీతి వ్యతిరేక ఉద్యమం నిరంతరం కొనసాగాలి. దీనికి నిజాయతీ కలిగిన పటిష్టవంతమైన రాజకీయ నాయకత్వం అవసరం. చురుకైన పౌర సమాజం అంతకంటే అవసరం. ప్రభుత్వోద్యోగుల నియామకాలు, బదిలీ, పదోన్నతి, క్రమశిక్షణా చర్యలలాంటి అంశాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సివిల్ సర్వీస్ బోర్డ్ లాంటి వ్యవస్థకు అప్పగించాలి. రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తొలగించాలి.

10 comments: